పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

ABN , First Publish Date - 2022-08-13T08:55:52+05:30 IST

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

హోం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జైళ్ల శాఖ డీజీకి నోటీసులు


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని  ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌, జైళ్ల శాఖ డీజీ ఎండీ అహసన్‌ రెజాకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ వి.సుజాతతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు... సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఏళ్లు గడిచినా న్యాయస్థానం ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పిటిషనర్‌, న్యాయవాది కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - 2022-08-13T08:55:52+05:30 IST