వెంటాడి.. కత్తిదూశారు!

ABN , First Publish Date - 2020-06-04T08:34:13+05:30 IST

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ(50)పై కొందరు దుండగులు వెంటాడి వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. బుధవారం రాత్రి

వెంటాడి.. కత్తిదూశారు!

  • విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై హత్యాయత్నం
  • రాత్రివేళ జాగింగ్‌ చేస్తున్న సమయంలో వీధిలైట్లు ఆర్పి..
  • ఆటోతో గుద్ది.. కత్తులతో దాడి.. 
  • దుండగుల్లో ఇద్దరు వలంటీర్లు


బుచ్చెయ్యపేట(విశాఖ), జూన్‌3: విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ(50)పై కొందరు దుండగులు వెంటాడి వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. బుధవారం రాత్రి సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అదే గ్రామానికి చెందిన 8 మంది దుండగులు కత్తులతో వెంటాడి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని తులసి కల్యాణ మండపం సమీపంలో బుధవారం రాత్రి గేదెల సత్యనారాయణ తన అనుచరులు గొన్నా నాగన్నదొర, గొన్నా నవీన్‌లతో కలిసి జాగింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో వీధి లైట్లు ఆరిపోయాయి. ఆ వెంటనే వెనుక నుంచి ఆటో ఒకటి వేగంగా వచ్చి సత్యనారాయణను ఢీ కొట్టింది. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. ఆటో కూడా బోల్తాపడింది. బ్రేక్‌ ఫెయిలై ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన సత్యనారాయణ, తన అనుచరులతో ఆటోను లేపాల్సిందిగా సూచించారు. 


ఆటో వద్దకు వెళ్లిన నాగన్నదొర, నవీన్‌లపై బోల్తా పడిన ఆటోలో నుంచి బయటకు వచ్చిన అదే గ్రామానికి చెందిన వెలంకాయల శివాజీ, సియాద్రి రాజ్‌కుమార్‌(వీరిద్దరూ వలంటీర్లు), గుమ్మడి గణేష్‌, నందారపు గణేష్‌, ఎం.సతీష్‌, ఎం.గోవింద, గొన్నా అరుణ్‌, ఎం.బాలాజీ కత్తులతో దాడి చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన సత్యనారాయణ ప్రాణభయంతో పరుగు తీశారు. అయినప్పటికీ కత్తులతో వెంటాడి మరీ చేతులు, తలపై నరకడంతో సత్యనారాయణ కుప్పకూలిపోయారు. ఆయన కేకలు విన్న గ్రామస్థులు అక్కడికి రావడంతో దుండగులు పారిపోయారు. క్షతగాత్రులు సత్యనారాయణ, నాగన్నదొర, నవీన్‌లను రావికమతం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకు విశాఖ ఆసుపత్రికి తరలించారు. కాగా, గేదెల సత్యనారాయణపై హత్యాయత్నం జరగడం ఇది రెండోసారి. 2016 జూన్‌ 19న సాయంత్రం చెరువు పనులను సమీక్షిస్తున్న సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన వారు తుపాకీతో కాల్పులు జరిపారు. అప్పట్లో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజా ఘటన ప్లాన్‌ ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు. ఆయన జాగింగ్‌ చేయడాన్ని గమనించిన దుండగులు, ముందుగా వీధి దీపాలను ఆర్పి వేశారు. అనంతరం ఆటోలో వచ్చి గుద్దేశారు.


పార్టీ మారినా..!

టీడీపీలో సత్యనారాయణ చురుకుగా ఉండేవారు. అప్పట్లో ఆయనకు, ప్రతిపక్ష నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఏడాది క్రితం విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆనందకుమార్‌తో పాటు సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గ్రామంలో రాజకీయ కక్షలు సమసిపోతాయని స్థానికులు భావించారు. సత్యనారాయణ కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా డెయిరీకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆయనపై హత్యాయత్నం జరగడం సంచలనంగా మారింది. దాడికి పాల్పడిన వారంతా వైసీపీకి చెందినవారిగా తెలుస్తోంది.

Updated Date - 2020-06-04T08:34:13+05:30 IST