తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత

ABN , First Publish Date - 2020-07-31T07:34:40+05:30 IST

రాష్ట్రంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు! అనుమతులకు మించి అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో పరిమితికి మించి ఇసుకను తరలించి పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి పట్టణాలకు ఇసుకను తరలిస్తూ భారీగా సొమ్ము

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత

  • రెచ్చిపోతున్న ఇసుకాసురులు
  • గోరంత అనుమతులు, కొండంత తరలింపు
  • ట్రాక్టర్‌ లోడ్‌ రూ.11 వేలు, టిప్పర్‌ లోడ్‌ 35వేలు
  • మామూళ్ల మత్తులో అధికారులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు! అనుమతులకు మించి అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో పరిమితికి మించి ఇసుకను తరలించి పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి పట్టణాలకు ఇసుకను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా తమ అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా... నదులు, కాలువలు, చెరువులను నిర్జీవం చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి! ఇసుక తవ్వకాలు మొదలు.. అమ్మకాల దాకా ప్రతి దశలో ముడుపులు అందడంతోనే యంత్రాంగం మౌనంగా ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుకకు రూ7-11వేల దాకా, టిప్పర్‌ లోడ్‌కు రూ.30-35వేల దాకా తీసుకుంటూ కోట్లు కూడబెట్టుకుంటున్నారు.


మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుందుభీ, ఊకచెట్టువాగు, పెద్ద వాగుల్లో అధికారపార్టీ నాయకులు ఇసుక  దందా  కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇసుకను 12 క్యూబిక్‌ మీటర్ల అనుమతి పొంది లారీల్లో 18 నుంచి 20 క్యూబిక్‌ మీటర్ల వరకు నింపి అక్రమంగా తరలిస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని తిప్రా్‌సపల్లి, శేర్నపల్లి, ఆగారం, నాగిరెడ్డిపల్లి, జాజాపూర్‌ తదితర వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అవుతోంది. వనపర్తి, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక దందా సాగుతోంది. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రానికి ఆప్పునుంతల, వంగూరు, కోడేరు మండలం నుంచి ప్రతిరోజు 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగా నదిని ఆనుకొని ఉన్న భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, నార్నూర్‌ మండలాల నుంచి..  కవ్వాల్‌ అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు, ఒర్రెల నుంచి  జోరుగా ఇసుక తరలిపోతోంది. నిర్మల్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరిట దర్జాగా లారీలకు స్టిక్కర్లను అతికించి ఇసుకను   తరలిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకున్న అధికారులను జిల్లాలోని ఇద్దరు అధికార పార్టీ నేతలు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో గోదావరి తీర ప్రాంతమైన ధర్మపురి, రాయికల్‌, బీర్‌పూర్‌, సారంగాపూర్‌ మండలాల నుంచి  పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.  మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి రోజుకు దాదాపు 20 టిప్పర్లు జగిత్యాల జిల్లాకు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చింతకాని, ముదిగొండ, తిరుమలాయపాలెం, వేంసూరు మండలాల్లో రాత్రివేళ్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. సూర్యాపేట జిల్లాలో ఒక ట్రిప్పునకు అనుమతి తీసుకొని, డీడీలు చెల్లించి రెండు ట్రిప్పులు రవాణా చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో సాండ్‌ ట్యాక్సీ పాలసీ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఇంటి వద్దకే రవాణా చేస్తున్నారు. ఈ విధానం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. అయితే రాత్రి వేళల్లో మానేరులో ఖమ్మంపల్లి నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.


నంబరులేని లారీలు.. బల్క్‌ మాయ

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న  సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన ఇసుకను మహదేవపూర్‌ 6వ క్వారీ నుంచి తరలిస్తున్నారు. ఈ బల్క్‌ ఆర్డర్‌లోనే అసలు మాయ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్‌ రోజుకు 200 లారీల బల్క్‌ ఆర్డర్‌ ఒకేసారి తీసుకుని వే బిల్లు పొందుతారు. వాటిలో ఏ ఒక్క లారీకి నంబరు ఉండదు. ఈ లారీలు వరంగల్‌, హైదరాబాద్‌ వెళ్లుతున్నట్లు తెలిసింది.


ఇసుక మేట పేరుతో

ఉమ్మడి నల్లగొండ జిల్లా బిక్కేరు వాగు సరిహద్దు గ్రామం జానకీపురానికి చెందిన ఓ రైతు పట్టా భూమిలో ఇసుక మేట వేసిందని, దాని తొలగింపు పేరుతో సంబందిత శాఖ నుంచి ఇసుక మాఫియా అనుమతులు తీసుకుంది. అనంతరం బిక్కేరు వాగులోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి  తరలింపు చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించకుండా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ముందుగానే ప్రసన్నం చేసుకుంటున్నారు.


రెడ్‌హ్యాండెండ్‌గా దొరికినా

 మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలం సర్దనలో రీచ్‌ నుంచి ఈ నెల ఆరో తేదీన ఒకే వే బిల్లుపై మూడో ట్రిప్పు ఇసుక తరలిస్తూ ఓ టిప్పర్‌ డ్రైవర్‌ గ్రామస్థులకు దొరికిపోయాడు. వెంటనే ఖనిజాభివృద్ధి సంస్థ పీవో రామకృష్ణకు ఫోన్‌లో ఫిర్యాదు చేయగా తాను ఏమీ చేయలేనని చెప్పారు. స్థానిక పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా.. ఇసుక విషయంలో పెద్దపెద్దవాళ్ల హస్తం ఉందని, తాము రాలేమంటూ మిన్నకుండిపోయారు. మెదక్‌ జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాల అక్రమాలకు ఇదో ఉదాహరణ.  సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా నక్కవాగు నుంచి అక్రమంగా ఫిల్టర్‌ ఇసుక తయారీ, రవాణ జరుగుతోంది. 


10 ఫీట్ల దాకా

 మంచిర్యాల జిల్లాలో గోదావరి నుంచి ఇసుక తవ్వకాలను ఇష్టం వచ్చినట్లు కొనసాగిస్తున్నారు. 6, 7, 8 రీచ్‌ల నుంచి కోటపల్లి మండలం గోదావరి వద్ద నుంచి రావులపల్లి-కొల్లూరు గ్రామాల సమీపంలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. రోజూ వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఎక్స్‌కావేటర్‌తో ఆరు నుంచి 10 ఫీట్ల లోతు వరకూ తవ్వేస్తున్నారు. 


పైన ఇటుకలు.. లోపల ఇసుక

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి వాగు సమీపంలో భారీగా నిల్వలు ఏర్పాటు చేసుకొని కొంత మంది లారీల్లో హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కాగజ్‌నగర్‌, దహెగాం, బెజ్జూరు, పెంచికల్‌పేటలోని వాగుల నుంచి ఇసుకను యఽథేచ్ఛగా పట్టపగలే తరలిస్తున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు లారీల్లో పైన ఇటుకలు పెట్టి లోపల ఇసుక నింపుకొని తరలిస్తున్నారు.

Updated Date - 2020-07-31T07:34:40+05:30 IST