స్వాతంత్య్ర యోధగా..తొలి మంత్రిగా..

ABN , First Publish Date - 2022-08-04T05:46:09+05:30 IST

స్వాతంత్య్ర సమరంలో మహిళలు అనగానే ‘భారత కోకిల’ సరోజినీ నాయుడు లాంటి కొద్ది పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి...

స్వాతంత్య్ర యోధగా..తొలి మంత్రిగా..

మన ధీర

సంగెం లక్ష్మీబాయమ్మ

జననం: 1911  

మరణం: 02-06-1979 


స్వాతంత్య్ర సమరంలో మహిళలు అనగానే ‘భారత కోకిల’ సరోజినీ నాయుడు లాంటి కొద్ది పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే దేశ విముక్తి కోసం తమతమ ప్రాంతాల్లో పోరాటాలు జరిపి, జైలు శిక్ష అనుభవించి, ప్రజల్లో స్వేచ్ఛా స్ఫూర్తిని రేకెత్తించిన మహిళా యోధులు ఎందరో ఉన్నారు. వారిలో తెలుగు ప్రాంతాలకు చెందిన కొంతమందిని స్మరించుకుందాం...


సంగెం లక్ష్మీబాయమ్మ 1911లో హైదరాబాద్‌ సమీపంలో ఉండే ఘట్‌కేసర్‌లో జన్మించారు. ఆమె అప్పటి పేరు సత్తెమ్మ. సీతమ్మ, దొంతుల రామయ్య ఆమె తల్లితండ్రులు. పుట్టి పెరిగిన పల్లె మొత్తం మీద బళ్లో చదువుకుంటున్న అమ్మాయి ఆమె ఒకరే. ఆమె చిన్ననాటి నుంచి నదురు బెదురు లేని ధైర్యవంతురాలు. 13 సంవత్సరాలకే విధి వక్రించింది. వైధవ్యం కలిగింది. 


ఆ రోజుల్లో నిజాం పాలనలోని ప్రాంతవాసులకు అటు ఇంగ్లీషులోనో, ఇటు ఉర్దూలోనో తప్ప తెలుగులో చదివే అవకాశాలూ లేవు. దీంతో ప్రజానాయకుడు, సంస్కర్త అయిన మాడపాటి హనుమంతరావు సలహాపై  లక్ష్మీబాయమ్మను ఆమె మేనమామ సంగెం సీతారామయ్య యాదవ్‌ 1926లో గుంటూరు తీసుకువెళ్ళి, శారదా నికేతనంలో చేర్పించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఆమెకు లక్ష్మీబాయి అని తన పేరు పెట్టి, తనవలే వర్ధిల్లమని దీవించారు. ఆమె అక్కడ 1933 వరకూ, ఏడు సంవత్సరాలు ఉన్నారు. అక్కడ చదివి 1927లో ‘విద్వాన్‌’ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ‘విదుషి’ పట్టం కూడా అక్కడే తీసుకున్నారు. 1928లో సైమన్‌ కమిషన్‌ పట్ల నిరసన ప్రదర్శనలో పాలు పంచుకున్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం ఆరంభమయినప్పటి నుంచి ఆమె ఎంతో ఉత్సాహంగా, దీక్షతో పాల్గొన్నారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి వెంట ఊరూరా ప్రచారం చేసేవారు. ప్రబోధం చేసేవారు. చుట్టుపక్కల ఉండే తెనాలి, విజయవాడ, నరసారావుపేట వంటి ప్రదేశాలకు వెళ్ళి... కల్లు, సారా దుకాణాల దగ్గర, విదేశీ వస్తు, వస్త్ర దుకాణాల దగ్గర సత్యాగ్రహం చేసేవారు. ఆమెను పోలీసులు అనేకసార్లు అరెస్టు చేసి, ఒకటి, రెండు రోజులు ఉంచి విడుదల చేసేవారు. అరెస్టని చెప్పి ఏ నిర్జన ప్రదేశంలోనో దిగవిడిచి వచ్చేవారు. చివరకు వాళ్ళ ప్రాణం విసిగి, ఆమెను అరెస్ట్‌ చేసి, కసి తీరా ఒక సంవత్సరం శిక్ష వేశారు. రాయవేలూరు పంపించారు. అక్కడ ప్రతిరోజు రాసిన డైరీ కేవలం నాడు జరిగిన విశేషాలే కాక, కలుసుకున్న మనుషుల ప్రవృత్తులను, ఘట్టాలను వివరించుతూ రాశారు.  జైల్లో ఆమె దుర్గాబాయమ్మగారి దగ్గర హిందీ చదివి, ‘రాష్ట్ర భాష’ పరీక్ష నెగ్గారు. మొత్తం ఎనిమిది సంవత్సరాలు కృషి చేసి, హిందీలో ‘సాహితి’, సంస్కృత, ఆంధ్రాల్లో ‘విదుషి’ డిగ్రీలు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆమె కార్వే యూనివర్సిటీ బి.ఎ. పరీక్ష ప్రైవేటుగా రాసి, కృతార్థులైనారు. కర్ర పలకకు తాడు కట్టి లాక్కుని వెళ్ళి, వీధిబడిలో చదువుకున్న ఆమె తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషులలో, చిత్రకళలలో పండితురాలైనారు. 


1932లో శాసనోల్లంఘన సందర్భంగా తిరిగి అరెస్టయి, రాయవేలూరు జైలుకు వెళ్ళారు. 1933లో విడుదలయినారు. ఇక అంతటితో అప్పటికి రాజకీయాల నుంచి దృష్టి మరలించారు. మద్రాసు వెళ్ళి, అక్కడ ఆర్టు స్కూలులో  1933 నుంచి 1938 వరకూ శిక్షణ పొంది, డిప్లమా తీసుకున్నారు. 1938లో హైదరాబాద్‌ చేరుకున్నారు. వెంటనే గుల్బర్గా బాలికా పాఠశాలలో ఆమెకు డ్రాయింగ్‌ టీచరుగా ఉద్యోగం ఇచ్చారు. ఆమెను మాడపాటి హనుమంతరావుగారు తమ ఆడపిల్లల హైస్కూలుకు వార్డెనుగా ఉండమని కోరారు. 1938 నుంచి 1946 వరకూ... ఎనిమిది సంవత్సరాలు జీతం భత్యం తీసుకోకుండా గౌరవ వార్డెనుగా ఉండడమే కాక, తన భోజన ఖర్చును ఆమె స్వంతాన ఇచ్చుకున్నారు. ఇంకెవరూ ఇట్లా చేసినట్టు వినలేదు.


1947లో బ్రిటిష్‌ ప్రభుత్వం వైదొలగి, భారతదేశం స్వతంత్ర దేశం అయింది. కాగా. నైజాం రాష్ట్ర ప్రజలు నిరంకుశ పాలనతో విసిగిపోయినారు. దేశంలోని ప్రజానీకం అందరిలా స్వేచ్ఛా వాయువు పీలుస్తూ పురోగమించాలని కోరుకున్నారు. ఇటువంటి కోరికలు కలుగకుండా చూడడానికీ, అణచడానికీ నిజాం దమననీతిని అవలంబించడం, రజాకర్ల వంటి దుష్టశక్తులను ప్రజల మీదికి వదలడం జరిగింది. అంతకుపూర్వం కొంతకాలంగా రాజకీయ పరిస్థితులను గమనించుతూ, దేశ సేవ చేయ సకల్పించుకున్న లక్ష్మీబాయమ్మ... ఉద్యోగాదులు వదిలేసి రాజకీయాలలో ప్రవేశించారు. బహిరంగంగానే సత్యాగ్రహం ఆరంభించారు. శాంతి సమరాన్నే ఎన్నుకున్నారు. విద్యార్థులలోను, స్త్రీలలోను బహుళ ప్రచారం చేశారు, ఉద్బోఽధించారు. 


నైజాం రాష్ట్ర ప్రజల అదృష్టం పండి..... భారత ప్రభుత్వ సాయుధ ఆక్రమణంతో స్వాతంత్య్రం సిద్ధించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో విలీనం అయిపోయింది. 1952లో శాసనసభకు ఎన్నికలు హైదరాబాద్‌ రాష్ట్రంలో కూడా జరిగాయి. ఆమె నిజామాబాదు బాన్సువాడ నియోజకవర్గం నుంచి... కాంగ్రెస్‌ అభ్యర్థినిగా అఖండ విజయం పొందారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో... ఆమెను విద్యాశాఖకు ఉపమంత్రిణిగా చేర్చుకున్నారు. ఈ పదవి అలంకరించిన ప్రథమ తెలంగాణ మహిళ ఆమె. 


ఆమె 1952లో హైదరాబాదులోని సైదాబాదులో ఉన్న తమ స్వంత భవనంలో మహిళా సేవాసదనం స్థాపించారు. అదే ‘ఇందిరా సేవాసదనం’గా నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. లక్ష్మీబాయమ్మ చనిపోయే నాటివరకూ దానికి కార్యదర్శిగానే ఉన్నారు. ఆమె తనకున్న సమస్త సంపదా దానికే సమర్పించారు. ఆమె వినోబా భావే శిష్యురాలు. పార్లమెంటు మెంబరుగా 20 ఏళ్ళు ఉన్నారు. మహిళా ఉద్యమాన్ని గురించి, సమస్యల గురించి అనేక రేడియో ప్రసంగాలు చేశారు. ఆమె రచన ‘నా అనుభవాలు’ చిన్నదే అయినా అమూల్య విషయాలను సాధికారంగా వివరించారు. గాంధీజీ, వినోబాజీల శిష్యురాలైన లక్ష్మీబాయమ్మను తామ్రపత్రంతో ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమెను సన్మానించారు. దేశానికీ, సంఘానికీ, మహిళా లోకానికీ ఆమె అకుంఠిత సేవ చేశారు.

(‘స్వతంత్ర సమరంలో ఆంధ్రమహిళలు’ సంకలనం నుంచి) 


Updated Date - 2022-08-04T05:46:09+05:30 IST