విద్యార్థినిపై సామూహిక అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2021-02-11T08:05:12+05:30 IST

హైదరాబాద్‌ శివార్లలో మరో దారుణం.. దిశను గుర్తుకు తెచ్చే ఘటన.. కాలేజీ బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిందో విద్యార్థిని

విద్యార్థినిపై సామూహిక అత్యాచార యత్నం

ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు..

దిగాల్సిన స్టేజీలో ఆపకుండా తీసుకెళ్లిన దుండగులు

ఆపదలో ఉన్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన యువతి

తక్షణమే స్పందించిన పోలీసులు

ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గాలింపు 

పోలీస్‌ సైరన్లు విని పొదల్లో వదిలేసిన దుండగులు

మరో ‘దిశ’ను ఆపిన పోలీసులు!


మేడ్చల్‌/ ఘట్‌కేసర్‌ రూరల్‌/ కీసర రూరల్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివార్లలో మరో దారుణం.. దిశను గుర్తుకు తెచ్చే ఘటన.. కాలేజీ బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిందో విద్యార్థిని. అంతే ఆటోలోని యువకులు ఆమెపై కన్నేశారు. దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా తీసుకెళ్లారు. కీడు శంకించిన ఆ యువతి వెంటనే తాను ఆపదలో ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె సమయస్ఫూర్తికితోడు పోలీసులు తక్షణమే స్పందించడంతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన బుధవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (19) సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్‌ చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యంలో ఆటోలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది.


ఆటోను ఆపాలని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా ఘట్‌కేసర్‌ వైపునకు వేగంగా వెళ్లాడు. భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్‌ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్‌తోపాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డయల్‌ చేశారు. సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్‌ వెళ్లింది. వెంటనే పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్‌ సిగ్నల్స్‌ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో యన్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్‌లోకి మార్చారు. 


ఈ క్రమంలో దాడి చేసి, దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్‌లో ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్‌లతో తిరుగుతుండడంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని అవుటర్‌ రింగ్‌ రోడ్డు అన్నోజిగూడ పాయింట్‌ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది. పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్సై వెంటనే ఆమెను భుజంపై వేసుకొని వాహనంలోకి చేర్చి, వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 7.50 గంటలకు యువతిని పోలీసులు రక్షించారు. అంటే గంటా ఇరవై నిమిషాల్లో గాలింపు ఆపరేషన్‌ పూర్తిచేసి, ఆమెను రక్షించారు. సంఘటన వివరాలను మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి విలేకర్లకు వెల్లడించారు. విద్యార్థిని అపస్మారక ిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


బాధితురాలికి అండగా ఉండాలి: మంత్రి సత్యవతిరాథోడ్‌

విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఆమెకు అండగా ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యకు సూచించారు. 

Updated Date - 2021-02-11T08:05:12+05:30 IST