సర్కారు నై.. ఉద్యోగులు సై

ABN , First Publish Date - 2022-02-03T07:50:57+05:30 IST

‘చలో విజయవాడ’కు భారీగా కదులుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు! వారు పయనమైన దారులనిండా కంచెలు, బారికేడ్లు, పోలీసు వలయాలు, సీసీ కెమెరాలతో సర్కారు ఆంక్షల చట్రం! అటు పీఆర్సీపై ఉద్యమ పిడికిలి.....

సర్కారు నై.. ఉద్యోగులు సై

నేడే చలో విజయవాడ 

కదిలిన ఉద్యోగ, ఉపాధ్యాయులు.. కట్టడి చేస్తున్న పోలీసులు

నోటీసులు, నిర్బంధాలు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు

వలంటీర్లను ఇళ్లకు పంపి ఉద్యోగుల కుటుంబాలపై ఒత్తిడి

ట్రావెల్‌ ఏజెన్సీల కట్టడి.. లాడ్జీలు, డార్మెటరీల్లో సోదాలు

సభ జరిగే బీఆర్‌టీఎస్‌ రోడ్డులోనే వంద సీసీ కెమెరాలు

నేడు సెలవులు ఇవ్వొద్దని అధికారులకు కలెక్టర్ల ఆదేశం

అయినా.. ‘చలో’కు విస్తృతంగా నేతల ఏర్పాట్లు

ఒక్కో జిల్లా నుంచి 10 వేలమంది వస్తారని అంచనా!


అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘చలో విజయవాడ’కు భారీగా కదులుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు! వారు పయనమైన దారులనిండా కంచెలు, బారికేడ్లు, పోలీసు వలయాలు, సీసీ కెమెరాలతో సర్కారు ఆంక్షల చట్రం! అటు పీఆర్సీపై ఉద్యమ పిడికిలి.. ఇటు 24 గంటల ముందే మొదలైన ఉక్కుపాదాల రాపిడి! జిల్లాల్లో ఎక్కడికక్కడ కట్టడి.. అరెస్టులు.. నేతల గృహ నిర్బంధాలు.. ఉపాధ్యాయుల ఇళ్లకు హెచ్చరిక నోటీసులు! ఉద్యోగుల సెలవులు రద్దుచేసి, గురువారం డ్యూటీకి రావాల్సిందేనని హుకుంలు! మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ ‘చలో’ను విజయవంతం చేసుకుంటే ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి మొదలయ్యే సమ్మెకు మంచి ఆరంభం లభిస్తుందనే ఆలోచనలో  పీఆర్సీ సాధన సమితి! ఆర్టీసీ కార్మికులు, వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు...ఇలా వేర్వేరు సెక్షన్ల నుంచి పెరుగుతున్న మద్దతు చలో పిలుపునకు తెచ్చిపెడుతున్న ఊపు! ఇలా ‘తగ్గేదేలే’ అంటూ ఇరు  శ్రేణులూ మోహరిస్తుండటంతో గడిచే ప్రతి నిమిషమూ ఉద్రిక్తతను పెంచేస్తోంది.


పాత జీతాలు అడిగితే కొత్త వేతనాలు వేయడం.. చర్చలకు పెట్టిన ఏ షరతునూ ఖాతరు చేయకపోవడం...ఉద్యోగులు భయపడినట్టే కొత్త పీఆర్సీతో తగ్గిన జనవరి వేతనాలను డీఏలతో కవర్‌ చేసి సర్కారు చేసిన తొండి నేపథ్యంలో అందరి దృష్టి ‘చలో విజయవాడ’పైనే నిలిచింది. ‘చలో’ను విజయవంతం చేయాలనే శక్తులూ, ఆ పిలుపును భగ్నం చేయాలని చూస్తున్న పోలీసు బలగాలూ.. రెండూ ఇప్పుడు విజయవాడపైనే కేంద్రీకరించాయి. కనీసం రెండు, మూడు లక్షలమంది విజయవాడకు రావడానికి ఎవరి ప్రయాణ ఏర్పాట్లు వారు చేసుకున్నట్టు పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యలో  రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఉద్యోగుల ఇళ్లకు చేరుకుని వలంటీర్లు.. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హౌస్‌ అరెస్టులు, అక్రమఅరెస్టులు చేస్తూ ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు పోలీస్‌ వ్యూహాలు, వలయాలను చేధించుకుంటూ ఇప్పటికే పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఉద్యోగులు సంఘ నాయకులు విజయవాడ చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న వారిని పసిగట్టేందుకు నగరాన్ని నిఘా వలయంలోకి నెట్టేశారు. ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నారు.. ఎవరు ఎక్కడ బస చేస్తున్నారు అనేది రహస్య నెట్‌వర్క్‌ ద్వారా ఆరా తీస్తున్నారు. 


దారుల కట్టడి.. 

‘చలో విజయవాడ’కు సిద్ధమైన ఉద్యోగు, ఉపాధ్యాయులపై బుధవారం ఉదయం నుంచే నిర్భందకాండ మొదలైంది. పోలీసులను ఎక్కడికక్కడ రంగంలోకి దించి జిల్లాల్లో అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. కొవిడ్‌ రూల్స్‌ సాకుతో ఉద్యోగులను ఒత్తిడి పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు ఇళ్లకు పోలీసులు చేరుకుని ఈమేరకు నోటీసులు అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడవైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించారు. నగరంలోకి ప్రవేశించే వారధి, గొల్లపూడి, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం శివార్లలో చెక్‌పోస్టులు పెట్టారు. ఏ దారినీ వదలకుండా జల్లెడ పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే ఆయా జిల్లాల్లో ట్రావెల్‌ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు కన్నేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, డార్మెటరీల్లో సోదాలు చేస్తున్నారు. సభ జరిగే విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులోనే వంద సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. 


ఉద్యమ పిడికిలి..

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే నిర్బంధకాండను సర్కారు ప్రోత్సహిస్తుండటం ఉద్యోగుల్లో కసిని పెంచింది. దిగ్బంధనానికి గురైన వారు రాలేకపోయినా మిగతావారు ఏదైతే అదే అయిందన్న తెగింపుతో రకరకాల మార్గాల్లో బయల్దేరారు. పోలీసులు ర్యాలీ, సభ జరగనివ్వం...దానికి అనుమతి లేదు అని చెప్తున్నా...ఎక్కడ ఆపితే అక్కడ వరకు వెళ్దాం అన్న సంకల్పంతో బయల్దేరిన వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఏమైనా ప్రతి జిల్లా నుంచి ఐదు వేలు నుంచి 10 వేలమందికి తగ్గకుండా తరలినట్టు పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు. 


ఉపాధ్యాయుల కదలికలపై కన్ను

ఉపాధ్యాయులపై మరింత ప్రత్యేకంగా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇంటిదగ్గరే ఆపేయడం, పాఠశాల నుంచి వస్తుంటే నిర్బంధించడం, అక్కడినుంచి బయల్దేరి విజయవాడ వస్తుంటే...నాలుగువైపులా పోలీసుల్ని పెట్టి తనిఖీలు చేయడం...అడ్డుకోవడం చేసింది. కేసులు, తిరగడాలు అవసరమా? అన్న సుతిమెత్తని హెచ్చరికలను పంపించారు. అయినా సరే బండిమీద, ఆటోలో, బస్సుల్లో, రైళ్లలో బయల్దేరిన వారిని ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు. గ్రామ వలంటీటర్లకు దీనిపై ప్రత్యేకంగా సూచనలిచ్చింది. వలంటీర్లకు కేటాయించిన ఇళ్ల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులెవరు; వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు తీసుకోవడం, వారికి విజయవాడకు వెళ్లొద్దని చెప్పడం చేసింది. అంతేకాకుండా అలా వెళ్లేవారిపై నిఘా పెట్టామన్న సంకేతాలు ఇచ్చింది. వెళ్తే ఇబ్బందిపెడతారన్న హెచ్చరికలు జారీచేసింది. ఉపాధ్యాయులపై ఈ స్థాయిలో కేంద్రీకరణ పెంచడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో పిలుపిచ్చినప్పుడు ఊహించనంత సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారీ ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను చూసి ప్రభుత్వమే అవాక్కైంది. మళ్లీ అలాంటి సంఘటిత ప్రదర్శన జరగకూడదనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ కట్టడికి సర్కారు సిద్ధమైంది. 



నేడు సెలవులు రద్దు.. 

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ‘చలో విజయవాడ’ జరిగే గురువారం నాడే ఉద్యోగులందరి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. మెడికల్‌ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోజు ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని బుధవారం జిల్లా కలెక్టర్లు అన్ని శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా విధులకు హాజరు కాకుంటే  ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. వేతనంలో ఒకరోజు కోత సహా ప్రభుత్వం ఎటువంటి క్రమశిక్షణ చర్యలనైనా సదరు ఉద్యోగిపై తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 



Updated Date - 2022-02-03T07:50:57+05:30 IST