అలలపై అద్భుతం!

ABN , First Publish Date - 2022-02-22T08:32:20+05:30 IST

ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న భారత నౌకాదళం పనితీరు అద్భుతమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు....

అలలపై అద్భుతం!

భారత నౌకాదళ విన్యాసాలు భేష్‌

ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంస

పోటీతత్వాన్ని చాటిచెప్పిందన్న కోవింద్‌

పీఎ్‌ఫఆర్‌లో అదరగొట్టిన నావికాదళం

పాల్గొన్న 60 యుద్ధనౌకలు,

55 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు

కళ్లముందే మాయ చేసిన సబ్‌మెరైన్లు

సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన డార్నియర్‌


విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న భారత నౌకాదళం పనితీరు అద్భుతమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. విశాఖపట్నం వేదికగా సోమవారం జరిగిన 12వ ‘ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ’ కార్యక్రమంలో నౌకాదళాన్ని ఆయన సమీక్షించారు. 44 యుద్ధనౌకలు నడి సముద్రంలో, నాలుగు వరుసల్లో లంగరు వేసి ఉండగా, ప్రత్యేకంగా అలంకరించిన ‘ఐఎన్‌ఎస్‌ సుమిత్ర’లో వాటి మధ్యగా వెళుతూ పరిశీలించారు. ఆయా నౌకల్లో పది వేల మంది సిబ్బంది ధవళ వస్త్రాలను ధరించి, గౌరవ సూచికంగా తలపై టోపీని తీసి, తల వంచుతూ రాష్ట్రపతికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా వారు సర్వసైన్యాధ్యక్షుడికి ‘జై.. జై.. జై..’ అంటూ మూడుసార్లు జేజేలు పలికారు. వీవీఐపీలతో కూడిన సుమేధ, సావిత్రి నౌకలు ఆయన నౌకను అనుసరించాయి. మొత్తం 60 యుద్ధనౌకలు, 55 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మూడు సబ్‌మెరైన్లు ఈ సమీక్షలో పాల్గొన్నాయి. క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’, సబ్‌మెరైన్‌ ‘ఐఎన్‌ఎస్‌ వేలా’ కూడా సమీక్షకు హాజరయ్యాయి. సెయిలింగ్‌ బోట్లు ఐఎన్‌ఎస్‌ తరంగిణి, ఐఎన్‌ఎస్‌ మాధేయి రంగురంగుల తెరచాపలతో అలలపై మెల్లగా కదులుతూ కనువిందు చేశాయి. మెరైన్‌ కమెండోలు సముద్రంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, రక్షించే విన్యాసాలు ఉత్కంఠకు గురిచేశాయి. డార్నియర్‌, హాక్‌, పీ8ఐ విమానాలు, చేతక్‌, కమోవ్‌, సీకింగ్‌ హెలికాప్టర్లు ఒక దాని పక్కనే ఒకటి.. గుంపులుగా వచ్చి అబ్బురపరిచాయి. సబ్‌మెరైన్లు ఐఎన్‌ఎస్‌ సింధురాజ్‌, సింధుకీర్తి, వేలా రాష్ట్రపతి నౌక పక్కగా వచ్చి ఉనికిని ప్రదర్శించి, అంతలోనే కనుమరుగైపోయాయి. మెరైన్‌ కమెండోలు హెలికాప్టర్ల నుంచి పారాచ్యూట్ల ద్వారా కిందికి దూకి చేసిన విన్యాసాలు అలరించాయి. నౌకాదళ సమీక్ష అనంతరం రాష్ట్రపతి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలసి పోస్టల్‌ స్టాంపును ఆవిష్కరించారు.

 

విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్న భారత నావికాదళం ఏకంగా ఆ పేరుతో ఒక యుద్ధనౌకను నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ను సోమవారం జరిగిన రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూలో మొట్టమొదటి ఫ్లాగ్‌షి్‌పగా ప్రదర్శించింది. 


ప్రత్యక్ష ప్రసారానికి టవర్ల మార్పు

రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూ కార్యక్రమాల ప్రసారం కోసం నేవీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా సముద్రంలో కొంత దూరం వెళ్లిన తర్వాత సిగ్నల్స్‌ ఉండవు. ఫోన్‌ చేయాలన్నా, సమాచారం పంపాలన్నా వీలు కాదు. కానీ రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూను లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సముద్ర తీర నగరాల్లో టెలికాం సంస్థలు వాటి టవర్లను నగరాల వైపే ఏర్పాటు చేస్తాయి. విశాఖ తీరంలో కూడా బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌ తదితర సంస్థల వాటి టవర్లను అలాగే పెట్టుకున్నాయి. వాటి దిశ మారిస్తే తప్ప సముద్రంలో జరిగే ఫ్లీట్‌ రివ్యూ దూరదర్శన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కాదు. దీంతో ఆయా సంస్థలతో మాట్లాడి తీరంలో టవర్లను సముద్రం వైపు తిప్పారు.

Updated Date - 2022-02-22T08:32:20+05:30 IST