Abn logo
Jul 16 2020 @ 07:18AM

మరో 4 రోజులు వర్షాలు

శ్రీశైలానికి వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): జార్ఖండ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనద్రోణి తూర్పుభాగం వాయువ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రాజమండ్రిలో 51, ధవళేశ్వరం, ఇంజరాం, పుంగనూరులో 50,  తాళ్లరేవు 49 మిల్లీమీటర్ల   వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని, ఈనెల 18, 19 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీగా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, శ్రీశైలం డ్యాంలోకి ఎగువ నుంచి స్వల్ప వరద మొదలైంది. మంగళవారం రాత్రి సుంకేసుల బ్యారేజ్‌ నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని కొన్ని గంటలపాటు వదిలారు. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను, 816.40 అడుగుల వరకు నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీకి 26,150 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజీలో గరిష్ఠంగా 12 అడుగుల నీటిమట్టం ఉండేలా చూస్తూ, 21,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. గురువారం ఉదయానికి ఎగువ నుంచి వచ్చే నీటి పరిమాణం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement