ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం

ABN , First Publish Date - 2021-06-15T08:17:37+05:30 IST

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌లను

ఎమ్మెల్సీల ఫైలుకు ఆమోదం

గవర్నర్‌ దంపతులతో సీఎం దంపతుల భేటీ 

అప్పిరెడ్డి, త్రిమూర్తులు కేసులపై జగన్‌ వివరణ

సంతృప్తిచెందిన విశ్వభూషణ్‌

వారితోపాటు రమేశ్‌, మోషేన్‌రాజుల నియామకంపై సంతకం

ఆ వెంటనే జీఏడీ ఉత్తర్వు


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేన్‌రాజు, రమేశ్‌ యాదవ్‌లను నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్‌కు పంపిన ఫైలు రాజ్‌భవన్‌లో నాలుగు రోజులుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో త్రిమూర్తులు, అప్పిరెడ్డి పేర్లపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం ఆయన్ను కలిసినప్పుడు వివరణ ఇచ్చారు. వారిపై ఉన్న కేసులు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు అడ్డువచ్చేవికావని తెలిపారు. త్రిమూర్తులుపై ఉన్న కేసు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అడ్డురాలేదని.. సమైక్య ఉద్యమ సమయంలో లేళ్ల అప్పిరెడ్డిపై పెట్టిన కేసు కూడా ఇదే తరహాదని జగన్‌ పేర్కొన్నారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్‌.. నలుగురు ఎమ్మెల్సీల నియామకపు ఫైలుపై వెంటనే సంతకం చేశారు. అనంతరం.. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేశ్‌ యాదవ్‌, మోషేన్‌రాజు ఎమ్మెల్సీలుగా నియమిస్తున్నట్లుగా సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) ఉత్తర్వు జారీ చేసింది. తొలుత సాయంత్రం రాజ్‌భవన్‌కు జగన్‌ దంపతులు చేరుకున్నారు. ముందుగానే షెడ్యూల్‌ ఖరారు కావడంతో గవర్నర్‌ సిద్ధంగా ఉన్నారు. సీఎం ఆయనకు నమస్కరించి.. తనతో తెచ్చిన ఓ మొక్కను, వేంకటేశ్వరస్వామి పటాన్ని అందించారు. గవర్నర్‌ సతీమణి సుప్రవా హరిచందన్‌ కూడా అక్కడకు వచ్చారు. భారతిని ఆమె పలుకరించారు. ఆమెకు భారతి మర్యాదపూర్వకంగా బహుమతి అందజేశారు. అనంతరం .. ఎమ్మెల్సీ అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను గవర్నర్‌ ప్రస్తావించారు. వాటికి సీఎం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు. ఇదే సమయంలో ఇటీవల తన ఢిల్లీ పర్యటన వివరాలను కూడా జగన్‌ గవర్నర్‌కు తెలియజేశారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.


అప్పిరెడ్డి.. త్యాగానికి బహుమతి

వైసీపీ ఆవిర్భావం నుంచి గుంటూరు జిల్లాలో వెన్నుదన్నుగా నిలిచిన లేళ్ల అప్పిరెడ్డికి ఊహించిన విధంగానే శాసనమండలిలో చోటు దక్కింది. వైఎ్‌సఆర్‌ హయాంలోనే జగన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన కు.. అప్పట్లో జగన్‌ సిఫారసుతోనే ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి దక్కింది. వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవ ర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అ క్కడ అప్పిరెడ్డిని కాదని వేరొకరికి టికెట్‌ ఇచ్చారు. సీటు నుత్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ అప్పుడే ఆయనకు హామీ ఇచ్చారు. దానిప్రకారమే గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో అవకాశం కల్పించారు.


మోషేన్‌రాజు.. కౌన్సిలర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకు..

మోషేన్‌రాజు.. సామాన్య కుటుంబం నుంచి కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించి భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ప్రస్థానం ప్రారంభించి.. శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన వివాదరహితుడు. అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. 1987 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై పట్టణ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 2009లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. డీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్జిగా వ్యవహరించారు. తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2019లో జగన్‌ సీఎం అయిన తర్వాత జిల్లాలో తొలి పర్యటన మోషేన్‌రాజు కుమార్తె వివాహానికి హాజరుకావడమే.


రమేశ్‌ యాదవ్‌.. చైర్మన్‌ కాలేక..

హైదరాబాద్‌లో విద్య-ఉద్యోగాల కన్సల్టెన్సీ ఏజెన్సీ ‘అబాకస్‌’ నిర్వాహకుడైన రమేశ్‌ యాదవ్‌కు.. మొన్నటి పురపాలక ఎన్నికల్లో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి మున్సిపల్‌ చైర్మన్‌ను చేస్తామని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చింది. 11వ వార్డు కౌన్సిలర్‌గా ఆయన గెలిచారు కూడా. చివరి నిమిషంలో మహిళకు అవకాశం దక్కింది. దాంతో ఆయన్ను మండలికి పంపుతామని నాయకత్వం హామీ ఇచ్చింది.


త్రిమూర్తులు.. నాలుగు సార్లు ఎమ్మెల్యే..

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన తోట త్రిమూర్తులు సీనియర్‌ నేత. 1994లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1999లో టీడీపీ తరఫున గెలిచారు. 2004, 09 ఎన్నికల్లో ఓడిపోయారు. 2012లలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014లో టీడీపీలో చేరి మళ్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ఏడాది సెప్టెంబర్లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ శాసనమండలి సభ్యత్వం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడది సాకారమైంది. 

Updated Date - 2021-06-15T08:17:37+05:30 IST