చిత్తూరు జిల్లాలో భారీ భూస్కాం!

ABN , First Publish Date - 2021-10-04T07:46:15+05:30 IST

చిత్తూరు జిల్లాలో భారీ భూస్కాం!

చిత్తూరు జిల్లాలో భారీ భూస్కాం!

2,320 ఎకరాల ప్రభుత్వ భూమికి హక్కు పత్రాలు

నకిలీ డాక్యుమెంట్లతో సృష్టించిన ఓ కుటుంబం

నిందితుడు గణేశ్‌ పిళ్లై మాజీ కరణం

వీఏవో, వీఆర్వోగా పనిచేసి 2010లో పదవీ విరమణ

కుమార్తెలు, కొడుకుల సాయంతో నకిలీ వీలునామా, డాక్యుమెంట్ల సృష్టి

గత ఏడాది 160 ఎకరాలకు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు

కానీ ఆ నంబరులో ఉన్నది 45 ఎకరాలే

అనుమానంతో తహసీల్దారు విచారణ 

మోసం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు 

తండ్రి, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురి అరెస్టు

40 నకిలీ పత్రాల స్వాధీనం: డీఎస్పీ


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 3: చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలతో 13 మండలాల్లో 2,320 ఎకరాల ప్రభుత్వ భూమికి ఓ కుటుంబం హక్కు పత్రాలను సృష్టించిన వైనం బయటపడింది. ఇందులో తొమ్మిది మండలాల్లోని 1,577 ఎకరాలను వ్యక్తిగత ఆస్తులుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించడం గమనార్హం. ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆదివారమిక్కడి సీఐడీ తిరుపతి సీఐడీ కార్యాలయంలో డీఎస్పీ రవికుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి వరకు చదువుకున్న యాదమరి మండలం 184 గొల్లపల్లి గ్రామ నివాసి మోహన్‌ గణేశ్‌ పిళ్లై (71) గొల్లపల్లి గ్రామ కరణంగా పనిచేశాడు. 1984లో ఆ వ్యవస్థ రద్దవడంతో ఉద్యోగం కోల్పోయాడు. 1992లో వీఏవోగా ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత పదోన్నతిపై గొల్లపల్లి వీఆర్వోగా పనిచేస్తూ 2010లో పదవీవిరమణ చేశాడు. రెవెన్యూ అంశాలపై పిళ్లైకే కాకుండా ఆయన నలుగురు పిల్లలు కోమల, ధరణి, మధుసూదన్‌, నటరాజన్‌ అలియాస్‌ రాజన్‌కు కూడా పూర్తి పరిజ్ఞానముంది. వీరంతా కలసి జిల్లాలోని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. పిళ్లై తల్లి అమృతవల్లెమ్మ తన యావదాస్తిని తన మరణానంతరం తన ఇద్దరు మనవరాళ్లు, ఇద్దరు మనవళ్లకు చెందేటట్లు 1985 ఆగస్టు 16వ తేదీన వీలునామా రాసినట్లుగా నకిలీ వీలునామా సృష్టించారు. తన తల్లి మరణానంతరం 1985లో బంగాపాళ్యం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీనిని రిజిస్టర్‌ చేయించారు. అలాగే తన తండ్రి శ్రీనివాస పిళ్లైకు వారసత్వంగా సంక్రమించిన భూములపై తన హక్కులు వదులుకుని తన తల్లి అమృతవల్లెమ్మ పేరిట బదిలీ చేస్తున్నట్లుగా కుమారుడు మధుసూదన్‌ సాయంతో తప్పుడు హక్కు పత్రాన్ని కూడా తయారు చేయించాడు. అందులో జిల్లాలోని 13 మండలాల్లోని 18 గ్రామాల్లో, 93 సర్వే నంబర్లలోని 2,320 ఎకరాల భూమిపై తన తండ్రికి ఉన్న హక్కును తన తల్లికి బదలాయిస్తున్నట్లు రాయించాడు. నకిలీ హక్కు పత్రాన్ని అసలైనదిగా నమ్మించేందుకు.. జమీందారు భూములు మంజూరు చేసినట్లుగా ఖాళీ పట్టాఫారాలను సేకరించి.. వాటిలో తమ పూర్వీకుల పేర్లు రాయించి, వారి ద్వారా తమకు పూర్తి హక్కులు సంక్రమించినట్లు నకిలీ పట్టాలు తయారు చేయించారు. ఆయా మండల కార్యాలయాల్లో ఖాళీ భూమిశిస్తు రశీదులను సేకరించి పన్ను చెల్లించినట్లు ఆధారాలు కూడా సృష్టించారు. 


వెలుగు చూసిందిలా.. 

సోమల మండలం పెద్దఉప్పరపల్లె గ్రామ సర్వే నంబరు 459 లోని 160.09 ఎకరాల భూమికి సంబంధించిన 1-బి అడంగళ్లను చూపించి పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇవ్వాలని అక్కడి తహశీల్దారుకు పిళ్లై గతేడాది అర్జీ పెట్టాడు. నిజానికి ఆ సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తం 45.42 ఎకరాలు మాత్రమే. కానీ 160 ఎకరాలకు దరఖాస్తు చేయడంతో తహశీల్దారుకు అనుమానం వచ్చింది. దీనిపై విచారణ జరిపించడంతో వీరి మోసం బయటపడింది. దీనిపై నిరుడు మే 29వ తేదీన సోమల పోలీసులకు తహశీల్దారు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసును సీఐడీ పోలీసులకు బదిలీ చేయడంతో తిరుపతి సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ కేసును దర్యాప్తు చేశారు. గతంలో పెద్దపంజాణి మండలం బొమ్మరాజుపల్లి, ముత్తుకూరు గ్రామాలకు సంబంధించిన అటవీ భూములకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందే క్రమంలో 2017లో అప్పటి పెద్దపంజాణి తహశీల్దారు శ్రీదేవిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ అంశంలోనూ పిళ్లై పేరు వినిపించింది. దీంతో ఆయన, ఆయన పిల్లల పేర్లపై జిల్లాలో మరెక్కడైనా భూములు ఉన్నాయా అనే కోణంలో సీఐడీ పోలీసులు కూపీలాగారు. ఈ క్రమంలో 2,320 ఎకరాల భూముల విషయం వెలుగుచూసింది. దీంతో నిందితులు మోహన్‌ గణేశ్‌ పిళ్లైని, ఆయన కుమార్తె కోమలి, కుమారులు మధుసూదన్‌, నటరాజన్‌ అలియాస్‌ రాజన్‌ను శనివారం గొల్లపల్లిలో.. మరో నిందితుడు అడవి రమణను మదనపల్లెలో అరెస్టు చేశారు. పిళ్లై మరో కుమార్తె ధరణి పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భూకుంభకోణం  కోసం సృష్టించిన 40 నకిలీ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 


1577 ఎకరాలకు ఆన్‌లైన్‌ 

2005-10 మధ్యకాలంలో గ్రామ అడంగళ్లను కంప్యూటరీకరించే క్రమంలో చిత్తూరు కలెక్టరేట్‌లో ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎంఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో భూముల వివరాలను నమోదుచేస్తున్న సమయంలో గణేశ్‌ పిళ్లై తన నలుగురు పిల్లల పేరున ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేశాడు. 2009 జూలై ఒకటో తేదీన తొమ్మిది మండలాల్లోని 57 సర్వే నంబర్లకు చెందిన 1,577 ఎకరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాడు. మీసేవ కేంద్రాల ద్వారా ఆయా భూములకు అడంగల్‌, 1-బి ఫారాలను పొందాడు. ఆ తర్వాత తనకు పరిచయస్తుడైన చౌడేపల్లె మండలం చారాలవాసి కె.రమణ అలియాస్‌ అడవి రమణతో కుమ్మక్కై ఆయా భూములను తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు చెప్పి.. విక్రయ అగ్రిమెంట్లు రాసి కొనుగోలుదారుల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు తీసుకుని మోసగించాడు. శ్రీకాళహస్తికి చెందిన నాగమోహన్‌రెడ్డికి భూములను విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్‌రాసి రూ.55.60 లక్షలు తీసుకున్నారు. 



Updated Date - 2021-10-04T07:46:15+05:30 IST