పారదర్శకంగా పౌర సేవలు

ABN , First Publish Date - 2022-01-28T09:35:12+05:30 IST

పారదర్శకంగా పౌర సేవలు

పారదర్శకంగా పౌర సేవలు

ఏపీ సేవ పోర్టల్‌ ప్రారంభం 

దీనితో వేగం, బాధ్యత పెరుగుతుంది

లంచాలకు చెల్లు.. అడిగితే ఫిర్యాదు 

అందుబాటులోకి 122 రకాల సేవలు

ఉగాదికి ‘సచివాలయ’ సిబ్బందికి యూనిఫాం

ప్రకటించినట్టుగా రెగ్యులరైజ్‌ ప్రక్రియ: జగన్‌ 


అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పౌర సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల పోర్టల్‌ను ప్రారంభించింది. గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఏపీ సేవ పోర్టల్‌గా పిలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రజలు తామిచ్చిన అర్జీ ఎక్కడుంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాలను నేరుగా తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌తో వీలవుతుందన్నారు. దరఖాస్తుదారుడితో పాటు సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలను తెలుసుకోవచ్చన్నారు. దీనివల్ల వేగం, బాధ్యత పెరుగుతుందని చెప్పారు. ‘‘ఈ సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల, మున్సిపాల్టీ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయం వరకు ఉన్నతాధికారులంతా ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా పనిచేస్తారు. ఈ పోర్టల్‌ వల్ల ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా లంచాలు అడిగితే దానిపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం పోర్టల్‌లో కల్పిస్తాం. ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే రశీదు వస్తుంది. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఫీజులు చెల్లించాల్సి ఉంటే ఈ పోర్టల్‌ సాయంతో చెల్లించవచ్చు. యూపీఐ, క్యూఆర్‌కోడ్‌ స్కానింగ్‌, క్యాష్‌ పేమెంట్‌ ద్వారా కానీ ఆన్‌లైన్‌లో కానీ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈ పోర్టల్‌లోకి రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన 35 రకాల సేవలు, మున్సిపాల్టీలకు చెందిన 25 సేవలు, పౌరసరఫరాల శాఖకు చెందిన 6 సేవలు, విద్యుత్‌ రంగానికి చెందిన 53 సేవలు, గ్రామీణాభివృద్ధికి చెందిన 3 సేవలను కూడా తెచ్చాం. ఈ పోర్టల్‌ కింద సమీపంలోని సచివాలయం నుంచే కాకుండా ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని జగన్‌ పేర్కొన్నారు.  


ఉత్తమ వలంటీర్లకు ప్రోత్సాహకాలు

పోర్టల్‌ ప్రారంభించిన అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆధార్‌ సేవలు అందించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలన్నారు. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను ఉగాది సందర్భంగా సత్కరించి, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ యూనిఫాం ఇవ్వాలని ఆదేశించారు. ఇదివరకే ప్రకటించినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తికావాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T09:35:12+05:30 IST