Abn logo
Oct 13 2021 @ 03:15AM

దివ్యాంగురాలిపై అత్యాచారం

ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. అనంతపురం జిల్లాలో దారుణాలు


బుక్కపట్నం, గుత్తిరూరల్‌, అక్టోబరు 12: దివ్యాంగ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగడితే.. ఆరేళ్ల చిన్నారిపై మరో యువకుడు అత్యాచారం చేశాడు. అనంతపురం జిల్లాలో మంగళవారం ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం మేరకు.. బుక్కపట్నం మండలంలోని గశికవారిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మంగళవారం ఉదయం సమీపంలోని కంపచెట్లలోకి వెళ్లింది. అక్కడ అదే ఊరికి చెందిన సాకే మహేశ్‌ అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో సమీపంలోని రైతులు వచ్చారు. దీంతో మహేశ్‌ పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 18 ఏళ్ల చరణ్‌.. ఆ చిన్నారిని గ్రామశివారులోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపింది. చిన్నారిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. చరణ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.