శీర్షాసనంలో శక్తీశ్వరుడు

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

పరమశివుణ్ణి ఆలయాల్లో సాధారణంగా లింగ రూపంలోనే చూస్తూంటాం. కానీ తలకిందులుగా... అంటే శీర్షాసనంలో పరమేశ్వరుడు దర్శనం ఇచ్చే అరుదైన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని ..

శీర్షాసనంలో శక్తీశ్వరుడు

పరమశివుణ్ణి ఆలయాల్లో సాధారణంగా లింగ రూపంలోనే చూస్తూంటాం. కానీ తలకిందులుగా... అంటే శీర్షాసనంలో పరమేశ్వరుడు దర్శనం ఇచ్చే అరుదైన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని యనమదుర్రు గ్రామంలో ఉంది. ఈ ప్రాచీన ఆలయంలో ఒకే పీఠంపై శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి కొలువై ఉండడం ఒక విశేషం కాగా... అమ్మవారు మాతృమూర్తిగా బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తన ఒడిలో చేర్చుకొని లాలిస్తున్నట్టు కనిపించడం మరింత ప్రత్యేకం. 


యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దంలో వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. పన్నెండో శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి... జరిపిన దాడుల్లో ఈ ఆలయం దెబ్బతిని, శిథిలమై, కనుమరుగైపోయింది. వందేళ్ళ కిందట తవ్వకాల్లో ఈ గుడి మళ్ళీ బయటపడింది. దక్షిణ కాశీగా ప్రశస్తి పొందిన ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. ఆయన సర్పాకృతిలో ఉంటాడనీ, ఈ ఆలయానికి, చెరువుకు రెండు నాగ సర్పాలు ఇటీవలి కాలం వరకూ కాపలా ఉండేవనీ, రోజూ బ్రహ్మీ ముహూర్తంలో... చెరువులో అవి వలయాకారంలో మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవనీ స్థానికులు చెబుతారు. భీమవరంలోని పంచారామ ఆలయం కన్నా ఇది పురాతనమైనదనీ, ఆ ఆలయం గురించీ, శక్తీశ్వరుడి గురించీ మహా కవి కాళిదాసు స్తుతించాడనీ, భోజరాజు, కాళిదాసు ఇక్కడకు వచ్చి పూజలు చేశారనీ కథనాలు ఉన్నాయి. శ్రీనాథ మహాకవి ‘కాశీఖండం’ కావ్యంలోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుందంటారు.


మహిమాన్వితం శక్తికుండం

శక్తీశ్వరుడి ఆలయానికి ఎదురుగా ‘శక్తికుడం’ అనే చెరువు ఉంది. స్వామివారి అభిషేకాలకూ, నైవేద్యాలకూ ఈ నీటినే వినియోగిస్తారు. ఈ చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించాలనే ఆలోచనతో... ఒకప్పుడు ఈ చెరువును ఎండగట్టారట. ఆ సమయంలో స్వామి కైంకర్యం కోసం వేరే చెరువు నీటిని ప్రసాదం తయారీకి ఉపయోగిస్తే... అది ఉడకలేదట. అప్పుడు ఎండగట్టిన చెరువులో అర్చకులు గుంట తవ్వగా నీరు వచ్చిందట. ఆ నీటిని వినియోగించగా... ప్రసాదం వెంటనే ఉడికిందట. అప్పటి నుంచీ స్వామి వారికి నివేదించే ప్రసాదం తయారీకి చెరువు నీటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు.. శక్తికుండంలోని నీరు అత్యంత మహిమాన్వితమైనదనీ, దీనిలో స్నానం చేసినవారికి మృత్యుభయం ఉండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ కుండంలో నీటిని సేవిస్తే... రోగాలు నయమవుతాయనీ భక్తుల విశ్వాసం. 


ఈ ప్రాచీన ఆలయంలో ఒకే పీఠంపై శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి కొలువై ఉండడం ఒక విశేషం కాగా... అమ్మవారు మాతృమూర్తిగా బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తన ఒడిలో చేర్చుకొని లాలిస్తున్నట్టు కనిపించడం మరింత ప్రత్యేకం. 

కడలి ప్రసాద్‌, భీమవరం.   


Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST