ఒక గంట వదలండి

ABN , First Publish Date - 2021-04-17T09:36:51+05:30 IST

ఒకరి వెంట ఒకరిగా ఆరుగురిని ఊచకోత కోసిన అప్పలరాజులో అంత కసి ఎలా వచ్చిందనే దానిపై విశాఖ పోలీసులు దృష్టి పెట్టారు. అంతమందిని తన కత్తికి బలి ఇచ్చిన

ఒక గంట వదలండి

  • వాడిని కూడా వేసేస్తా
  • వదిలితే రూ.కోటి ఇస్తా
  • విశాఖ పోలీస్‌స్టేషన్‌లో అప్పలరాజు ఆవేశం
  • విజయ్‌కిరణ్‌ వచ్చాడని తెలియగానే తీవ్రాగ్రహం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఒకరి వెంట ఒకరిగా ఆరుగురిని ఊచకోత కోసిన అప్పలరాజులో అంత కసి ఎలా వచ్చిందనే దానిపై విశాఖ పోలీసులు దృష్టి పెట్టారు. అంతమందిని తన కత్తికి బలి ఇచ్చిన అతడు.. ఆ కుటుంబానికి చెందిన మరొకరిని హత్య చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసుస్టేషన్‌లోనే ఆవేశానికి గురయినట్టు సమాచారం. అందుకు అనుమతిస్తే.. కోటి రూపాయలు ఇస్తానంటూ వింత డిమాండ్‌ పెట్టాడని తెలిసింది. విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ అనే వ్యక్తి పెందుర్తి మండలం జుత్తాడ వచ్చారనే ఉద్దేశంతో గురువారం ఉదయం అప్పలరాజు కత్తి తీసుకొని అతడిని చంపడానికి వాళ్లింటికి వెళ్లిన సంగతి తెలిసిందే.


తన కుమార్తెకు పెళ్లి కాకుండా అడ్డం పడుతున్న విజయ్‌కిరణ్‌ కుటుంబంలో ఎవరినీ వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కనిపించిన వారిని కనిపించినట్టుగా నరికేశాడని చెబుతున్నారు. అనంతరం అప్పలరాజు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. అక్కడే ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సాయంత్రం విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ వచ్చాడని పోలీసు మాటల ద్వారా విన్న నిందితుడు... ‘‘సార్‌, ఒక్క గంట వదిలిపెట్టండి. కోటి రూపాయలు ఇస్తాను. వాడిని కూడా వేసేసి వచ్చి మళ్లీ లొంగిపోతా’ అన్నట్టు సమాచారం. కాగా, అప్పలరాజు స్థానికంగా ఎవరైనా సాయం కోరి వస్తే ఆదుకుంటాడని చెబుతున్నారు. అయితే తన కుమార్తెను విజయ్‌కిరణ్‌ మభ్యపెట్టి లొంగదీసుకోవడమే కాకుండా, అతడి కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని అప్పలరాజు అనుమానం.


దానిపైనే మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు వస్తుంటే...వారే చెడగొడుతున్నారని అనుమానిస్తున్నాడు. పైగా విజయ్‌కిరణ్‌ భార్య పెట్టిన కేసులో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తున్నదనే అసహనం కూడా పెరిగిపోయింది. తప్పుచేసిన వారు బాగుండగా, అడపిల్ల తండ్రిగా తనకు ఆవేదన మిగిలిందనే బాధ అప్పలరాజులో ఎక్కువగా ఉండేదని, అందుకే ఆ కుటుంబంపై అంత కక్ష పెంచుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-17T09:36:51+05:30 IST