అట్టహాసంగా ప్లీనరీ!

ABN , First Publish Date - 2022-04-28T08:55:59+05:30 IST

టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ప్లీనరీ ఘనంగా జరిగింది.

అట్టహాసంగా ప్లీనరీ!

  • దాదాపు 9 గంటలు సాగిన సమావేశం..
  • లెక్కకు మించి హాజరైన ప్రతినిధులు
  • కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్నదే నినాదం
  • బీజేపీ తీరును ఎండగట్టిన వక్తలు.. ఆసక్తిగా విన్న కేసీఆర్‌  


 హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ప్లీనరీ ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచే ప్రతినిధుల రాక మొదలైంది. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నగర కార్పొరేటర్లు, కీలక నేతలు హాజరయ్యారు. 3 వేల మంది వస్తారని అంచనా వేయగా.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రతినిధులు వచ్చారు. ఆహ్వానాలు లేకుండా వచ్చిన కొందరు.. ప్లీనరీ ప్రాంగణం వద్ద నుంచి తెలిసిన నేతలకు ఫోన్లు చేసి పాస్‌ల కోసం ప్రయత్నించారు. ఇలా వచ్చిన కొందరికి పాస్‌లు లభించగా.. ఇంకొందరు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం 11.07 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్లీనరీ ప్రారంభమైంది. ప్లీనరీ ఆద్యంతం నాయకులు, కార్యకర్తల హుషారు, ఉత్సాహం మధ్య కొనసాగింది. కాగా, ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది.


కేసీఆర్‌ బాల్యం నుంచి ఉద్యమ ప్రస్థానం, ఎనిమిదేళ్ల పాలనకు సంబంధించిన కీలక ఘట్టాలతో కూడిన ఫొటోలతో పాటు కేసీఆర్‌ తల్లిదండ్రులు, చింతమడకలో చిన్నప్పుడు ఆయన ఉన్న ఇల్లు, వివాహం, తదితర ఫొటోలు ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఉద్యమంలో భాగంగా చేసిన ఆందోళనలు, పోరాటాల ఫొటోలు చూసిన సందర్శకులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సీఎంగా రెండు పర్యాయాలు పదవీప్రమాణ స్వీకారం చేసిన ఫొటోలు ఆకట్టుకున్నాయి. సంక్షేమ పథకాలు, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ తదితరాలకు చెందిన ఫొటోలు ఎగ్జిబిషన్‌లో కనిపించాయి. మునుగోడుకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 


ప్లీనరీలో మంత్రిపై హత్యాయత్నం నిందితుడు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న మున్నూరు రవి.. ప్లీనరీ ప్రాంగణంలో ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ బార్‌ కోడ్‌తో గల పాస్‌ ఉంటేనే అనుమతించే ప్లీనరీ ప్రాంగణంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులతో ఫొటోలు దిగిన అనంతరం వెళ్లిపోయాడు. సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలు పెట్టిన రవి వెంటనే వాటిని తొలగించాడు. కానీ, సీఎం కేసీఆర్‌ ప్రసంగ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ప్రశంసించాడు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులందరికీ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 


టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఉండడంతో..  ప్రధాని వీసీకి కేసీఆర్‌ గైర్హాజరు 

దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ)కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకాలేదు. అదే సమాయానికి హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ప్రధాని సమావేశానికి హాజరు కాలేకపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే... మంత్రి హరీశ్‌రావు కూడా టీఆర్‌ఎస్‌ ప్లీనరీలోనే ఉండడంతో ప్రధాని వీసీకి వెళ్లలేకపోయారని పేర్కొన్నాయి. కాగా, వీసీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-28T08:55:59+05:30 IST