అప్లయెన్సెస్‌ పరిశ్రమకు కష్టమే..

ABN , First Publish Date - 2020-03-16T06:58:21+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి. అయినా ఉత్పత్తి పుంజుకోవడం లేదు. భారత్‌లోని అనేక పరిశ్రమలు చైనా నుంచి దిగుమతి అయ్యే విడిభాగాలతో ఉత్పత్తులను...

అప్లయెన్సెస్‌ పరిశ్రమకు కష్టమే..

  • చైనా విడిభాగాల సరఫరా పెరగకపోతే ఉత్పత్తికి దెబ్బ
  • ఉత్పత్తుల ధరలు పెంచుతున్న కంపెనీలు


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి. అయినా ఉత్పత్తి పుంజుకోవడం లేదు. భారత్‌లోని అనేక పరిశ్రమలు చైనా నుంచి దిగుమతి అయ్యే విడిభాగాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీటి సరఫరా ఆశించిన స్థాయిలో పెరగకపోతే పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని అం టున్నారు. ముఖ్యంగా అప్లయెన్సెస్‌, కన్స్యూమ ర్‌ ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమ రాబడులపై దెబ్బపడుతుందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తుల తయారీపై ప్రభావం పడుతోంది. మరోవైపు వేసవి వచ్చినందు వల్ల ఈ కాలంలో వినియోగించే ఎయిర్‌ కండీషనర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వీటి నిల్వలు తక్కువగా ఉన్నందు వల్ల కొన్ని కంపెనీలు ధరలు పెంచడం మొదలుపెట్టాయి.


సప్లయ్‌ సంబంధిత అవరోధాలను దృష్టిలో ఉంచుకునే కంపెనీలు ధరలను సవరిస్తున్నాయని కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా)  చెబుతోంది. చైనాలో ఫ్యాక్టరీల కార్యకలాపాలు ప్రారంభమైనా సగం వరకు ఉత్పత్తి సామర్థ్యంతోనే అవి పని చేస్తున్నాయని సీమా అంటోంది. ముడిసరుకుల లభ్యత ఏప్రిల్‌ వరకు పుంజుకోకపోతే పరిశ్రమ రెడ్‌జోన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతోంది. కరోనా వైరస్‌ దాడి కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, చైనా దిగుమతులపై ఆధారపడటమే ఇందుకు కారణమని అంటున్నారు.


చైనాలోని ఫ్యాక్టరీలు 50-60 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్టు సమాచారం ఉందని సీమా ప్రెసిడెంట్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు. తమ కంపెనీ ఏసీల ధరలను 2-3 శాతం పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. విడిభాగాల సరఫరాలో కొరత, కస్టమ్స్‌ సుంకం పెంపు, అధిక లాజిస్టిక్‌ వ్యయాలు వంటి ధరల పెంపునకు దారితీస్తున్నట్టు ఆయన చెప్పారు. సీమా, ఫ్రోస్ట్‌ అండ్‌ సులివన్‌ సంయుక్త నివేదిక ప్రకారం.. 2018-19 సంవత్సరంలో పరిశ్రమ మార్కెట్‌ పరిమా ణం రూ.76,400 కోట్లుగా ఉంది. ఇందులో దేశీయ మాన్యుఫ్యాక్చరింగ్‌ ద్వారా సమకూరిన మొత్తం రూ.32,200 కోట్లు. 


ఫెరారీ ఉత్పత్తి నిలిపివేత

ఇటలీ లగ్జరీ కార్ల దిగ్గజం ఫెరారీ తన రెండు ఫ్యాక్టరీల్లో రెండు వారాల పాటు ఉత్పత్తిని నిలిపివేసింది. మార్చి 27వ తేదీ వరకు ఈ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఉండదని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలకు ఉత్పత్తికి సంబంధం లేదని కంపెనీ సీఈఓ లూయిస్‌ కామిలెరి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. 


ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది సంశయిస్తున్నారు. ప్రయాణాల్లోనూ ఒంటరిగానే వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా డీలర్‌షి్‌పకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా తన ‘క్లిక్‌ టు బై’ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టిసారిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ కంపెనీ పలు అంతర్గత చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులతోపాటు  చెన్నై ప్లాంట్‌, కార్యాలయంలోకి వచ్చే సందర్శకుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ల విదేశీ ప్రయాణాలను నిషేధించింది. అత్యంత ముఖ్యం అయితే తప్ప దేశీయంగా బిజినెస్‌ ట్రిప్‌లకు అనుమ తించడం లేదు. 


నిర్మాణం, రవాణాపై ప్రభావం

కరోనా వైరస్‌ మూలంగా చైనాలో నిర్మాణం, రవాణా, కెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి రంగాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌ అత్యధికంగా ముడిచమురు, బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మొత్తం దిగుమతుల్లో వీటి వాటాయే 46 శాతం ఉంటుంది. 2018-19 సంవత్సరంలో భారత్‌ మొత్తం దిగుమతులు 50,700 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇందులో 26 శాతం వాటా ఇనుము, ఉక్కు, ఇనార్గానిక్‌ కెమికల్స్‌ వంటివి ఉన్నాయి. ఈ దిగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత్‌ ఇనుము, ఉక్కు దిగుమతుల్లో చైనా వాటా 11 శాతంగా ఉంది. ఇనార్గానిక్‌ కెమికల్స్‌ దిగుమతుల్లో చైనా వాటా 15 శాతం ఉంది. దక్షిణ కొరియా తన అవసరాల్లో 20 శాతం చైనా నుంచి దిగుమతిచేసుకుంటోంది. చైనాలో మూసివేత కారణంగా నిర్మాణం, రవాణా, మాన్యుఫ్యాక్చరింగ్‌, కెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, మెషనరీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ంటి రంగాలు ప్రభావితం అవుతాయని నివేదిక పేర్కొంది. 


ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి

చైనాపై ఆధారపడకుండా ముడిసరుకులను కొనుగోలు చేయడానికి ఇతర మార్కెట్లను అన్వేషించమని తన సభ్యులకు అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) చైర్మన్‌ ఏ శక్వివేల్‌ సూచించారు. ముడిసరుకుల సరఫరాకు ప్రత్యామ్నాయ వనరులను గుర్తించాలని భారత రాయబార కార్యాలయాలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అమెరికా, ఈయూ, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో 10 అపారెల్‌ ఉత్పత్తులను గుర్తించామని, ఇవి చైనా నుంచి ఉత్పత్తులను తగ్గించుకున్నాయని చెప్పారు.

Updated Date - 2020-03-16T06:58:21+05:30 IST