ఏపీలో 82 వేల పోస్టులు ఫట్‌.. ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’!

ABN , First Publish Date - 2022-02-03T07:53:26+05:30 IST

ఉద్యోగాలకు కోతపడనున్నదని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. గత ఏడాది అక్టోబరులో ఆర్థికశాఖ ఈ కసరత్తు ప్రారంభించినప్పుడు...

ఏపీలో 82 వేల పోస్టులు ఫట్‌.. ముందే హెచ్చరించిన ‘ఆంధ్రజ్యోతి’!

  • వేతన పద్దు కుదింపునకు ఏకంగా రద్దు బాట
  • ‘కాలం చెల్లాయి... అనవసరం’ 
  • పేరిట కత్తుల కోతలు
  • ఇంజనీరింగ్‌ విభాగాల్లోనే 
  • 14 వేల ఉద్యోగాలకు ఎసరు 
  • రెగ్యులర్‌ పోస్టులపైనా వేటు
  • అవన్నీ ఔట్‌సోర్సింగ్‌కు మళ్లింపు!
  • కార్పొరేషన్‌ ఉన్న శాఖలకూ ముప్పు 
  • ఒకే పనిచేసే వాటిలో భారీగా కోతలు
  • కీలక దశకు చేరిన ప్రభుత్వ కసరత్తు

ఉద్యోగాలకు కోతపడనున్నదని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. గత ఏడాది అక్టోబరులో ఆర్థికశాఖ ఈ కసరత్తు ప్రారంభించినప్పుడు ‘‘ఎవరికి మూడుతుందో’’ శీర్షికన కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఆ కథనంలో వ్యక్తం చేసిన అనుమానాలే ఇప్పుడు తొలగింపు ప్రతిపాదనలతో నిజం అవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : అనుమానించిందే నిజమవుతోంది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సర్కారు కోతల కత్తులు నూరుతోంది. తొలివేటు కొలువులపైనే వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పదో, వందో కాదు.. ఏకంగా 82వేల పోస్టులకు కోతపెట్టేందుకు గుట్టుగా రంగం సిద్ధం చేస్తోంది. తొలుత ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగుల సర్దుబాటు, రేషనలైజేషన్‌ పేరిట మొదలు పెట్టిన కసరత్తు నాలుగు నెలలు తిరిగేసరికి తన దశ, దిశను మార్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లో ఉద్యోగాలపై కోతపెట్టేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపాదనలను పరుగులు పెట్టిస్తోంది.


కోతలు పెట్టడం ద్వారా ఏ శాఖ ఎంత మేరకు ఆర్థిక భారం తగిస్తారో చూస్తాం.. అంటూ ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఏకంగా పెద్ద పరీక్ష పెట్టారు. దీంతో కొందరు తప్పదన్నట్లుగా, మరికొంద రు వేలంవెర్రిగా ఉద్యోగాల కోత ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఈ వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారి నిర్వహించే కీలక భేటీలో శాఖల వారీగా తొలగించే కొలువులు ఎన్ని.. రద్దుల పద్దులోకి వచ్చే కార్పొరేషన్లు, విభాగాలేమిటో స్పష్టత ఇస్తారు. అప్పటివరకు అంతా గుట్టుగా..గ్‌పచు్‌పగా ఉంచాలని మౌఖిక ఆదేశాలున్నాయి. ఈ విషయంలో నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుస్తోందా? అంటే అది వట్టిమాటే. ఏ కమిటీ లేదు. ఏ కమిషనూ లేదు. ఆర్ధికశాఖలో ఓ జూనియర్‌ అధికారి ఈ తంతును నిర్వహిస్తున్నారు. ఓ అధికారిక నివేదిక ప్రకారం, 52 ప్రభుత్వ శాఖల పరిధిలో కోతకు గురయ్యే ఉద్యోగాలు 82వేలు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో ఒక్క ఇంజనీరింగ్‌ విభాగాల్లోనే 14 వేల పోస్టులు పోనున్నాయి. ఈ కసరత్తు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరగనుందని సీనియర్‌ అధికారులు అంచనావేస్తున్నారు.


ఇప్పుడే కోతలు ఎందుకు?

కొత్తగా అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు వేతనాలు చెల్లించనిలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. వారికి చెల్లించాల్సిన బకాయిలు,పింఛన్లు కూడా బాగా ఆలస్యం అవుతున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్‌ విభాగాలు నిధుల కొరతతో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టడం లేదు. విదేశీ బ్యాంకుల రుణంతో చేపట్టే కొన్ని తప్ప అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇక ఆర్‌అండ్‌బీ పరిస్థితి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దెబ్బతిన్న రోడ్లకు కనీసం మరమ్మతులు చేయించలేకపోతోంది. తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఏయే శాఖల్లో ఎంతమేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో లెక్కతేల్చాలంటూ సర్కారు నివేదికలు కోరింది. సరిగ్గా ఈసమయంలోనే ఆర్థికశాఖ నుంచి గత ఏడాది అక్టోబరులో బాంబులాంటి ఆదేశం ఒకటి తొలుత  ఇంజనీరింగ్‌ విభాగాలకు చేరింది. అదే ఆప్టిమైజేషన్‌, రెవెన్యూ ఆగ్‌మెంటేషన్‌ ప్రాసెస్‌ ఆర్డర్‌. ఇంజనీరింగ్‌ విభాగాల పరిధిలో ఎంత మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు, వారికి ఉన్న పని ఏపాటిది? కొత్త ప్రాజెక్టులు ఏమి అమలు చేస్తున్నారు? నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయి?అవసరం లేని పోస్టులు ఏమిటి? అదనపు సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారు? అందులో అవసరం లేని సిబ్బంది, విభాగాలు ఏమిటన్న వివరాలు తెలియజేయాలని కోరింది.  ముందు తాము అడిగిన డేటా ఇవ్వాలని, ఏం జరుగుతుందో తర్వాతే చెబుతామని ఆర్థికశాఖ పరిధిలోని పీఎంయూ -ఆర్‌ఎఏ, ఈవో విభాగం అధికారి.. కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిసింది. తర్వాత ఆయా విభాగాలకు లేఖరాస్తూ రెండు ప్రొఫార్మాల్లో డేటా కోరారు. తొలుత ఇంజనీరింగ్‌ విభాగాలపైనే ఫోకస్‌ అనుకున్నారు. కానీ ఆ తర్వాతే ఇది చాలా పెద్ద టాస్క్‌ అని మిగతా శాఖలు గుర్తించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఇదే డేటా ఇవ్వాలంటూ ఆర్ధికశాఖ  కోరింది. గత నెలలో జరిగిన సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకూ అవసరం లేనివి, ప్రభుత్వానికి అవసరం లేనివి, మారిన పరిస్థితులకు అనుగుణంగా కాలం తీరినవి, ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న పోస్టుల సమాచారం కోరారు. వీటిని క్రోడీకరించిన తర్వాత   కోతపెట్టాల్సిన పోస్టులు ఎన్నో కేటగిరీల వారీగా తెలియజేయాలని తాజాగా అన్ని శాఖలను ఆదేశించారు. 


ఒకే పనిచేసే సంస్థలకు మంగళం?

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఇంజనీరింగ్‌ విభాగాలు అనేకం ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రోడ్లు, నీటి వనరుల నిర్వహణ వంటి విభాగాలున్నాయి. జలవనరుల శాఖ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ ఉంది. ఇవే పనులను ఇతర ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగాలు, కార్పొరేషన్‌లు, సంస్థలు చేపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, విద్య, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖలు, ఇతర విభాగాలు సొంతంగా ఇంజనీరింగ్‌ విభాగాలను కలిగి ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ చేసే పనులే అవీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు అవసరమా? వాటి వల్ల ఆర్ధికభారం ఎంత? ఇవే పనులను పెద్ద విభాగాలతో చేయించుకుంటే ఎంత ఆదా అవుతుందన్న కోణంలో కొన్నింటికి మంగళం పాడే అవకాశం ఉంది. అవసరంలేని, కాలం తీరిన విభాగాలు, వాటి పరిధిలోని పోస్టులను కోతపెడతారు. అంటే ఇక ఆ పోస్టులను భర్తీచేయరు. ఒకవేళ  ఇప్పటికే ఆయా పోస్టుల్లో ఎవరైనా పనిచేస్తోంటే...వారి రిటైర్‌మెంట్‌ తర్వాత అవి రద్దయ్యేలా విధాన నిర్ణయం తీసుకుంటారు. ఆటోమేషన్‌ వల్ల కొన్ని రకాల పోస్టుల అవసరం ఇప్పుడు లేదు. ఈ కోవలోని ఉద్యోగాలను పూర్తిగా రద్దుచేయనున్నారు. క్షేత్రస్థాయిలో టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రాప్ట్స్‌మెన్‌ వంటి పోస్టులు కూడా రద్దుల పద్దులోకి వచ్చేలా శాఖలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆయా శాఖలు సిద్ధం చేసిన ప్రతిపాదనలను బట్టి 30 శాతంపైనే పోస్టులు రద్దయ్యే అవకాశం ఉంది. అప్పుడు 40 శాతం రెగ్యులర్‌ పోస్టులు, మిగిలిన 30 శాతం ఔట్‌సోర్సింగ్‌ పోస్టులతో పనికానిచ్చేలా చర్చలు సాగుతున్నాయి.


అంతా నా ఇష్టం..

ఆర్థికశాఖలోని ఓ జూనియర్‌ అధికారికి ప్రభుత్వం తొలగింపుల టాస్క్‌ ఇచ్చింది. ఇక ఆ అధికారి ఒక్కరే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో నేరుగా చెప్పకుండా...రకరకాల పేర్లతో లేఖలు రాస్తున్నారు. వాటిపై ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు సమావేశంలో సందేహాలు వ్యక్తం చేస్తే ‘‘సార్‌ ఇది ఓపెన్‌గా చెప్పేది కాదు. పర్సనల్‌గా ఫోన్‌ చేస్తాను’’ అంటూ కొత్తపోకడను ప్రదర్శిస్తున్నారు. దీంతో ఏం జరగబోతుందో ముఖ్యకార్యదర్శులకు కూడా తెలియడం లేదు. కానీ, అటుతిప్పి, ఇటు తిప్పి చివరకు ఉద్యోగాల కోతకు అవసరమైన ప్రతిపాదనలను తెప్పించుకుంటూ వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘‘సాధారణంగా ప్రభుత్వ శాఖకు ఒక పోస్టు, దాని పరిధిలోని అనుబంధ పోస్టులను మంజూరు చేయించుకోవాలనుకుంటే ఏళ్లతరబడి సమయం తీసుకుంటుంది. కానీ, ఇక్కడ కేవలం 4 నెలల్లోనే వేల పోస్టుల రద్దుకు అంతా రెడీ చేస్తున్నారు. రెగ్యులర్‌ లైన్‌ పోస్టుల కొనసాగింపుపై మేం గట్టిగానే ఉన్నాం’’అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.



Updated Date - 2022-02-03T07:53:26+05:30 IST