‘అడవి’ వైద్యం.. అష్టదిగ్బంధం

ABN , First Publish Date - 2021-10-18T07:44:47+05:30 IST

అడవి దారులు మూసుకుపోతున్నాయి. ఆపరేషన్‌ ప్రహార్‌ నిర్బంధంతో ప్రాణాధార మందులను అందించిన పట్టణాలు ఇప్పుడు దూరమవుతున్నాయి.

‘అడవి’ వైద్యం.. అష్టదిగ్బంధం

అనారోగ్యానికి మావోయిస్టు  అగ్రనేతల బలి

15 ఏళ్లలో 12 మంది కేంద్ర కమిటీ సభ్యులు

మరో 8 మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు

ఆపరేషన్‌ ప్రహార్‌తో పట్టణాలతో తెగిన లింకులు

చికిత్స కోసం బయటకు రాలేని పరిస్థితి


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అడవి దారులు మూసుకుపోతున్నాయి. ఆపరేషన్‌ ప్రహార్‌ నిర్బంధంతో ప్రాణాధార మందులను అందించిన పట్టణాలు ఇప్పుడు దూరమవుతున్నాయి. వయోభారంతో వచ్చిపడుతు న్న అనారోగ్యానికి తోడు సరికొత్త వైరస్‌ దాడులను చాలీచాలని మందులు అడ్డుకోలేకపోతున్నాయి. సాయుధ బలగాలకు సవాల్‌ విసురుతున్న మావోయిస్టులు.. అనారోగ్య సమస్యలకు తట్టుకోలేకపోతున్నారు. సొంతంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు కానీ.. అనారోగ్యం నుంచి కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ధంలో వీరమరణం పొందాలనుకుంటున్న వారు జబ్బుల బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. మావోయిస్టులకు తగినన్ని వైద్య వనరులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి బల్క్‌గా మందులు తెప్పిస్తున్నా... కూంబింగ్‌లో భాగంగా భద్రతా బలగాలు వాటిని పట్టుకుంటున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో మొబైల్‌ క్లినిక్‌లు నడుస్తున్నా.. అందులో జ్వరం, ఒంటినొప్పులు, గాయాలకు వేసే మందు సూదులు, బ్యాండేజ్‌లు వంటివి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.


మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, కేన్సర్‌, శ్వాసకోశ సంబంధ సమస్యలు, మోకాళ్లనొప్పులు, ఇతర జబ్బులకు అవసరమైన మందులను బయటనుంచే తెప్పించుకోవాల్సిందే. ఇప్పుడు ఆపరేషన్‌ ప్రహార్‌ పేరిట నిర్భంధం పెరగడంతో బయటి ప్రాంతాల నుంచి మందులు తెప్పించుకోవడం క్లిష్టతరంగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మిలటరీ కమిషన్‌ (సీఎంసీ) సెప్టెంబరు 24న ఓ నివేదిక విడుదల చేసింది. గడిచిన 15 ఏళ్లలో మరణించిన 16 మంది కేంద్ర కమిటీ సభ్యుల వివరాలను ప్రకటించింది. అందులో 11 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతోనే మరణించారని సీఎంసీ వెల్లడించింది. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ, ఆపైన పొలిట్‌బ్యూరోలు టాప్‌ విభాగాలు. అందులో సభ్యులుగా ఉన్న అగ్రనేతలే తీవ్రఅనోరాగ్యంతో మరణించడం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా ఆర్కేతో కలిపి ఈ సంఖ్య 12కు చేరింది. మరణించిన కేంద్ర కమిటీ సభ్యులు (సీసీఎమ్‌)ల పేర్లను అధికారికంగా వెల్లడించారు. మరో 8మంది సీసీఎమ్‌లు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇక అనారోగ్యంతో ఇటీవలి కాలంలో రాష్ట్ర, జోనల్‌ కమిటీల స్థాయిలో 18 మంది మరణించినట్లు పార్టీ నివేదికల్లోనే పేర్కొంది. 


ఎందుకీ పరిస్థితి..? 

దండకారణ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, బెంగాల్‌, తమిళనాడు, కేరళ అడవులు ఎక్కడైనా.. సెరిబ్రల్‌ మలేరియా అంటే హడలెత్తిపోవాల్సిందే. మలేరియాకు మందులు ఉన్నా... వాటిని సమయానుగుణంగా తీసుకోవడం, ఆ క్రమంలో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించడం కీలకం. కేంద్ర కమిటీ స్థాయికి వచ్చేనాటికే ముఖ్యనేతల వయసు 50 ఏళ్లు దాటుతుంది. అప్పటికే వారికి తీవ్రమైన మోకాళ్లనొప్పులకు తోడు మధుమేహం, రక్తపోటు, ఆస్తమా సమస్యలతో బాధపడుతుంటారు. 2009 నుంచి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరిట కేంద్రం మావోయిస్టులపై నిర్భంధం ప్రయోగిస్తోంది. లక్షలాది మంది సాయుధ బలగాలను అడవులకు పంపించి నక్సల్స్‌ ఏరివేత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు అనారోగ్య సమస్యలు వస్తే బయటకు వెళ్లి చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దండకారణ్యం నుంచి ఏవోబీకి వచ్చి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లే పరిస్థితి కొంతకాలం నడిచింది. అయితే, ఇప్పుడు ఏవోబీ పరిధిలోనూ జాయింట్‌ కమాండ్‌ పేరిట కూంబింగ్‌ ఆపరేషన్‌ సాగుతోంది. ఫలితంగా వైద్యం పేరిట ఏ నేత కూడా అడవిదాటి వచ్చే పరిస్థితి లేదు. కరోనా కాలంలో కొందరు నేతలు చికిత్సకోసం బయటకు వచ్చి ఎన్‌కౌంటర్లలో మరణించారు. 


సంబంధాలు కట్‌ 

పట్టణాల నుంచి అడవులకు ఎలాంటి కమ్యూనికేషన్‌, లాజిస్టిక్‌ సపోర్టు ఉండకూడదన్న లక్ష్యంతో జాతీయ దర్యాప్తు సంస్థ, పోలీసులు పెద్ద ఎత్తున వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో గత రెండున్నరేళ్లుగా పట్టణ ప్రాంతాల నుంచి అడవులకు వెళ్లే మెడికల్‌ లాజిస్టిక్స్‌ బాగా తగ్గిపోయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఏఓబీ మార్గంలో దండకారణ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా భద్రతా బలగాలు వాటిని పట్టుకుంటున్నాయని పేర్కొన్నాయి. పట్టణ పారంతాల్లో ప్రజా సంఘాలు, అర్బన్‌ యూనిట్లపై కూడా నిర్భంధం పెరిగింది. దీంతో మావోయిస్టులు అత్యధిక సందర్భాల్లో అదివాసీ ప్రాంతాల్లో లభించే త క్కువ పరిమితిలో ఉండే మందులపైనే ఆధారపడుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నిర్భంధం పెరిగిన కారణంగా కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుల నుంచి స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధులను కూడా చికిత్సకోసం పట్టణ ప్రాంతాలకు పంపించలేని పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల అనేక మంది తగిన వైద్యం అందుకోలేక మరణిస్తున్నారని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. తీవ్రమైన నిర్భంధంతో పట్టణ ప్రాంతాలతో ఉన్న సంబంధాలు తెగిపోవడం వారిని కోలుకోలేని దెబ్బతీస్తోంది. రోగాలు, గాయాలకు చికిత్సలకోసం బయటకు రాలేకపోతున్నారు. అడవిలోనే అందుబాటులో ఉన్న సొంత వైద్యంతోనే నెట్టుకొస్తున్నారు. కొందరు కోలుకుంటున్నా... మరికొందరు తీవ్ర రుగ్మతలతో మరణిస్తున్నారు. 

Updated Date - 2021-10-18T07:44:47+05:30 IST