నాపై కత్తికట్టారు!

ABN , First Publish Date - 2020-03-21T09:47:42+05:30 IST

‘‘నాపై కత్తికట్టారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయు. చైర్మన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌

నాపై కత్తికట్టారు!

అడుగడుగునా అవమానిస్తున్నారు

పేషీ లేదు.. పీఏ లేడు.. అటెండర్లు లేరు

నేను చేయాల్సిన పనులూ సెక్రటరీతోనే

ఫైళ్లపై సభ్యులు గుడ్డిగా సంతకాలు

నేనుండగానే ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ నియామకం

ఈ విషయంలో గవర్నర్‌ అధికారాలూ హైజాక్‌

నాలుగు నెలలుగా భరిస్తున్నా.. సహిస్తున్నా..

ఇప్పటికైనా పద్ధతి ప్రకారం జరిగేలా చూడండి

గవర్నర్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ గోడు

హరిచందన్‌కు 3 పేజీల లేఖ అందజేత


అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘‘నాపై కత్తికట్టారు. అడుగడుగునా అవమానిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయు. చైర్మన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ సెక్రెటరీ ద్వారానే జరుగుతున్నాయి. ఫైళ్లపై మెంబర్లు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు. ఈ పరిణామం నన్ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇప్పటి వరకు ఓర్చుకున్నాను. సహించాను’’ అని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ శుక్రవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ గవర్నర్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు.


గత ప్రభుత్వం నియమించడమే పాపమా?

గత ప్రభుత్వ హయాంలో తాను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో నియామకం పొందానని పిన్నమనేని వివరించారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన గవర్నర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులపాటు కనీసం చాంబర్‌కు వచ్చి కూర్చోలేని పరిస్థితులు కూడా కల్పించారని తెలిపారు. చైర్మన్‌ ఉండగానే ఎలాంటి సమాచారం, కారణం లేకుండానే మెంబర్‌ రంగరాజన్‌ను ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించారని, వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంటుందని వివరించారు. కానీ, ఈ వ్యవహారంలో గవర్నర్‌ అఽధికారాలను కూడా సెక్రెటరీ లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీలో చైర్మన్‌కు కనీసం పేషీ లేకుండా తీసేశారని తెలిపారు. నిబంధనల ప్రకారం.. చైర్మన్‌ పేషీలో పీఏ ఉండాలి. కానీ, అప్పటి వరకు ఉన్న పీఏని తొలగించారు. అలాగే చైర్మన్‌ రూం తె రిచేందుకు డోర్‌ అటెండర్‌ ఉన్నా అతన్నీ తొలగించారు. పర్సనల్‌ అటెండర్‌ను సైతం లేకుండా చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన కమిషన్‌లో చైర్మన్‌గా తనకు అనేక ఇబ్బందులు సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.


సర్వం సెక్రటరీనే!

తనకు గత నాలుగు నెలల కాలంలో ఒక్క ఫైలు కూడా పంపించలేదని, చైర్మన్‌తో ప్రమేయం లేకుండానే అన్ని బాధ్యలను సెక్రెటరీనే నిర్వహిస్తున్నారని ఉదయభాస్కర్‌ పేర్కొన్నారు. కమిషన్‌లో తనకు పూర్తిగా సహాయ నిరాకరణ జరుగుతోందన్నారు. సెక్రెటరీ గానీ, మెంబర్లు గానీ తనతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కానీ ఈ నాలుగు నెలల కాలంలో అనేక రిక్రూట్‌మెంట్లకు సంబంధించి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారని గుర్తుచేశారు. చైర్మన్‌ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బాధ్యతలను, కార్యకలాపాలను సెక్రెటరీ నిర్వహిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. మెంబర్లు కూడా సెక్రెటరీకి పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ తాను ఆఫీసుకు వెళ్లి వస్తున్నానని వివరించారు. నియమ, నిబంధనల ప్రకారం.. ఏపీపీఎస్సీలో రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-03-21T09:47:42+05:30 IST