అరుదైన సాహితీ ‘సీమ’ కారుడు

ABN , First Publish Date - 2021-09-30T06:41:51+05:30 IST

రాయలసీమ ఉద్యమశీలిగా, కార్మిక నాయకుడిగా, శాసనసభ్యుడిగా సాహితీవేత్తగా నిండు జీవితం జీవించిన డా.యంవి రమణారెడ్డి ఇకలేరు. ప్రొద్దుటూరులో 1970కు పూర్వం ఒక యువ డాక్టర్‌గా వైద్యవృత్తిలోకి ప్రవేశించిన...

అరుదైన సాహితీ ‘సీమ’ కారుడు

రాయలసీమ ఉద్యమశీలిగా, కార్మిక నాయకుడిగా, శాసనసభ్యుడిగా సాహితీవేత్తగా నిండు జీవితం జీవించిన డా.యంవి రమణారెడ్డి ఇకలేరు. ప్రొద్దుటూరులో 1970కు పూర్వం ఒక యువ డాక్టర్‌గా వైద్యవృత్తిలోకి ప్రవేశించిన ఎంవిఆర్‌ ‘ప్రభంజనం’ అనే రాజకీయ సాహిత్య పత్రిక సంపాదకుడిగా ప్రజా ఉద్యమాల్లోకి వచ్చేశాడు.


1970 జూలైలో హైదరాబాద్‌లో విరసం ప్రాధుర్భావ వేళ మా అందరికి ఎంవిఆర్‌ పరిచయం. ‘ప్రభంజనం’ పత్రికను నేను స్వయంగా నగరంలో పంపిణీ చేశాను. మేమంతా విరసం సంస్థాపక సభ్యులుగా సాహిత్య, సాంస్కృతిక అంశాలపరంగా, రాజకీయంగా వివిధ దశలో చర్చలు జరిపాం. విరసం కార్యవర్గ సమావేశాలో ఆయన తన వైఖరిని స్పష్టం చేసేవాడు. అవసరమైతే అంతే తీవ్రంగా విభేదించేవాడు.


జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో హోం మినిస్టర్‌గా ఉన్న కాలంలోనే ‘ప్రభంజనం’పై నిషేధం విధించారు. 1971లోనే నేను, జ్వాల, చెరబండరాజు పిడి చట్టం కింద జైలుకెళ్ళాం. 1975 అనంతరం ‘విరసం’ మహాసభల్లో రాజకీయ, సాంస్కృతిక అవగాహన పరంగా విభేదించి మేమంతా రాజీనామా చేశాం.


మొదటిదశలో ఆయనలోని రచయిత జీవితాన్ని ట్రేడ్‌యూనియన్‌ (ప్రొద్దుటూరులో కార్మిక సంఘాల నేతగా) క్రియాశీలత కమ్మేసింది. ఆ దశలోనే నేను, జ్వాల, చెరప్రతి మేడే ఉత్సవాలకు ప్రొద్దుటూరు వెళ్ళి కార్మికులతో పాటు ఊరేగింపులో పాల్గొని చివరగా ఉపన్యసించేవాళ్ళం. ఆ తర్వాత ఎంవిఆర్‌ ఒక హత్యానేరం కింద జైలులో ఉండగా ప్రొద్దుటూరులో భారీగా జరిగిన మేడే ఉత్సవంలో తరిమెల నాగిరెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ఆనాడు విప్లవ కమ్యూనిస్టు నాయకుడైన టియన్‌తో పాటు వానలో తడుస్తూ ప్రొద్దుటూరు వీధుల గుండా మేమంతా నడచిన అనుభవాన్ని మరచిపోలేం. కార్మికసంఘ నాయకుడిగా ఎంవిఆర్‌ అనేకరకాల ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. రాయలసీమ ప్రాంత ప్రజాసమస్యలపై స్వయంగా రచనలు చేసి, పాదయాత్రల్లో పాల్గొన్న క్రియాశీలి ఆయన. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన జీవితం రాజకీయంగా మలుపు తిరిగింది. ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎంవిఆర్‌ ప్రొద్దుటూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. ఎమ్మెల్యేగా ఉంటూనే రాయలసీమ ప్రజల సమస్యలపై నిరహారదీక్ష చేశాడు. అప్పుడే ప్రొద్దుటూర్ బంద్‌ కూడా జరిగింది. ఎన్‌టిఆర్‌ వెళ్ళి హామీలు ఇవ్వడంతో నిరహారదీక్ష విరమించాడు.


విప్లవ రాజకీయాల నుంచి పార్లమెంటరీ రాజకీయాల వైపు మళ్ళిన ఎంవిఆర్‌, ఆనాడు ఎన్‌టిర్‌తో రాజీపడి ఉంటే కార్మికమంత్రి కాగలిగేవాడని అనుకునేవారు. అయితే ఎంవిఆర్‌ లోని నిశితపరిశీలనాశక్తి, మేథోపరమైన తీక్షణత ఆయన్ని వ్యక్తిగతంగా స్వతంత్రంగా నిలిపాయి. ఆయన మలిదశ జీవితమంతా సాహిత్యానికి పరిమితమై ఒక వెలుగు వెలిగింది. సృజనాత్మక రచయితగా, భాషావేత్తగా అనువాదకుడిగా ఆయన కృషి ఆమోఘమైంది. స్వయంగా కథలు రాసి, సినిమా పాటలను వ్యాఖ్యానించి, విమర్శనా వ్యాసాలు రాసి ఆయన తన అధ్యయనాన్ని సాహిత్య ప్రతిభను నిరూపించుకున్నాడు.


ప్రత్యేకించి అనువాదరంగంలో కృషి చేస్తూ అంతిమశ్వాస దాకా రచనలు చేస్తూనే ఉండిపోయాడు. వాటిలో ‘రెక్కలు చాచిన పంజరం’ (ఫ్రెంచి నవల పాపిలాన్‌ ఇంగ్లీష్‌ అనువాదం నుంచి) రెండు భాగాల తెలుగు అనువాదం, ‘గాన్‌ విత్‌ దవిండ్‌’ అమెరికన్‌ నవల అనువాదం ప్రత్యేకించి చెప్పుకోవలసినవి. ఇదంతా ఒకఎత్తు అయితే, ప్రపంచచరిత్రను నాలుగు భాగాలుగా ‘టూకీగా ప్రపంచచరిత్ర’ పేరిట రాసి ప్రచురించడం మరొక ఎత్తు


చివరికి ఆక్సిజన్‌పై ఉంటూ కూడ పట్టుదలతో రచనలు చేయడం ఆయనకే చెల్లు. వ్యవహారిక తెలుగుభాషకు వ్యాకరణం నిఘంటువు రూపొందించాలనే  ప్రయత్నం ఆయన సాహితీ తపనకు మరొక ఉదాహరణ. వ్యక్తిగతంగా నిరాడంబరంగా– స్నేహశీలిగా జీవించిన ఆయన వ్యక్తిత్వం విలక్షణమైనది. రమణారెడ్డితో ఐదు దశాబ్దాల స్నేహం అపురూపమైంది. ఆయన ద్వారానే మల్లెల నారాయణ(పండితుడు), మహేశ్వర రెడ్డి మాకు పరిచయమయ్యారు.


రమణారెడ్డి కళాశాలలు స్థాపించి అటు విద్యారంగంలోనూ ప్రత్యేక కృషి జరిపాడు. కాలేజ్‌ ఆఫ్‌ పిజికల్‌ ఎడ్యుకేషన్‌ వార్షికోత్సవానికి నన్ను, జ్వాలాముఖిని ముఖ్యఅతిధులుగా పిలిచాడు. ఆనాడు ఆప్యాయంగా ఎంవిఆర్‌ ఇచ్చిన ఆతిధ్యాన్ని నేను మరచిపోలేను. ఆయన చంచల్‌గూడా జైలులో ఉండగా వెళ్ళి కలిసాను. జైలులో ఒక డాక్టర్‌గా ఖైదీలకు సేవలు అందించారాయన.


రమణారెడ్డి ఒక ప్రతిభావంతుడైన సాహితీవేత్తగా, మేధావిగా చరితార్ధుడైనాడు. ప్రచురించిన ప్రతి పుస్తకాన్ని నాకు వెంటనే పోస్టులో పంపించేవాడు. నేను స్పందించగానే ఫోన్‌లో తన అభిప్రాయాలను స్పష్టం చేసేవాడు. చివరగా నెలరోజుల క్రితం ఆయన కొత్త అనువాదం ‘కడుపుతీపి’ (గోర్కి‘మదర్‌’ తెలుగుసేత) నవలను పంపగా ‘అమ్మ’ పేరుతో తెలుగులో జనాదరణ పొందిన ప్రఖ్యాత నవలకు ఆ శీర్షిక ఎందుకని అడిగాను. గోర్కి అమ్మను రాజకీయ ప్రేరణగా కాకుండా, ఒక మాతృమూర్తి వాత్సల్యమే ఆ నవలలో మౌలికమైన అంశమనే భావనతో అనువదించానని ఎంవిఆర్‌ సమాధానమిచ్చాడు.

నిఖిలేశ్వర్‌

Updated Date - 2021-09-30T06:41:51+05:30 IST