Advertisement
Advertisement
Abn logo
Advertisement

బతుకులు ఛిద్రం!

అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోవడంతో విలయం 

తీరప్రాంతంలోని గ్రామాల్లో ప్రజలకు తీరని నష్టం 

ఇళ్లు, పంట పొలాలను కబళించిన చెయ్యేరు వరద 

నగదు, నగలు, డాక్యుమెంట్లు సర్వం నీటి పాలు 

ఈ జన్మలో కోలుకోలేమని విలపిస్తున్న బాధితులు 

పొంచి ఉన్న వానగండంచిత్తూరు, నెల్లూరు, కడపకు 

భారీ వర్ష సూచన4 రోజులు విస్తారంగా వానలు

(కడప-ఆంధ్రజ్యోతి)


కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు వరద ఉధృతికి ఛిద్రమైన గ్రామాలు బోరుమంటున్నాయి. అక్కడి ప్రజల్లో ఎవరిని కదిపినా కన్నీరు ఏరులై ప్రవహిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోవడంతో పులపుత్తూరు, తోగూరుపల్లి, రామచంద్రాపురం, గండ్లూరు, మందపల్లె, పాటూరు గ్రామాలు ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. వారం క్రితం వరకూ పచ్చని పంటలతో కళకళలాడిన పొలాల్లో ఐదారడుగుల మేర ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికిరాకుండా పోయాయి. ఆ పల్లెల్లో మాత్రమే 950కి పైగా పాడి పశువులు వరద ప్రవాహ వేగానికి చెయ్యేరులో కొట్టుకుపోయాయి. పలు ఆవులు, గేదెలు ఉన్నచోటే మృతిచెందాయి. వెయ్యికి పైగా గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఈ నెల 19న శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారు జామునే నిద్ర లేచిన జనం ఇళ్ల ముందు కల్లాపు చల్లుతూ.. సామగ్రి శుభ్రంచేసే పనుల్లో నిమగ్నయ్యారు. అప్పటికే నదిలో 2.65- 3.25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది.


గ్రామం అంచుల దాకా వచ్చిన వరద ఉధృతిని కొందరు గమనిస్తూనే ఉన్నారు. సుమారు 6గంటల సమయంలో గ్రామ సమీపంలో రెండు కొండల మధ్య నుంచి ప్రవహించే చెయ్యేరు ఉప్పెనలా విరుచుకుపడింది. వరద ప్రవాహం క్షణాల్లో పులపుత్తూరు, తోగూరుపేట, మం దపల్లి గ్రామాలను కప్పేసింది. అప్పటికే జనం ఎత్తయిన గుట్టలపైకి,  దాసాలమ్మ గుడిపైకి పరుగులు తీయడంతో ప్రాణనష్టం భారీగా తగ్గింది. ఏ మాత్రం నిర్ల క్ష్యం చేసినా ఊహించడానికి కూడా భయమేస్తుందోని పులపుత్తూరు సర్పంచి జగన్మోహన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతికి’ వివరించారు. 


ఊరు వల్లకాడు అయ్యేది 

ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉందని, అందరూ కొండపైకి వెళ్లిపోవాలని అన్నమయ్య ప్రాజెక్టు వద్దే నివాసముండే రిటైర్డ్‌ వాచ్‌మన్‌ రామయ్య ముందురోజు రాత్రే అప్రమత్తం చేయకపోయి ఉం టే.. మా ఊరు వల్లకాడు అయ్యేదని తోగూరుపేటకు చెందిన జొన్న శివరామయ్య గ ుర్తు చేసుకున్నారు. ఈ గ్రామంలో 75 ఇళ్లు ఇసుక దిబ్బలుగా మారాయి. ‘‘అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయి ఊళ్లు, పొలాలతో పాటు మా బతుకులనూ ఛిద్రం చేసింది. ఇళ్లలోని నగలు, నగదు, భూములు, ఆస్తులకు చెందిన డాక్యుమెంట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కూల ర్లు, ఇతర సామగ్రి, ద్విచక్ర వాహనాలు, ఆటో లు, కార్లు, పిల్లల చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు.. ఇలా సర్వం వరదకు కొట్టుకుపోయాయి. మేం మళ్లీ కోలుకుని సాధారణ స్థితికి రావాలంటే ఈ జన్మ చాలదని ఆ గ్రామాల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ బృందం ముందు బాధితులు తమ గోడు వినిపించారు.


రూ.50 లక్షలకు పైగానే నష్టపోయా 

చెయ్యేరుకు వరద పోటెత్తి మా ఊరు సర్వనాశనం అయింది. ఆ రోజు ఇంట్లో ఆరుగురు ఉన్నాం. వరద సమాచారంతో పిల్లాపాపలతో దాసాలమ్మ గుడికి చేరుకున్నాం. ఆ గుడి ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఇంట్లోనుంచి ఒక్క వస్తువు కూడా వెంట తీసుకెళ్లలేదు. నాలుగైదు రోజుల క్రితమే కోత కోసి ఇంట్లో నిట్టు కట్టిన 100 బస్తాల వరి ధాన్యం, 50 ఆవులు, ఇంట్లో సామగ్రి సర్వం వరదకు కొట్టుకుపోయాయి. ఇల్లు కూలిపోయి ఇసుక దిబ్బగా మారింది. రూ.50 లక్షలకు పైగానే నష్టపోయాను. ప్రభుత్వమే ఆదుకోవాలి. 

                                                                          - వెంకట ప్రసాద్‌, తోగూరుపేట


వరదొచ్చి ఊడ్చుకెళ్లింది

తెల్లవారి ఇంటి పనుల్లో నిమగ్నం అయ్యాం. ఇంతలో చెయ్యేరు వరద ఊళ్లోకి వచ్చింది. సామాన్లు సర్దుకునేలోగానే ముంచేసింది. మిద్దె ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం. నాలుగు తులాల బంగారు నగలు, రిఫ్రిజిరేటర్‌, టీవీ, సామగ్రి సర్వం వరద ఊడ్చుకెళ్లింది. కుట్టబట్టలతో రోడ్డున పడ్డాం. 

                                                                   - చంద్రకళావతి, గుండ్లూర గ్రామం,

                                                                            రాజంపేట మండలం

ఎలా బతికేదయ్యా?

నది ఒడ్డునే మా ఇల్లు ఉంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో ఇల్లంతా శుభ్రం చేస్తున్నాం. అప్పటికే వరద గ్రామ అంచుల్లోకి వచ్చింది. ఎందుకో అనుమానం వచ్చి ఏరుపైకి చూస్తే పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాలు కనిపించలేదు. వెంటనే అందరం మిద్దెక్కాం. ప్రాణాలైతే కాపాడుకున్నాం. పొలమంతా రాళ్లు, ఇసుక కుప్పగా మారింది. నాలుగు ఆవులు, ఐదు దూడలు, ఇంట్లో కూలర్‌, టీవీ, ఇతర సామాన్లు కొట్టుకుపోయాయి. రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగింది. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు. 

                                                             - మర్రి సుబ్బరాయుడు, మందపల్లి గ్రామం, 

రామయ్య ఫోన్‌ చేయకపోతే... 

నేను రాజంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. గురువారం రాత్రి డ్యూటీలో భాగంగా శ్రీశైలం వెళ్లాను. రాత్రి 11.30గంటలకు అన్నమయ్య డ్యాం దగ్గరే నివాసం ఉంటున్న మా ఊరికి చెందిన ఆ ప్రాజెక్టు రిటైర్డ్‌ వాచ్‌మన్‌ రామయ్య నాకు ఫోన్‌ చేసి.. డ్యాం ఏ క్షణంలోనైనా తెగిపోయే ప్రమాదం ఉంది. ఊళ్లో అందరినీ కొండపైకి వెళ్లమని చెప్పాడు. వెంటనే ఊళ్లో ఉన్న బంధువులకు ఫోన్‌ చేసి అప్రమత్తం చేశాను. యువకులు ఇంటింటికీ వెళ్లి అందరినీ దాసాలమ్మ గుడిపైకి తీసుకెళ్లారు. రామయ్య ఫోన్‌ చేయకపోయి ఉంటే.. మా ఊరు వల్లకాడు అయ్యేది. ఆయనే మా ఊరిని కాపాడి దేవుడయ్యాడు. 


                                                                            - వెంకటరమణ, ఆర్టీసీ డ్రైవర్‌,

                                                                                    తోగూరుపేట గ్రామం

Advertisement
Advertisement