US tornadoes: టోర్నడోల బీభత్సం.. కెంటకీ కకావికలం

ABN , First Publish Date - 2021-12-12T13:00:53+05:30 IST

అమెరికాపై టోర్నడోలు పంజా విసిరాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము దాకా.. ఆరు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. 30 దాకా టోర్నడోలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనల్లో వంద మందికి పైగా మృతిచెంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భీకరమైన గాలులు పశ్చిమ కెంటకీలోని మాఫీల్డ్‌లో ఉన్న ఓ కొవ్వొత్తుల...

US tornadoes: టోర్నడోల బీభత్సం.. కెంటకీ కకావికలం

6 రాష్ట్రాలపై విరుచుకుపడ్డ రాకాసి గాలులు.. 30 టోర్నడోల బీభత్సం 

100 మందికిపైగా మృతిచెంది ఉంటారని అంచనా

ఒక్క కెంటకీలోనే 70 మంది మృతి!: గవర్నర్‌

కుప్పకూలిన కొవ్వొత్తి ఫ్యాక్టరీ పైకప్పు.. శిథిలాల్లో కార్మికులు

మరో తొమ్మిది రాష్ట్రాలకు టోర్నడో హెచ్చరికలు

వాషింగ్టన్‌, డిసెంబరు 11: అమెరికాపై టోర్నడోలు పంజా విసిరాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము దాకా.. ఆరు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. 30 దాకా టోర్నడోలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనల్లో వంద మందికి పైగా మృతిచెంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భీకరమైన గాలులు పశ్చిమ కెంటకీలోని మాఫీల్డ్‌లో ఉన్న ఓ కొవ్వొత్తుల పరిశ్రమ పైకప్పును పూర్తిగా కూల్చేశాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది పనిచేస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బేషీర్‌ తెలిపారు. ఇక్కడ 50 మందిదాకా చనిపోయి ఉంటారని.. తమ రాష్ట్రంలో మొత్తం 70కిపైగా మరణాలు సంభవించి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరణాల సంఖ్య 100ను దాటే ప్రమాదముందన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయని, భారీ భవనాలు, ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయని వివరించారు. నిరాశ్రయులకు స్థానిక పోలీ్‌సస్టేషన్లలో ఆశ్రయం కల్పించామన్నారు.


కెంటకీతోపాటు.. ఆర్క్‌న్సస్‌, ఇల్లినాయిస్‌, మస్సోరీ, మిసిసిప్పీ, టెనెస్సీ రాష్ట్రాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఇల్లినాయి్‌సలో అమెజాన్‌ వేర్‌హౌస్‌ పైకప్పు కూడా కుప్పకూలింది. ఆ సమయంలో 50-70 మంది వరకు లోపల విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌ ఆర్కన్సా్‌సలోని ఓ నర్సింగ్‌హోం పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో 20 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నట్లు వివరించారు. కడపటి వార్తలందేసరికి మస్సోరీలో మూడు, టెన్నెస్సీలో ఐదు, మిసిసిప్పీలో ఒకటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటిగా టోర్నడోలు గంటకు 200 మైళ్ల వేగంతో విరుచుకుపడడంతో ఈ ఆరు రాష్ట్రాల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడికక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్క కెంటకీలోనే 60 వేల ఇళ్లు అంధకారంలోకి జారుకున్నాయి. కాగా.. రాగల 24 గంటల్లో మరో తొమ్మిది రాష్ట్రాలకు టోర్నడోల ప్రమాదం పొంచి ఉన్నట్లు అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2021-12-12T13:00:53+05:30 IST