చిరు వచ్చింది భోజనానికేనా?

ABN , First Publish Date - 2022-01-23T08:59:06+05:30 IST

చిరు వచ్చింది భోజనానికేనా?

చిరు వచ్చింది భోజనానికేనా?

సీఎంతో కుశల ప్రశ్నలకే పరిమితమా?

సినిమా టికెట్ల వివాదంపై చర్చించలేదా?

చిరును చులకన చేసేలా పేర్నినాని వ్యాఖ్యలు

అప్పుడు ‘త్వరలోనే శుభవార్త’ అన్న చిరంజీవి

సమస్యలపై సీఎం స్పందించారని వెల్లడి


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మెగాస్టార్‌ చిరంజీవి ఈనెల 13న ముఖ్యమంత్రి జగన్‌ నివాసానికి ఎందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారు?

సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించానని చిరంజీవి అప్పుడే చెప్పారు. ‘రాజ్యసభ సభ్యత్వం కోసమే’ అని అధికార పార్టీ అనుకూల పత్రిక ఒకటి చెప్పింది. కానీ, దీనిని చిరంజీవి అప్పటికప్పుడే కొట్టివేశారు. ఇవేవీ కావు, ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో భోజనం చేసేందుకు మాత్రమే చిరంజీవి వచ్చారు... అని ఇప్పుడు మంత్రి పేర్ని నాని చెప్పారు.


అవునా... జగన్‌ ఇంట్లో భోజనం చేసేందుకు హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో అమరావతికి వచ్చారా? సీఎం ఆహ్వానాన్ని మన్నించి విందుకు రావచ్చు. కానీ... సినీ పరిశ్రమ అంశాలపై చర్చించానని ఆ రోజు చెప్పారు కదా! చిరంజీవి చెప్పింది నిజమైతే.. మంత్రి అబద్ధం చెప్పారా? ఇవీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్న ప్రశ్నలు. శుక్రవారం కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంతో చిరంజీవి భేటీ గురించి ప్రస్తావించినప్పుడు.. ‘‘జగన్‌ నివాసానికి చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సినిమా టికెట్లపై సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయికానీ, ఇం ట్లో జరుగుతాయా? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా?’’ అని పేర్ని ప్రశ్నించారు. వెరసి... చిరంజీవి పర్యటనకు ప్రాధాన్యం లేదని, భోజనం చేసేందుకే వచ్చారని తేల్చేశారు.


చిరంజీవి ఏం చెప్పారంటే.. 

ఈనెల 13న జగన్‌ను కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘టికెట్ల ధరల సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో నన్ను రమ్మని సీఎం ఆహ్వానించారు. పండగ పూట ఈ సమావేశం సంతృప్తిగా సాగింది. నన్ను ఒక సోదరుడిలా ఆహ్వానించారు. జగన్‌ సతీమణి భారతి స్వ యంగా వడ్డించారు. ఇద్దరూ ఒక కుటుంబ సభ్యుడిలా మర్యాదలు చేశారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. నేను చెప్పిన అన్ని సమస్యలను జగన్‌ సానుకూలంగా విన్నారు. రాసుకున్నారు. ఒకరి పక్షాన గాక అందరి వైపు ఉంటానని, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. టికెట్‌ ధరల జీవోపై పునరాలోచన చేస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు వివరించాను. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చింది. సినీ పరిశ్రమవారు ఎవ రూ అభద్రతాభావానికి లోనుకావద్దు. రెండు, మూడు వారా ల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుంది. నిర్ణయం తీసుకునేలోగా మరోసారి కలసి మాట్లాడుదామని జగన్‌ చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసేముందు మళ్లీ ఆహ్వానిస్తానన్నారు’’ అని చెప్పారు. మంత్రేమో... ఆ భేటీలో సినిమా టికెట్లపై చర్చ జరగనే లేదని, చిరంజీవి భోజనం చేసి... కుశల ప్రశ్నలు వేసుకుని వెళ్లిపోయారని అంటున్నారు!

Updated Date - 2022-01-23T08:59:06+05:30 IST