Abn logo
Jul 18 2021 @ 08:01AM

ఆ ముగ్గురు సోదరుల కారణంగా.. దక్షిణాఫ్రికాలో భారత సంతతికి నిద్రలేని రాత్రులు

డర్బన్‌లో దినదిన గండంగా భారత సంతతి

50 వేలకుపైగా వ్యాపార సంస్థల లూటీ

నష్టం అంచనాలు రూ. 8 వేల కోట్లు

డర్బన్‌, న్యూఢిల్లీ, జూలై 17: దక్షిణాఫ్రికాలో భారత సంతతిపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అల్లరి మూకల్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని భారత సంతతికి చెందిన పౌరులు ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన జాకోబ్‌ జుమా అరెస్టు తర్వాత.. ఆయన అనుకూలురు (జులూ వర్గీయులు) ప్రారంభించిన అల్లర్లు భారత సంతతి టార్గెట్‌గా లూటీలకు దారితీసింది. జుమా అవినీతి ఆరోపణలకు వ్యాపారవేత్తలైన భారతీయులు గుప్తా సోదరులే కారణమనే ఆరోపణలతో వారు భారత సంతతిని టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7 నుంచి ప్రారంభమైన అల్లర్లలో ఇప్పటి వరకు 117 మంది మృతిచెందగా.. వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారేనని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. 


జోహన్నెస్బర్గ్‌ వంటి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. డర్బన్‌లో మాత్రం భారత సంతతి దినదినగండంగా గడుపుతోంది. అక్కడ రోజూ లూటీలు జరుగుతున్నాయి. ఈ దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డాక్టర్‌ నలేదీ పాందోర్‌కు.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ బుధవారం ఫోన్‌ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించినట్లు జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఆందోళనలను విరమించాలంటూ జులూ రాజు మిసుజులూ కాజ్వెలితిన్‌ సౌతాఫ్రికన్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన టెలివిజన్‌ ద్వారా జులూ తెగను ఉద్దేశించి ప్రసంగించారు. జాకోబ్‌ జుమా కూడా జులూ వర్గీయుడే. 


గుప్తా సోదరులే కారణమా?

సౌతాఫ్రికన్లు, ముఖ్యంగా జులూ వర్గీయులు భారత సంతతిపై ఇంతలా విరుచుకుపడడానికి గుప్తా సోదరులు (వ్యాపారవేత్తలు అతుల్‌గుప్తా, అజయ్‌గుప్తా, రాజేశ్‌గుప్తా) కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు తొలుత షూ విక్రయంతో దక్షిణాఫ్రికాలో వ్యాపారం మొదలు పెట్టి.. అక్కడి ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. జాకోబ్‌ జుమా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. వీరు అతనితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2018లో జుమా పదవీచ్యుతుడయ్యాక గుప్తా త్రయం దుబాయ్‌కి పారిపోయింది. ఇటీవల జుమా అరెస్టవ్వడంతో.. అందుకు గుప్తా సోదరులే కారణమని భావిస్తున్న జులూ వర్గీయులు.. భారత సంతతిని టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సర్కారు 90లలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రపంచానికి తలుపులు తెరిచిన నేపథ్యంలో.. 1993లో అతుల్‌గుప్తా తొలుత అక్కడికి చేరుకున్నాడు. 


అప్పట్లో కారులో తిరుగుతూ షూలు అమ్ముకునేవాడు. ఆ తర్వాత సహారా కంప్యూటర్స్‌ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఎయిర్‌ ట్రావెల్‌, విద్యుత్తు, గనులు, మీడియా, టెక్నాలజీ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఆ తర్వాత తన ఇద్దరు తమ్ముళ్లను దక్షిణాఫ్రికాకు పిలిపించుకున్నాడు. 2015-16లో జుమా, గుప్తా సోదరుల మధ్య స్నేహం పెరిగింది. అప్పటి నుంచి వీరు దక్షిణాఫ్రికా సర్కారును శాసించే స్థాయికి ఎదిగారు. ఎంతలా అంటే.. తమ వ్యాపారాలకు అనుకూలంగా లేని ఆర్థిక మంత్రి ప్రవీణ్‌ గోర్ధన్‌ను తప్పించి, డిప్యూటీ ఫైనాన్స్‌ మినిస్టర్‌కు ఆ పదవిని కట్టబెట్టేలా చేశారు. అతుల్‌ తన కూతురి పెళ్లికి అతిథుల కోసం జుమా అధికారిక ఎయిర్‌బే్‌సను వినియోగించుకోవడంతో.. సౌతాఫ్రికన్లలో గుప్తా సోదరులపై వ్యతిరేకత పెరిగింది. 2017లో వీరి అక్రమాలకు సంబంధించిన లక్ష ఈ-మెయిళ్లు వెలుగులోకి రావడంతో.. ఆందోళనలు మిన్నంటాయి. 


నిద్రలేని రాత్రులు..

‘‘ప్రస్తుతం ఇక్కడ భారత సంతతి నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఓ వైపు లాక్‌డౌన్‌.. మరోవైపు ఆందోళనలు..! మమ్మల్నే టార్గెట్‌గా చేసుకున్నారు. మాకోసం ప్రార్థించండి’’ అంటూ ఇండియన్‌ డయాస్పోరా కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఐడీసీ) దక్షిణాఫ్రికా చాప్టర్‌ మహిళా విభాగం చైర్మన్‌ రీతా అబ్రహం ఇటీవల ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ అక్కడి పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. దక్షిణాఫ్రికా సర్కారు వెంటనే భారత సంతతికి రక్షణ కల్పించాలంటూ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఐడీసీ డిమాండ్‌ చేసింది. ఇప్పటి వరకు ఒక్క డర్బన్‌లోనే 50 వేలకు పైగా వ్యాపార సంస్థలపై అల్లరి మూకలు దాడి చేశాయి. వీటిలో భారత సంతతికి చెందినవే అధికంగా ఉన్నాయి. దొరికిన వస్తువులను దొరికినట్లు లూటీ చేశాయి. ఇళ్లలోకి చొరబడి దోచుకున్నాయి. ఇప్పటి వరకు నష్టం అంచనా రూ.8 వేల కోట్లకు పైనే ఉంటుందని అక్కడి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అంచనా వేసింది. అల్లరి మూకల దాడులు, లూటీలను అడ్డుకునేందుకు తాము ఆయుధాలు కొనుగోలు చేసి, సాయుధులమవ్వాల్సి వచ్చిందని డర్బన్‌లోని భారత సంతతి చెబుతోంది. తమ కాలనీల్లో రాత్రిళ్లు వాకీటాకీలు పట్టుకుని, గస్తీకాస్తున్నామని వివరించింది. ఆందోళనకారులు భారత సంతతిని దేశం వదిలి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్లు పేర్కొంది.

తాజా వార్తలుమరిన్ని...