జనం ఆకలి తీర్చండి

ABN , First Publish Date - 2021-11-17T09:23:40+05:30 IST

ఆకలితో మరణిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం సంక్షేమ రాజ్యం ప్రథమ బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు..

జనం ఆకలి తీర్చండి

జాతీయ విధానం రూపొందించండి

న్యూఢిల్లీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆకలితో మరణిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం సంక్షేమ రాజ్యం ప్రథమ బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ‘ప్రజల ఆకలి తీరుస్తామంటే ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ కాదనలేదు. రాష్ట్రాలతో చర్చించి ప్రజల ఆకలి తీర్చేందుకు కమ్యూనిటీ కిచెన్‌(సామూహిక వంటశాలల)పై జాతీయ స్థాయి విధానాన్ని 3 వారాల్లో ఖరారు చేయండి. ఇదే మీకు చివరి అవకాశం’ అని కేంద్రాన్ని ఆదేశించారు. దేశంలో ఆకలి చావులను నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ అనున్‌ ధావన్‌ తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై మంగళవారం జస్టిస్‌ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కమ్యూనిటీ కిచెన్‌ల విషయంలో తాము అక్టోబరు 27న ఆదేశించినప్పటికీ, కేంద్రం సరైన విధానాన్ని అఫిడవిట్‌లో స్పష్టం చేయకపోవడం పట్ల జస్టిస్‌ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ అండర్‌ సెక్రటరీ ద్వారా అఫిడవిట్‌ దాఖలు చేయించడమేమిటి? కార్యదర్శి ద్వారా దాఖలు చేయించలేరా? కేంద్ర ప్రభుత్వానికి ఇదే మా చివరి హెచ్చరిక. మేం ఎన్నిసార్లు చెప్పాలి’ అని జస్టిస్‌ రమణ ఆగ్రహించే సరికి అప్పటి వరకూ మరో కేసు విచారణలో ఉన్న అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వీడియో ముందుకు వచ్చారు. ‘మిస్టర్‌ ఏజీ.. మీరే చెప్పండి మేం ఏం చేయాలో? మీ అండర్‌ సెక్రటరీ అఫిడవిట్‌ వేశారు’ అని జస్టిస్‌ రమణ అన్నారు. దీంతో కేంద్రం ఒక నిర్దిషమైన పథకంతో ముందుకు వస్తుందని, జాతీయ భద్రతా చట్టం పరిధిలో ఒక  విధానాన్ని రూపొందిస్తామని ఏజీ చెప్పారు.

Updated Date - 2021-11-17T09:23:40+05:30 IST