ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై దద్దరిల్లిన అసెంబ్లీ

ABN , First Publish Date - 2022-09-21T16:35:01+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై దద్దరిల్లిన అసెంబ్లీ

AP Assembly : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health versity) పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి… ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ (YSR Health University)’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలను సైతం తయారు చేసింది. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఈ విషయం బయటకు వచ్చింది. గత రాత్రే ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్‌ (Cabinet) అనుమతి కూడా తీసేసుకున్నట్టు సమాచారం. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు.


ఎన్టీఆర్ జోహార్... ఎన్టీఆర్ అమర్ రహే..


నేడు అసెంబ్లీ సభా ప్రాంరభంతోనే టీడీపీ సభ్యులు (TDP Members) ఆందోళన ప్రారంభించారు. నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ పేరు (NTR Name)ను ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. పోడియంను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యులు పోడియం వద్ద నుంచి వెనెక్కి వచ్చి అడగాలని మంత్రి అంబటి (Minister Ambati Rambabu) సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లును వెనెక్కి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎన్టీఆర్ జోహర్... ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే తమకూ గౌరవం ఉందన్నరు. అందుకే జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టామమన్నారు. 


జగన్మోహన రెడ్డిని ఏమీ పీకలేరు..


అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ (Arogyasri) తో పాటు వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని.. అందుకే ఆయన పేరు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సిఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy) మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అంగీకరించలేదన్నారు. మీరు విశ్వసఘాతకులు, మీకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటూ ధ్వజమెత్తారు. 22 మంది వచ్చి కిందకు పైకి ఎగురుతున్నారు అంటూ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు జగన్మోహన రెడ్డి (CM Jagan Mohan Reddy)ని ఏమీ పీకలేరన్నారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) కొతం సమయం వాయిదా వేశారు.  


మండలిలో గందరగోళం...


అటు మండలిలోనూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ చోటు చేసుకుంది. పేరు మార్పు అంశంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ చైర్మన్ పోడియంను టీడీపీ ఎమ్మెల్సీలు చుట్టూ ముట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. 

Updated Date - 2022-09-21T16:35:01+05:30 IST