వీఆర్‌ఏలకు దసరా కానుకగా.. వారి సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-10-03T08:16:56+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు దసరా కానుకగా వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కోరారు.

వీఆర్‌ఏలకు దసరా కానుకగా.. వారి సమస్యలు పరిష్కరించండి

  • పే స్కేలు పెంచి పదోన్నతులివ్వండి.. 
  • వారసులకు ఉద్యోగాల జీవోనూ విడుదల చేయండి
  • ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి.. 
  • సీఎంకేసీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు దసరా కానుకగా వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కోరారు. వీఆర్‌ఏలు కోరుతున్నట్లుగా వారికి పే స్కేళ్లు పెంచి పదోన్నతులు ఇవ్వాలన్నారు. వారసులకు ఉద్యోగాలకు సంబంధించిన జీవోనూ విడుదల చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో విన్నవించారు. గడిచిన మూడు నెలలుగా వీఆర్‌ఏలు ఆందోళన ఏస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఈ మూడు నెలలుగా వారికి వేతనాలూ లేవన్నారు. ఇప్పటికే ఒత్తిడిని తట్టుకోలేక 28 మందికి పైగా వీఆర్‌ఏలు చనిపోయారని, ఇందులో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది వీఆర్‌ఏలు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 


ముఖ్యమంత్రి అంటే.. తండ్రి లాంటి పోస్టు. ఆయనకు కోపం తగదు. పిల్లలపైన ఆయనకు కోపం వచ్చినా.. మళ్లీ వారిని దగ్గరికి తీసుకోవాలి’’ అని సూచించారు. గ్రామాల్లో వీఆర్‌ఏలపైన ఉన్నతాధికారులు తీవ్రమైన పనిభారం వేస్తున్నారని, దీంతో వారు ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోందని జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. తన నియోజకవర్గం సంగారెడ్డిలో 250 మంది వరకు వీఆర్‌ఏలు ఉన్నారని, వారందరితోనూ తాను నేరుగా మాట్లాడి.. వారి స్థితిగతులను చూశానని పేర్కొన్నారు. నూరేళ్లు బతకాల్సిన వారు.. పనిభారం వల్ల 45 నుంచి 50 ఏళ్లకే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు నెలకు ఇచ్చే రూ.12 వేల జీతం.. వారి పెట్రోల్‌ ఖర్చులకే సరిపోతుందన్నారు. కాబట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసు చేసుకుని వీఆర్‌ఏలను కాపాడాలని కోరారు. సీఎం తమకు ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయాలని వీఆర్‌ఏలు కోరుతున్నారని, ఈ సందర్భంగా  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేసీఆర్‌కు ఆయన విన్నవించారు.

Updated Date - 2022-10-03T08:16:56+05:30 IST