‘అధికార’ అరాచకం

ABN , First Publish Date - 2021-12-03T08:27:38+05:30 IST

‘అధికార’ అరాచకం

‘అధికార’ అరాచకం

కాంట్రాక్టు పనులకు పర్సెంటేజీ ఇవ్వలేదని దాడి

రాళ్లు, కర్రలతో దాడి.. వాహనాలు ఎత్తుకుపోయిన వైనం

కాంట్రాక్టర్‌ వచ్చి మాట్లాడాలంటూ బెదిరింపులు 

రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులకు అడ్డంకులు

కర్నూలులో వైసీపీ నేతల అనుచరుల దౌర్జన్యం 


మద్దికెర, డిసెంబరు 2: కర్నూలు జిల్లాలో అధికార పార్టీ నాయకుల అనుచరులు రెచ్చిపోయారు. కాంట్రాక్టు పనులకు పర్సెంటేజీ ఇవ్వనందుకు దౌర్జన్యానికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసి పనులు అడ్డుకున్నారు. వాహనం, యంత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మద్దికెర నుంచి డోన్‌, బేతంచర్ల వరకు రైల్వేస్టేషన్లలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను అనంతపురం జిల్లాకు చెందిన వీవీఆర్‌కే అసోసియేట్‌ కంపెనీ వారు రూ.19.50 కోట్లకు దక్కించుకున్నారు. మద్దికెర రైల్వేస్టేషన్‌లో వారం క్రితం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుల అనుచరులు మూడు రోజుల క్రితం అక్కడికి వచ్చారు. కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌తో మాట్లాడారు. ఈ ప్రాంతంలో పనులు చేయాలంటే ‘మాట్లాడుకోవాల్సిందే’ అని హెచ్చరించారు. పర్సెంటేజీ మాట్లాడుకోకుండా పనులు ఎలా చేస్తారని దబాయించారు. ఆ వ్యవహారాలు తమకు సంబంధం లేదని, కంపెనీ వారితో మాట్లాడుకోవాలని అక్కడున్నవారు చెప్పారు. ఆ తర్వాత పనులు కొనసాగించారు.


గురువారం మధ్యాహ్నం దాదాపు 10 మంది అనుచరులతో వచ్చిన కొందరు వ్యక్తులు మేనేజర్‌ నందకిశోర్‌, సూపర్‌ వైజర్‌ కృష్ణయ్య వద్దకు వెళ్లారు. పర్సెంటేజీ మాట్లాడేవరకూ పనులు చేయవద్దని బెదిరించారు. కాంట్రాక్టర్‌ ఇక్కడ లేరని, మీరే మాట్లాడుకోవాలని ఆ ఇద్దరు సమాధానం ఇచ్చారు. దీనికి ఆగ్రహించిన ఆ సదరు వ్యక్తులు మూకుమ్మడిగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారిని బెదిరించి తాళాలు తీసుకుని బొలెరో వాహనం, మిల్లర్‌ను ఎత్తుకుపోయారు. ‘మీ కాంట్రాక్టర్‌ను వచ్చి మాట్లాడుకుని వీటిని తీసుకెళ్లమనండి’ అని చెప్పి వెళ్లిపోయారు. ఈ దాడిలో నందకిశోర్‌, నందకుమార్‌, కృష్ణయ్య అనే ముగ్గురికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై వీవీఆర్‌కే కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ మద్దికెర ఎస్‌ఐ మమతకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, తమ వాహనాలు ఎత్తుకుపోయారని ఫిర్యాదు చేశారు. దుండగులు వచ్చిన వాహనం ఫొటోలు, వీడియోను పోలీసులకు అందజేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-03T08:27:38+05:30 IST