Advertisement
Advertisement
Abn logo
Advertisement

బతికుండగా దక్కని పట్టా పుస్తకం!

తహసీల్దార్‌ టేబుల్‌పై తల్లి మృతదేహం

పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

నిరసనకు దిగిన ముగ్గురు కుమార్తెలు


బత్తలపల్లి, అక్టోబరు 26: రెవెన్యూ సిబ్బంది కాసుల కక్కుర్తికి ఓ వృద్ధురాలు బలైపోయింది. పట్టాదారు పాసుపుస్తకం కోసం ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి... అడిగినంత లంచం ఇచ్చుకోలేక ఊపిరి వదిలింది. దీంతో కోపం పట్టలేని కుమార్తెలు, బంధువులు ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తహసీల్దార్‌ టేబుల్‌పైన పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం... అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన పెద్దన్న 50 ఏళ్లగా సర్వే నెంబర్‌ 18డీలో  5.18 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నారు. ఆయన 2015లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆ భూమిని తన పేరు మీద మార్చి, పాసు పుస్తకాలు ఇప్పించేందుకు పెద్దన్న భార్య లక్ష్మీదేవి (63) ప్రయత్నిస్తూనే ఉంది. గత రెండు మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం, వీఆర్వో నాగేంద్ర చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగింది. ‘నీ భర్త తమ్ముడిని తీసుకురా. దీంతోపాటు 3 లక్షలు ఇస్తేనే పాసు పుస్తకాలు నీ పేరుమీద చేయిస్తా’ అని తేల్చి చెప్పారు.. తాను కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాననీ, అంత డబ్బు ఇచ్చుకోలేనని వీఆర్వోను ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో లక్ష్మీదేవి తీవ్ర ఆవేదనతో అనారోగ్యం పాలైంది. తాము కూడా వీఆర్వో నాగేంద్ర వద్దకు వెళ్లి రూ.3 లక్షలు ఇచ్చుకోలేమనీ, రూ.30-40వేల దాకా ఇస్తామని వేడుకున్నా కనికరించలేదని లక్ష్మీదేవమ్మ కుమార్తెలు లింగమ్మ, నాగేంద్రమ్మ, రత్నమ్మ వాపోయారు. తమ తండ్రి పేరుమీదున్న పాసుపుస్తకాన్ని వీఆర్వో నాగేంద్ర తీసుకుని,  చిన్నాన్న ఫొటో అతికించి... వారిపేరు మీద పాసుపుస్తకం ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం లక్ష్మీదేవమ్మ మృతిచెందింది. దీంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన కుమార్తెలు, బంధువులు.. బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లారు. తహసీల్దార్‌ టేబుల్‌పై మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. ముగ్గురు కుమార్తెలు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. దీంతో కార్యాలయంలోని వీఆర్‌ఏలు, సిబ్బంది భయపడి బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీహర్ష తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement