Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాదయాత్రకు పాలాభిషేకం

నెల్లూరు జిల్లాలో విశేష స్పందన

గ్రామగ్రామానా హారతులు.. ఘన స్వాగతాలు 

అమరావతి రైతుల పాదాలు కడిగిన ప్రజలు

న్యాయవాద, దళిత సంఘాల సంఘీభావం


నెల్లూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. గ్రామగ్రామన రైతులకు ఘన స్వాగతం లభిస్తోంది. గ్రామ పొలిమేరల్లో మహిళలు పూల ముగ్గులు వేసి రైతులపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. హారతులు పడుతూ, దిష్టి తీస్తూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర 24వ రోజు బుధవారం నెల్లూరు జిల్లాలోని దగదర్తి, కొడవలూరు మండలాల్లో సాగింది. ఉదయం పూజలు చేసిన అనంతరం దగదర్తి మండలం సున్నపుబట్టీ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కొడవలూరు మండలం రాచర్లపాడు, రేగడిచెలిక, కమ్మపాలెం, నార్తురాజుపాలెం వరకు మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర సాగింది. కమ్మపాలెం వద్ద మధ్యాహ్నం భోజనం చేసి యాత్ర మొదలెట్టారు. పాదయాత్రకు ముందుగా స్థానిక ప్రజలు అమరావతి రైతుల కాళ్లను పాలతో కడిగారు.


రాష్ట్రం కోసం రైతులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడుతూ తమ సంఘీభావం ప్రకటించారు. జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దే తిరుపతిరావు, కొలికపూడి శ్రీనివాసరావు, రాయపాటి శైలజలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాదయాత్రను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రైతులతో కలిసి నడుస్తూ తన సంఘీభావాన్ని తెలిపారు. కావలి నియోజకవర్గం నుంచి కోవూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినే్‌షరెడ్డిల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది.


రైతుల త్యాగాలను తెలిపేలా 

తప్పెట్లు, మేళతాళాలు, కోలాటాలు.. ఇలా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. పాదయాత్ర సాగింది. ప్రతి గ్రామం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. బుధవారం యాత్రలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, దళిత సంఘాలు, న్యాయవాదుల సంఘాలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల పోలీసులు రైతులను అడ్డుకుంటూ వచ్చారు. ప్రజలు అమరావతి రైతులకు తమ స్థాయిని బట్టి విరాళాలు అందించారు.  గురువారం పాదయాత్రకు విరామమిచ్చారు.


చరిత్రలో నిలిచిపోతుంది

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు సంఘీభావంగా కొద్ది దూరం పాటు రైతులతో కలిసి నడిచారు. పాదయాత్ర ముగింపు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  నాడు స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం మాదిరిగా రాష్ట్రం కోసం అమరావతి రైతులు చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని భగవంతుడు కూడా క్షమించడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపదైన అమరావతిని నాశనం చేసే హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

Advertisement
Advertisement