అమెరికాలో విశాఖ యువకుడి కాల్చివేత
ABN , First Publish Date - 2022-02-13T08:39:04+05:30 IST
అమెరికాలో విశాఖ యువకుడి కాల్చివేత
విశాఖపట్నం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని పాతబర్మింగ్‌హోమ్‌లో విశాఖ జిల్లాకు చెందిన యువకుడిపై దోపిడీ దొంగ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాల మేరకు విశాఖకు చెందిన చిట్టూరి శ్రీసత్యకృష్ణ(27) ఉన్నత విద్య కోసం నెలరోజుల కిందట అమెరికా వెళ్లాడు. అలబామాలోని పాతబర్మింగ్‌హామ్ హైవేలో ఉన్న క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్ ్కగా పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరాడు. గత గురువారం ఉదయం విధుల్లో ఉండగా నల్లటి చొక్కా ధరించిన ఆరు అడుగుల వ్యక్తి తుపాకీతో స్టోర్‌లోకి చొరబడి.. దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో విధుల్లో ఉన్న సత్యకృష్ణపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో సత్యకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకుడి ఫొటోలను అమెరికా పోలీసులు విడుదల చేశారు. సత్యకృష్ణకు ఏడాది కిందటే వివాహం జరిగింది. ఆయన భార్య ప్రస్తుతం నిండు గర్భవతి. ఇదిలావుంటే, విషయం తెలిసిన తెలుగు సంఘాల నేత ఒకరు.. సత్యకృష్ణ మృత దేహాన్ని స్వదేశం పంపించేందుకు విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 94 వేల డాలర్లు సేకరించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.