Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తి కీర్తనలు, సాహిత్యం ఒకటేనా?

‘కీర్తన సాహిత్యానికి క్రైస్తవ దోహదం’ పేరుతో తుల్లిమల్లి విజయభారతి రాసిన వ్యాసంలో (నవంబరు 1, 2021) కొన్ని అసంబద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. విజయభారతిగారి ప్రధాన ఆరోపణ ఏమిటంటే ‘‘ప్రజలు ఎన్నో దశాబ్దాలపాటు వర్ణవ్యవస్థలోనిపై మూడు వర్ణాలు రాసిన సాహిత్యాన్నే తెలుగు సాహిత్యంగా భావించారు. వారి మత విశ్వాసాలు, వారి ఫిలాసఫీ (వేదాంత/తత్త్వ విషయాల)పై వచ్చిన రచనలు మాత్రమే తెలుగు సాహిత్యంగా కొనసా గాయి.’’ కానీ ఈ మాట వాదానికి నిలబడేది కాదు. పై మూడు వర్ణాలు (బ్రాహ్మణ/ వైశ్య/ క్షత్రియులు) రచనలు మాత్రమే తెలుగు సాహిత్యంగా గుర్తించారనడం సబబు కాదు. పూర్వం 1898లో జన్మించిన రెవరెండు మకా యేసు జీవరత్నం గారికి చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు గురువుగా ఉన్నాడు. ఆయన ఆయన వద్ద సాహిత్యాన్ని నేర్చుకుని, బైబిల్‌ గాథలను స్పృశిస్తూ రచించిన క్రైస్తవ భక్తి కీర్తనలపై ‘దేశి భక్తితత్వాల’ ప్రభావం ఉంది. ఈ నాల్గవవర్ణ కీర్తనలు హిందూ సాంప్రదాయం నుంచి ప్రాణం తీసుకున్నవి. ఈ కీర్తనల మూలాలు హిందూత్వం నుంచి గ్రహించినవే! ఇక ‘‘దోహదం’’ అంటే ఏమిటో వ్యాస రచయిత్రే చెప్పవలసి ఉంది. దానికి నిదర్శనంగా ఒక పాటను చెప్తాను. ‘‘కోరదేమి చేతును - నా దుర్మనసు మారదేమి చేతును - ఈ దుర్మనస్సు కుదుర దేమి సేతును. ప్రభు యేసు నాథుని - పాదాంబుజము కడ/ ప్రార్థన నాలింప - పరుగెత్తుటకు నింక’’ అంటూ సాగుతుంది. సంగీతానికి మతం కులంలేనే లేదు. జాషువా కవి రాసిన సాహిత్యాన్ని తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. గండపెండేరం ధరించి, కనకాభిషేకాలు పొంది గజారోహణం చేసి పగటి దివిటీల పల్లకిలో ఊరేగారు జాషువా. విశ్వనాథ సత్యనారాయణగారు జాషువాను మహాకవి అని ప్రకటించాడు. 


‘‘ఆంధ్ర-పదాన్ని 180 సంవత్సరాలకుపైగా మోస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి ప్రపంచ తెలుగు మహాసభల్లో మాటవరసకైనా ఎందుకు ప్రస్తావించలేదు!’’ అని వారి మరో ఆవేదన. ప్రపంచ తెలుగు మహాసభలు సాహిత్యము, భాష ప్రాధాన్యంగా జరగాలని, తెలుగు అంతరించి పోకుండా కాపాడాలని ఏర్పాటు చేయబడ్డవి. వివిధ మతస్తుల కీర్తనల ప్రచారం కోసం కాదు. ఆ సభల్లో త్యాగరాజ కీర్తనల కచేరీలు, అన్నమయ్య కీర్తనలు జరుగలేదు. కేవలం తెలుగు భాష, సాహిత్యం మాత్రమే అక్కడ ముఖ్యం. ప్యూర్‌ సాహిత్యం ఎవరు రాసినా ఏ వర్గం ఏ వర్ణం వారైనా అభినందనీయులే! మతాలకతీతంగా, ఎవరు వ్రాసినప్పటికి తెలుగు సాహిత్యాన్ని జనం హర్షామోదాలు తెలిపారు. ఆదరించారు. ఇటీవల జరిగిన తెలంగాణా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘‘తెలుగు సాహిత్యానికి తెలంగాణ దళిత సాహిత్యం గొప్ప కూర్పుగా’’ తెలంగాణ సాహిత్యఅకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి అభివర్ణించారు. 


తెలుగు క్రైస్తవులు పురుషోత్తమ చౌదరి గారి కీర్తన ‘‘ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా’’ అనే కీర్తన ఉదహరిస్తూ, ‘‘మరొక విషయమేమిటంటే కవి ఎక్కడా యేసుప్రభువు పేరు ఉటంకించి రాయలేదు’’ అన్నారు. మనం కీర్తన రెండవ చరణం గమనిస్తే ‘‘కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శరీర రక్తము చిందుట/ భూరి దయతో నన్ను నీ దరి - జేర రమ్మని పిలుచుటయు’’ అని సాగుతుంది. ఏసు ప్రభువు పేరు ‘‘ఉటకించలేదనడం న్యాయమా?’’ పైగా అది ‘‘అలవైకుంఠ పురంబులో’’ అన్న బమ్మెర పోతనామాత్యుని పద్యంతో సరిపోలుతుందన్నారు. రెండూ ఒకచోట పెట్టుకుని అర్థ తాత్పర్యాలు గమనించమని వారికి నా మనవి.  


చివరిగా వారు వ్యాసం ముగిస్తూ, ‘‘డ్రాయింగ్‌ రూములో ఏనుగు నిలబడినా గమనించనట్లు పేదల సమూహానికి చెందిన ప్రజలు అనుసరిస్తున్న మత కీర్తనలను గానీ, వారి సాహిత్యాన్నిగానీ ప్రధాన స్రవంతిలోని సాహిత్యకారులు దాదాపు రెండువందల సంవత్సరాలపాటు నిర్లక్ష్యం చేశారు.’’ అని సమాజంపై ఒక పెద్దబండ పడేశారు. ఈ ఆరోపణ సహితం నిలబడేది కాదు. ఏనుగంటే ఎవరు? ఎవరి డ్రాయింగు రూంలో ఉంది? ఎవరు గమనిచలేదు? ప్రతిభ ఉండి గుర్తింపు పొందిన పేద, దళిత కవులు కళాకారులు ఎంతో మంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతిభ ఉన్నవారిని కాలం ఎన్నడూ నిర్లక్ష్యం చేయదన్న విషయం విజయభారతి తెలుసుకోవలసి ఉన్నది. ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. భూసురపల్లి ఆదిశేషయ్య అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో డోలు వాయిద్య కళాకారుడిగా రాణించి, అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి ఖ్యాతిని వాటిచెప్పి జాతీయ స్థాయిలో ప్రధాని ఇందిరాగాంధీ సత్కారం అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం పొందారు. ఇలా నాల్గవ వర్ణానికి చెంది గుర్తింపు తెచ్చుకున్న పేద కళాకారులు, కవులు కోకొల్లలనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 


తుల్లిమల్లి విజయభారతిగారు సంగీతాన్ని, సాహిత్యాన్ని కలిపి కలగాపులగం చెయ్యకుండా, నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నదీ, ఏ ప్రతిభగల వాగ్గేయకారుణ్ణి ఏ ప్రభుత్వం లేక ఏ వర్గం, ఏ వర్ణం నిర్లక్ష్యం చేసింది ఎత్తి చూపితే బావుండేది. చివరిగా నేను వారికి విన్నవించేదేమిటంటే, ప్యూర్‌ సాహిత్యం వేరు మత-దైవ సంబంధిత కీర్తనలు వేరు. కీర్తనల్లో సాహిత్యం లేదని నేననడంలేదు. కానీ.. కీర్తనలను సాహిత్యాన్ని ఒకే గాటన కట్టరాదు. కీర్తనల్లో దైవ ప్రసక్తి ఉంటుంది. అదే పెద్ద అడ్డంకి. ఎవరి కీర్తనలను వారిని వారిని హాయిగా పాడుకోనివ్వండి.  

టేకుమళ్ళ వెంకటప్పయ్య

94904 00858


Advertisement
Advertisement