గిరిజనులపై పోలీసుల కాల్పులు

ABN , First Publish Date - 2021-10-18T07:21:52+05:30 IST

గిరిజనులపై పోలీసుల కాల్పులు

గిరిజనులపై పోలీసుల కాల్పులు

నర్సీపట్నం/చింతపల్లి(విశాఖ), అక్టోబరు 17: విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు. గంజాయి కేసుల్లో నిందితులుగా భావిస్తూ చింతపల్లి మండలం గాలిపాడుకు చెందిన ముగ్గురు గిరిజనులను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలువురు గిరిజనులు వెంబడించారు. దాడికి వస్తున్నారని భావించిన పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు, బాధితులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి గాలిపాడు గ్రామానికి వచ్చారు. కిల్లో బాలకృష్ణ(35), కిల్లో భీమరాజు(26), నారా లోవ(30)లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గిరిజనులు అడ్డగించి గంజాయి కేసులతో వారికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తర్వాత మాట్లాడతాం.. అంటూ పోలీసులు ఆ ముగ్గురినీ నర్సీపట్నం తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నల్లగొండ పోలీసులు శనివారం సాయంత్రం అన్నవరం పంచాయతీ సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు, ఎంపీటీసీ సభ్యుడు కొర్రా సూరిబాబులకు ఫోన్‌ చేశారు. ఆదివారం ఉదయం లోతుగెడ్డ జంక్షన్‌కు వస్తే మాట్లాడుకుందామని చెప్పారు. వీరిద్దరితోపాటు మరో 15మంది వరకు గిరిజనులు జీపులో బయలుదేరి లంబసింగి(నర్సీపట్నం-లోతుగెడ్డ జంక్షన్‌) ఘాట్‌రోడ్డుకు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత పోలీసులు రెండు కార్లలో లంబసింగి ఘాట్‌ మీదుగా లోతుగెడ్డ వైపు వెళ్తున్నట్టు గుర్తించిన గిరిజనులు.. ఆ వాహనాలను అనుసరించారు. లోతుగెడ్డ జంక్షన్‌కు వెళ్లిన తరువాత పోలీసులు తమ వాహనాలను వెనక్కుతిప్పి, నర్సీపట్నం వైపు బయలుదేరారు. లంబసింగి ఘాట్‌ దాటిన తర్వాత తురబాల గెడ్డ సమీపంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో గిరిజనులు పోలీసుల వాహనం వద్దకు చేరుకున్నారు. తమపై దాడి చేయడానికి వచ్చారన్న ఉద్దేశంతో పోలీసులు వారిపై 5రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కిల్లో రాంబాబు, కిల్లో కామరాజులకు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వచ్చింది నల్లగొండ పోలీసులేనని చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డుడి ఆదివారం రాత్రి ప్రకటించారు. పోలీసుల బృందం.. నిందితులను అరెస్టుచేసి తీసుకెళుతున్న క్రమంలో గంజాయి స్మగ్గర్లు, వారి అనుచరులు కత్తులు, పదునైన ఆయుధాలతో  వెంబడించి, రాళ్లతో దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని తెలిపారు. 

Updated Date - 2021-10-18T07:21:52+05:30 IST