దళితులపై దారుణాలు
ABN , First Publish Date - 2021-04-10T08:41:43+05:30 IST
‘‘ఎన్జీవో నివేదికల ప్రకారం...దళిత విద్యార్థులు కొన్ని సందర్భాల్లో కులం కారణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ అడ్మిషన్ల కోసం కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు.
ఏపీలో వారి హక్కులు, స్వేచ్ఛకు విఘాతం
అమెరికా మానవహక్కుల నివేదిక వెల్లడి
యువకుడికి స్టేషన్లో శిరోముండనం
మాస్క్ లేదని కస్టడీలో మరొకరు బలి
విశాఖ ఎల్జీ ప్రమాదంపై ప్రశ్నించిన
వృద్ధురాలిపై కేసు.. విచారణ
‘‘దళితులు అనేక విషయాల్లో న్యాయం పొందలేకపోతున్నారు. కులం కారణంగా కొన్నిచోట్ల వారికి పాఠశాలల్లో ప్రవేశాలు కూడా దొరకడం లేదు. దళితులపై దాడులకు సంబంధించిన కొన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం లేదు’’..
‘వరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీ్‌సస్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. మాస్క్ ధరించలేదంటూ పోలీసులు పెట్టిన వేధింపులు కిరణ్ అనే ఎస్సీ యువకుడి ప్రాణాలు తీశాయి’’...
...ప్రతిపక్షాలో, ప్రభుత్వం అంటే గిట్టని వర్గాలో చేసిన వ్యాఖ్యలు కావివి. ఏపీలో ప్రమాదంలోపడిన దళితుల జీవన పరిస్థితులూ, సర్కారీ విధానాలను వ్యతిరేకించేవారి స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్లపై ఆందోళనలు వ్యక్తమవుతుంటే.. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు అదే అభిప్రాయం బయటపెట్టింది. ‘ఎన్జీవో’ నివేదికల ఆధారంగా నివేదిస్తున్నట్టు చెబుతూనే.. ఆంధ్రప్రదేశ్‌లోని దారుణ పరిస్థితులను అమెరికా మానవ హక్కుల నివేదిక-2020 ఎండగట్టింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘ఎన్జీవో నివేదికల ప్రకారం...దళిత విద్యార్థులు కొన్ని సందర్భాల్లో కులం కారణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ అడ్మిషన్ల కోసం కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో జరిగే ప్రార్థనలకు దూరంగా ఉంచడం, తరగతి గదుల్లో వెనుక బెంచీల్లో కూర్చోబెట్టడం, ఇంకా ఇతర ప్రయోజనాలను నిరాకరించడంతోపాటు బలవంతంగా పాఠశాల టాయిలెట్లను వారితో శుభ్రంచేయిస్తున్నారు.
దళిత విద్యార్థుల హోమ్ వర్క్‌లను టీచర్లు చూడటం లేదు. దళిత విద్యార్థులకు మధ్యాహ్నభోజనం కూడా అందించడం లేదని, అగ్రవర్ణాల విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చోబెడుతున్నారన్న రిపోర్టులు కొన్ని ఉన్నాయి.’’ అని అగ్రరాజ్యం అమెరికా ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలే మానవహక్కుల నివేదిక విడుదల చేసిన ఆ దేశం.. అందులో ప్రత్యేకంగా భారతదేశంలోని పరిస్థితులపై దృష్టి సారించింది. అందులోనూ ఏపీలో దళితుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న వివక్ష, లాక్‌పడెత్, విశాఖ ఎల్జీ లో లీకేజీ, పోర్టులో జరిగిన ప్రమాదాలతోపాటు అనేకానేక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది. మానవహక్కులు, మైనారిటీ కోటా కింద రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలను ఏకరవు పెట్టింది. నివేదికలో ఏముందంటే ‘‘ఎన్జీవో నివేదిక ప్రకారం...గత ఏడాది జూలై 20న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల వరప్రసాద్‌ను ఓ గొడవలో పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని బాగా కొట్టి గుండుగీయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇది దళితులను అవమానించే చర్యగా చూస్తారు. ఈ చర్య నేపధ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరె్‌స్టచేశారు.
గత ఏడాది జూలై 21న 18 ఏళ్ల ఎరిచెర్ల కిరణ్ అనే దళిత యువకుడు ప్రకాశం జిల్లాలో పొలీసు కస్టడీలో ఉండగా మరణించారు. ఈ సంఘటనకు మూడు రోజుల ముందే అతను మద్యం సేవించి వాహనం నడపడంతోపాటు కరోనా నిబంధనలను పాటించలేదని, మాస్క్ ధరించలేదన్న అభియోగాలపై స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న పోలీసు వాహనంలోనుంచి కిరణ్ బయటకు దూకడం వల్ల తలకు గాయమై చనిపోయారని జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు. కానీ, కస్టడీలో ఉండగా పోలీసులు కొట్టిన దెబ్బలకే కిరణ్ చనిపోయారని అతని కుటుంబీకులు ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎ. ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి కిరణ్కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించారు. నిర్లక్ష్యం వల్లే కిరణ్ మరణానికి కారణమయ్యారనే అభియోగంపై స్టేషన్ ఎస్ఐని అరెస్ట్ చేశారు.
ఇంకా ‘కుల’ వేధింపులు..
దళితులు ఇప్పటికీ ఏపీలో తమ కులం కారణంగా కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. పాఠశాలల్లో ఉదయం జరిగే ప్రేయర్లో పాల్గొననివ్వడం లేదు. తరగతి గదుల్లో వెనక బెంచీల్లో కూర్చోమంటున్నారు. లేదా బలవంతంగా వారితో టాయిలెట్లను కడిగిస్తున్నారు. కానీ, వాటిని వాడుకోనివ్వరు. దళిత విద్యార్థుల హోమ్ వర్క్ నివేదికలను టీచర్లు చూడటం లేదన్న రిపోర్టులు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల వారికి మధ్యాహ్న భోజనం నిరాకరిస్తున్నారని, అగ్రవర్ణ పేద విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చోవాలని వారిని కోరుతున్నట్లుగా కొన్ని నివేదికలు ఉన్నాయి. అపరిశుభ్ర పనులను స్కావెంజర్స్‌తో చేయించవద్దని చట్టం ఉన్నా ఇంకా అది కొనసాగుతోంది. హ్యూమన్‌రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం, స్కావెంజర్స్ పిల్లలపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. అత్యాచారాలు, వేతనాలు నిరాకరించడం, చట్టవ్యతిరేక నిర్బంధం వంటివి దళితుల విషయంలోనే ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది.
గొంతులు నొక్కేస్తున్నారు
‘‘విశాఖలో గ్యాస్ లీకయి 11 మంది మరణించిన సంఘటను ప్రస్తావిస్తూ...గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయకమ్మ ఫేస్బుక్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిలిపించి విచారించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు, భావవ్యక్తీకరణను అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని, వెంటనే ఆ కేసును వెనక్కుతీసుకోవాలని ఎన్జీవోలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి’’
ఒకే ఏడాది 5120 ఉపా కేసులు..
‘‘తీవ్రవాదులు, ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పరిధిలో భారీగా కేసులు పెరిగాయి. 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో కేసులు భారీగా పెరిగాయి. ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఉపా కింద నమోదయ్యే కేసులను ఎన్ఐఏ విచారించేలా ఏర్పాట్లు చేశారు. బెయిలును కూడా నిరాకరించేలా చట్టంలో నిబంధనలున్నాయి. దేశవ్యాప్తంగా 5120 ఉపా కేసులు విచారణలో ఉన్నాయి. ఈ చట్టం పరిధిలో హక్కుల నేత వరవరరావు, సుధా భరద్వాజ్ తదితరులను అరెస్ట్ చే శారు. 80 ఏళ్ల వయసులో వరవరరావు జైల్లో ఉన్నారు కరోనా సోకినా బెయిలు ఇవ్వలేదని ఎన్జీవోల రిపోర్టులు చెబుతున్నాయి. (ఇటీవలే వరవరరావుకు బెయిలు వచ్చింది).’’