టీ20 Asia Cup వేదిక మారే ఛాన్స్.. పాకిస్తాన్ స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2022-07-17T19:55:54+05:30 IST

శ్రీలంక(Srilanka) వేదికగా జరగాల్సిన క్రికెట్ టీ20 ‘ ఆసియా కప్‌ ’ (Asia Cup) వేరే దేశానికి తరలిపోనుందా ?.

టీ20 Asia Cup వేదిక మారే ఛాన్స్.. పాకిస్తాన్ స్పందన ఇదీ..

కొలంబో : శ్రీలంక(Srilanka) వేదికగా జరగాల్సిన క్రికెట్ టీ20 ‘ ఆసియా కప్‌ ’ (Asia Cup) వేరే దేశానికి తరలిపోనుందా ?. లంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభ, రాజకీయ అస్థిరత- పౌరుల ఆందోళనలే ఇందుకు కారణమా ? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆసియా కప్‌ను యూఏఈ(United Arab Emirates) వేదికగా ఆడించే అవకాశాలున్నాయని శ్రీలంక క్రికెట్(Srilank Cricket) సెక్రటరీ మోహన్ డిసిల్వా(Mohan de Silva) ఆదివారం అన్నారు. లంకలో ఆసియా కప్ జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఆయనీ సమాధానమిచ్చారు. ద్వీప దేశంలో రాజకీయ ఆందోళనలే ఇందుకు కారణమవ్వొచ్చని ప్రస్తావించారు. కాగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం(Financial Crisis)లో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు కారణమైన ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాల్సిందిగా పౌరులు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయాక అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.


కాగా ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే... ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఆసియా కప్ జరగనుంది. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్‌లకు చోటు ఖాయమైంది. ఒక క్వాలిఫయర్ స్థానం కోసం హాంగ్‌కాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈ జట్లు పోటీ పడనున్నాయి. కాగా అక్టోబర్ - నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) ముందు జరగబోతున్న ఆసియా కప్ ఈ జట్ల సన్నద్ధతకు ఉపయోగపడనుంది. 


లంకలోనే ఆడాలి: పాకిస్తాన్

శ్రీలంకలో ఆస్ట్రేలియా(Australia) పర్యటన సజావుగానే ముగిసింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు(Team Pakistan) శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 ఆసియా కప్ కూడా సాఫీగానే జరుగుతాయనే ఆశలు కూడా లేకపోలేదు.  దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ స్పందించింది. శ్రీలంకలోనే ఆసియా కప్ ఆడాలని శనివారం పేర్కొంది. ఆసియా కప్‌ను అక్కడే ఆడడం ద్వారా లంకకు బాసటగా నిలవడం తమ ఉద్దేశమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(Pakistan Cricket Board) పేర్కొంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పాకిస్తాన్ జట్టు లంకలో పర్యటిస్తోందని ప్రస్తావించింది. ఈ మేరకు ఏసీసీ పెద్దలతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. కాగా టీ20 ఆసియా కప్ వేదికపై ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఏసీసీ హెడ్‌గా బీసీసీఐ సెక్రటరీ జయ్ షా కొనసాగుతున్నారు.

Updated Date - 2022-07-17T19:55:54+05:30 IST