20 నిమిషాల పాటు.. PM Modiతో YS Jagan ఏం చర్చించారు..!?

ABN , First Publish Date - 2022-01-04T07:59:40+05:30 IST

సాయంత్రం 4.40 గంటలకు ప్రధానితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 20...

20 నిమిషాల పాటు.. PM Modiతో YS Jagan ఏం చర్చించారు..!?

  • పాతపాటే!
  • ఏడు అంశాలతో ప్రధానికి సీఎం జగన్‌ వినతిపత్రం
  • అన్నీ గతంలో ఇచ్చిన వివరాలే!
  • ఢిల్లీలో మోదీతో ముఖ్యమంత్రి భేటీ
  • విభజన హామీలన్నీ నెరవేర్చండి
  • ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి
  • పోలవరం అంచనా వ్యయం
  • 55,657 కోట్లకు ఆమోదించండి
  • రెవెన్యూ లోటు భర్తీ చేయండి
  • 42,472 కోట్ల అప్పులకు అనుమతి
  • ప్రధానికి ముఖ్యమంత్రి విన్నపాలు
  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌,
  • సింధియాలతోనూ సమావేశం


 న్యూఢిల్లీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన పర్యవసానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, పురోగతిని పూర్తిగా కుంగదీశాయని ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలియజేశారు. విభజనతో రాజధానిని కూడా కోల్పోయామని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ సహా పెండింగ్‌లో ఉన్న విభజన హామీలన్నీ అమలు చేసి ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఢిల్లీలో సోమవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రధానితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్ర ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ.. ఏడు ముఖ్య అంశాలతో వినతి పత్రం సమర్పించారు. ఇదివరకు మోదీని కలిసినప్పుడు సమర్పించిన వినతిపత్రాల్లో ఏయే అంశాలున్నాయో మళ్లీ వాటినే అందులో ఏకరువుపెట్టారు. ఆయా అంశాలను మీడియాకు ప్రకటన రూపంలో విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న అనేక మౌలిక వసతులను.. విభజన కారణంగా ఆంధ్ర కోల్పోయిందన్నారు. విభజన సమయంలో 58 శాతం జనాభా తమ రాష్ట్రానికి వచ్చిందని.. రెవెన్యూ మాత్రం కేవలం 45 శాతమే దక్కిందని తెలిపారు. వినతిపత్రంలో సీఎం ఏమేం కోరారంటే..


కేంద్ర సంస్థలు ఆమోదించినా..

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017-18 ధరల సూచీ ప్రకారం రూ.55,657 కోట్లకు ఆమోదించాలి. 2013నాటి భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. అంతేగాక ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన వ్యయాన్ని మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూపంలో సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపాయి. కేవలం ఇరిగేషన్‌ కాంపొనెంట్‌కు మాత్రమే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే అంతర్భాగం. దేశంలోని ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇవే సూత్రాలను పాటిస్తున్నారు. అందువల్ల మీరు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలి. అంతేగాక ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,100కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపునకు ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలి.


రెవెన్యూ లోటు కుదింపు..

అవశేష ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు.. 2014-15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలతో కలిపి మొత్తం రూ.22,948.76 కోట్లకు పెరిగిపోయింది. ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.4,117.89 కోట్లే ఇచ్చారు. మిగిలిన రూ.18,830.87 కోట్లను కూడా విడుదల చేయాలి. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని విభజన సంధర్భంలో ఆనాటి ప్రధాని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరుతో కొత్త విధానం ప్రవేశపెట్టింది. రిసోర్స్‌ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది.


- విద్యుత్‌ బకాయిల కింద పెండింగ్‌లో ఉన్న రూ.6,284 కోట్లను వెంటనే తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

- జాతీయ ఆహారభద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానంవల్ల.. అర్హత ఉన్న పేదలు లబ్ధిపొందలేకపోతున్నారు. దీంతో 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా నిత్యావసరాలను అందించాల్సి వస్తోంది. దీనివల్ల పెనుభారం పడుతోంది. దీని నుంచి విముక్తి కలిగించండి.


కరోనా వల్ల భారీగా అప్పులు..

రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతోంది. 2019-20లో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించింది. దీంతో కేంద్రం నుంచి రావలసిన పన్నుల ఆదాయం సుమారు 3.38 శాతం తగ్గింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల పరిస్థితి మరింత దుర్లభంగా మారింది. అన్ని వర్గాలవారూ తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫ కేంద్రం నుంచి మాకు పన్నుల రూపంలో రూ.34,833 కోట్లు రావలసి ఉండగా..  రూ.28,242 కోట్లు మాత్రమే ఇచ్చారు.


మా తప్పు లేకున్నా కోత..

రుణ పరపతి పొందడంపై కోత విధించడం సరికాదు. 2021-22లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం గరిష్ఠ రుణ పరపతి(నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌-ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత దీనిని కేంద్ర ఆర్ధిక శాఖ రూ.17,923.24 కోట్లకు తగ్గించింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణనలోకి తీసుకుని రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత వించడం సమంజసం కాదు. తీసుకుంటున్న రుణాలకు సకాలంలోనే చెల్లింపులు చేస్తున్నాం. ఈ వాస్తవాలన్నీ పరిగణనలోకి తీసుకుని రూ.42,472 కోట్ల అప్పులు తెచ్చుకోడానికి వెసులుబాటు కల్పించాలి.


కడప స్టీల్‌కు గనులివ్వండి..

కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌ సంస్థ నుంచి త్వరితగతిన  నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలి. 


జగన్‌ వెంట ఎంపీలు..

జగన్‌తోపాటు ప్రధాని నివాసానికి వెళ్లినవారిలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, తలారి రంగయ్య, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 1.25 గంటలకు వచ్చారు. 2.15 గంటలకు 1-జన్‌పథ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రధాని, కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Updated Date - 2022-01-04T07:59:40+05:30 IST