Abn logo
Oct 6 2020 @ 09:26AM

ఏటీఎంను కట్ చేసి.. రూ. 15 లక్షలు ఎత్తుకెళ్లారు..

Kaakateeya

హైదరాబాద్ : ప్రధాన రహదారిపై నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఏటీఎంను దొంగలు  కొల్లగొట్టారు. గ్యాస్‌కట్టర్‌తో కట్‌ చేసి రూ.15 లక్ష లు దోచుకెళ్లారు. చందానగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 20న ఎస్‌బీఐ ఏటీఎంలో సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించారు. కొద్దిరోజులకే మళ్లీ మిషన్‌ పాడవడంతో ఏటీఎం షటర్‌ను మూసివేశారు. ఇది జరిగి దాదాపు 15 రోజులైంది. మళ్లీ స్థానికుల ఫిర్యాదుతో టెక్నికల్‌ సిబ్బంది సోమవారం ఏటీఎంను పరిశీలించేందుకు రాగా మిషన్‌ కట్‌ చేసి ఉంది. అందులో ఉన్న దాదాపు రూ.15 లక్షలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. బ్యాంక్‌ అధికారి మల్లికార్జున్‌ చందానగర్‌ డీఐకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని సందర్శించారు. 


నిఘా వైఫల్యం

ఇదే ప్రాంతంలో ఏడాదిన్నర క్రితం తారానగర్‌లోని ఓ బ్యాంకు ఏటీఎంలో గ్యాస్‌కట్టర్‌తో మిషన్‌కట్‌ చేసి దాదాపు రూ.30లక్షలు దోచుకెళ్లారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఏటీఎంలు ఉన్న ప్రాంతాలు రాత్రి 12 గంటల వరకు రద్దీగానే ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో గ్యాస్‌ కట్టర్‌ తీసుకువచ్చి భారీ శబ్దంతో మిషన్‌ కట్‌ చేయడానికి దాదాపు మూడు గంటలు పడుతుంది. ఈ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దాదాపు 3 పెట్రోలింగ్‌ వాహనాలు ఉన్నాయి. పోలీసుల నిఘా అంతంత మాత్రమే ఉండడం, సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో రెండోసారి చోరీ చేయడానికి అవకాశం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తుచేసి దొంగలను త్వరలో పట్టుకుంటామని చందానగర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement