అటవీ సిబ్బందిపై ఆదివాసీ మహిళల దాడి

ABN , First Publish Date - 2021-04-13T08:34:15+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేంజి డీ కొత్తూరు బీటు చింతగుప్ప వద్ద అటవీ సిబ్బందిపై సోమవారం ఆదివాసీ మహిళలు దాడి చేశారు.

అటవీ సిబ్బందిపై ఆదివాసీ మహిళల దాడి

పోడు భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం

దుమ్ముగూడెం ఏప్రిల్‌ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేంజి డీ కొత్తూరు బీటు చింతగుప్ప వద్ద అటవీ సిబ్బందిపై సోమవారం ఆదివాసీ మహిళలు దాడి చేశారు. అటవీ సిబ్బందిలో ఒకరిని చెట్టుకు కట్టేసి మరీ కర్రలతో కొట్టారు. మిగిలిన వారిపైనా దాడిచేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది, ఒక ట్రాక్టరు డ్రైవర్‌, ఒక ప్రైవేట్‌ సహాయకుడు గాయాలపాలయ్యారు. వీరిలో ఒక మహిళ సైతం ఉన్నారు. తాము పోడుచేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆగ్రహంతో మహిళలు ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. 


అసలేం జరిగింది?

చింతగుప్ప వద్ద 27 హెక్టార్ల వివాదాస్పద పోడు భూములను నెలన్నర రోజులుగా చదును చేసి చేసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. సోమవారం అక్కడికి వాహనాలు వచ్చేందుకు రహదారిని సిద్ధం చేస్తుండగా ఆదివాసీ మహిళలు దాడిచేశారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ కోటేశ్వరావు, మరో ప్రైవేటు సహాయకుడు రమే్‌షపై దాడి చేశారని తెలుసుకున్న ఎఫ్‌బీవోలు రాజేష్‌, విజయ, హుస్సేన్‌తో కలిసి అక్కడకు వెళ్లగా వారిపైనా ఆదివాసీ మహిళలు విరుచుకు పడ్డారు. వీరిలో రాజే్‌షను ఒక చెట్టుకు తాడుతో బంధించి మరీ కర్రలతో కొట్టారు. 20 నిమిషాల దాడి అనంతరం గ్రామ సర్పంచ్‌ కృష్ణ, సిబ్బంది బ్రతిమిలాడటంతో వారిని విడిచిపెట్టారు. సీఎ్‌ఫవో భీమా, డీఎ్‌ఫఓ రంజిత్‌నాయక్‌ బాధిత సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం అటవీసిబ్బంది పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 

పథకం ప్రకారమే దాడి 

ఆదివాసీ మహిళలు ఒక పథకం ప్రకారమే తమపై దాడికి పాల్పడ్డారని బాధిత ఎఫ్‌భీఓలు తెలిపారు. కర్రలు దగ్గర పెట్టుకొని, తాము వెళ్లగానే తమపై  దాడి చేయడంతోపాటు, దుర్భాషలాడారన్నారు. తాము కూడా ఎదురు తిరిగితే మగవాళ్లు సైతం తమపై దాడి చేసేందుకు వెనుకాడేవారు కారని, కానీ తాము దెబ్బలకు ఓర్చుకొని మరీ సంయమనం పాటించామని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-04-13T08:34:15+05:30 IST