అడ్మిన్‌ కార్యదర్శులకు మరుగుదొడ్ల డ్యూటీ

ABN , First Publish Date - 2022-03-02T07:39:10+05:30 IST

వారంతా వార్డు కార్యదర్శులు! డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందారు. ....

అడ్మిన్‌ కార్యదర్శులకు మరుగుదొడ్ల  డ్యూటీ

మునిసిపాలిటీ టాయ్‌లెట్ల 

దగ్గర డబ్బులు వసూలు చేయండి

ఒక్కో మరుగుదొడ్డికి ముగ్గురు.. 

మూడు షిఫ్టుల్లో డ్యూటీ

వారిపై పర్యవేక్షణకు మరో ఆర్‌ఐ

కలెక్షన్‌ ‘లక్ష్యం’ తగ్గేందుకు వీల్లేదు

గుంటూరు కమిషనర్‌ ఆదేశాలు

ప్రొబేషన్‌ అడిగితే ఈ పనులా? 

సచివాలయ కార్యదర్శుల ఆగ్రహం

గుంటూరు కార్పొరేషన్‌ ఆదేశాలు

భగ్గుమంటున్న సచివాలయ కార్యదర్శులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వారంతా వార్డు కార్యదర్శులు! డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందారు. ‘మీ ద్వారా పట్టణ ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తాం. దేశంలోనే ఇదో విప్లవం’ అంటూ ప్రభు త్వం గొప్పగా చెప్పడంతో వీరంతా ఉప్పొంగి పో యారు. చివరికి.. జగన్‌ సర్కారు వారికి మునిసిపాలిటీ మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసే డ్యూటీ అప్పగించింది. గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన ఈ ఆదేశం... సర్కారు వారి ఆలోచనలను, వైఖరిని బట్టబయలు చేసింది. సచివాలయ సిబ్బందికి ఇప్పటికే ప్రొబేషన్‌ ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారికి మరుగుదొడ్ల వద్ద పైసా వసూల్‌ బాధ్యతలూ అప్పగించింది. మునిసిపాలిటీలు నిర్వహించే మరుగుదొడ్ల నిర్వహణకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. టెండర్‌ దక్కించుకున్న వ్యక్తులు తమ సిబ్బందిని నియమిస్తారు. ఒకవేళ... పాత కాంట్రా క్టు గడువు ముగిసిపోతే, కొత్త కాంట్రాక్టరు వచ్చేదాకా మరుగుదొడ్ల నిర్వహణను మునిసిపాలిటీలే చూసుకోవాలి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఐదు మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు గడు వు ఫిబ్రవరి 27తో ముగిసింది. కొత్తగా మరో కాం ట్రాక్టరుకు వాటిని అప్పగించాల్సి ఉంది. ఈలోపు వాటి నిర్వహణ ఎలా? దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌కు గొప్ప ఆలోచన వచ్చింది. ‘సచివాలయాల్లో అడ్మిన్‌ కార్యదర్శులు ఉన్నారు కదా! వాళ్లనే మరుగుదొడ్ల ముందు కూర్చోబెట్టి, డబ్బులు వసూలు చేయిద్దాం’ అని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా సోమవారం ఆదేశాలు జారీ చేసేశారు.


సొమ్ములు వసూలు చేయండి...

గుంటూరు నగరంలోని ఐదు మరుగుదొడ్ల వద్ద కూర్చుని డబ్బులు వసూలు చేసే బాధ్యతను 15మంది అడ్మిన్‌ కార్యదర్శులకు అప్పగించారు. ఒక్కో మరుగుదొడ్డికి ముగ్గురు చొప్పున నియమించారు. ఒక్కొక్కరు 8 గంటల చొప్పున ఒక్కో షిఫ్టులో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యా హ్నం 2  నుంచి రాత్రి పది వరకు మరొకరు, రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఒకరు.. ఇలా అడ్మిన్‌ కార్యదర్శులు షిఫ్టులవారీగా పనిచేయాలి. వారి పేర్లను కూడా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. వీరిలో మహిళా కార్యదర్శులూ ఉన్నారు. ఏ మరుగుదొడ్డి నుంచి రోజుకు ఎంత వసూలు చేయాలో కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక... మరుగుదొడ్ల కలెక్షన్‌ డబ్బు తీసుకుని మునిసిపాలిటీలో జమ చేసే బాధ్యతను ఓ రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. 


ఇదేం దౌర్భాగ్యం

దాదాపు రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వీరందరికీ ఆరు నెలల కిందటే ప్రొబేషన్‌ ఇవ్వాల్సి ఉంది. అప్పుడు వారి జీతం రూ.15 వేల నుంచి 30 వేల కు పెరుగుతుంది.  సొంత ప్రాంతంలో నిలకడైన జీతం ఉంటుందనే ఉద్దేశంతో.. చాలామంది కార్యదర్శులుగా చేరారు. కానీ... ప్రభుత్వం వీరిపై చిన్న చూపు చూస్తూ, ప్రొబేషన్‌ను ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేసింది. దీనిపై ఇటీవల సచివాలయ సిబ్బంది ఆందోళనకు దిగారు. తక్షణం తమకు ప్రొబేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇది మనసులో పెట్టుకునే ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని అనుమానిస్తున్నారు.  


ఇదీ ఉత్తర్వుల సారాంశం

‘‘గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో గాంధీపార్కు, బండ్లబజారు, కృష్ణా పిక్చర్‌ ప్యాలెస్‌, ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌, కొల్లి శారద కూరగాయల మార్కెట్‌ వద్ద ఉన్న ఐదు మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు గడువు ఫిబ్రవరి 27తో ముగిసిపోయింది. కాబట్టి... ఫిబ్రవరి 28 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ కింద తెలిపిన సిబ్బంది(అడ్మిన్‌ కార్యదర్శులు) మరుగుదొడ్ల వద్ద విధులు నిర్వహించాలి. మరుగుదొడ్లను వాడుకునే వారి నుం చి 2021-22 గజిట్‌ నందు ఉదహరించిన రేట్ల ప్రకారం కాలమ్‌ నెంబర్‌ 5లో చూపిన(రోజువారీ కలెక్షన్‌) మొత్తానికి తగ్గకుండా వసూలు చేసి అదే రోజు సాయంత్రం సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు డబ్బులు అందజేయాల్సిందిగా ఆదేశించడమైనది.  రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఈ రుసుమును మరుసటి పని దినములో క్యాష్‌ కౌంటర్‌లో జమ చేయాలి!’’ అంటూ ఏ మరుగుదొడ్డి వద్ద ఎవరికి డ్యూటీ వేసిందీ వివరాలు పేర్కొన్నారు.


ఆ డ్యూటీలు అభ్యంతరకరం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య

వార్డు అడ్మిన్‌ కార్యదర్శులకు మరుగుదొడ్ల వద్ద డ్యూటీలు వేయడం అత్యంత అభ్యంతరకరమని, ఖండిస్తున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు ఎండీ జానీ పాషా ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘కొందరు అధికారులు సచివాలయ ఉద్యోగులపై చిన్నచూపు చూస్తూ, కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి’’ అని ఆయన కోరారు.


Updated Date - 2022-03-02T07:39:10+05:30 IST