అసానితో అపారనష్టం

ABN , First Publish Date - 2022-05-15T08:43:48+05:30 IST

అసాని తుఫాన్‌ వల్ల దాళ్వా పంటకు అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ రైతు స్టీరింగ్‌ కమిటీ వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మొలకెత్తిన

అసానితో అపారనష్టం

కోతకు వచ్చిన సమయంలో దెబ్బ. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు 

టీడీపీ బృందంతో రైతుల ఆవేదన..కోనసీమ జిల్లాలో పర్యటన 

నష్ట పరిహారం ఇవ్వాలి: సోమిరెడ్డి 


ఉప్పలగుప్తం, మే 14: అసాని తుఫాన్‌ వల్ల దాళ్వా పంటకు అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ రైతు స్టీరింగ్‌ కమిటీ వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మొలకెత్తిన పనలను చూపించి వీటిని ఎవరు కొంటారంటూ కన్నీరు పెట్టుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నేతృత్వంలో టీడీపీ బృందం శనివారం కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించింది. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఇప్పటికే సార్వా సాగు విరమించుకున్నామని, దాళ్వాపై ఆశలు పెట్టుకున్నామని రైతులు వివరించారు. పంట కోతకు వచ్చిన సమయంలో తుఫాన్‌ దెబ్బ తీసిందని వాపోయారు. మొలకెత్తిన ధాన్యం కంకులను సలాది రామకృష్ణ, నల్లా సత్యనారాయణ తదితర రైతులు టీడీపీ బృందానికి చూపించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు అధికారులెవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వంతో పోరాడతామని వారికి టీడీపీ బృందం భరోసా ఇచ్చింది.


దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ నివాసం వద్ద సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అసాని తుఫాన్‌ మరుసటి రోజే కోనసీమ జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ పంట నష్టాల గురించి కనీసం ప్రస్తావించలేదు. రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని బహిర్గతం చేస్తోంది. విపత్తుల సమయంలో జగన్‌ ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పర్యటించారా? జగన్‌ సర్కారు రైతుల మీద కూడా వ్యాపారం చేస్తోంది. వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి ఆక్వా మేతల ధరలు పెంచారు. రొయ్యలు, చేపల మార్కెట్‌ సెస్‌ను పెంచారు. మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి. ధాన్యం సొమ్మును మూడు రోజులకే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. హెక్టార్‌కు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆక్వా రైతులకు పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి. ఈ అంశాలపై రైతుల పక్షాన మా పార్టీ నిరంతర పోరాటం చేస్తుంది’’ అని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2022-05-15T08:43:48+05:30 IST