చిల్లర ఖర్చుల పేరిట దోపిడీ

ABN , First Publish Date - 2022-08-13T09:02:43+05:30 IST

చిల్లర ఖర్చుల పేరిట దోపిడీ

చిల్లర ఖర్చుల పేరిట దోపిడీ

సర్వే శాఖలో లెక్కకు రాని ఖర్చు రూ.15 కోట్లపైనే

తరచుగా ఖరీదైన టీవీలు, లాప్‌ట్యాప్ లు కొనుగోలు

కమిషనర్‌ మారినప్పుడల్లా రూ.కోట్లలో కొనుగోళ్లు

ఆ వస్తువులు కమిషనర్ల ఇళ్లలో ఏర్పాటు

బదిలీ అయ్యాక తిరిగి అప్పగించే ప్రసక్తే లేదు

జేసీల పేరిట భారీగా సొమ్ము డ్రా


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వంలో గుండు సూది కొనుగోలు చేయాలన్నా బిల్లులు చూపాలి. ఇందుకైన ఖర్చును స్టేషనరీ పేరిట లెక్క చూపాలి. ఇక ఏమాత్రం ప్రాధాన్యం లేని కొనుగోళ్లు మాత్రమే ఇతర ఖర్చుల(మి్‌సలీనియస్‌) రూపంలో చూపిస్తారు. నె లకు మహా అయితే వందల నుంచి రెండు మూడు వేలల్లో ఆ ఖర్చు ఉంటుంది. సంవత్సరానికి ఆ ఖర్చు పదివేలకు మించదు. కానీ సర్వే శాఖలో అన్నింటికంటే మిస్‌లీనియస్‌ ఖర్చులే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు సొమ్మును కూడా మీ సేవ నిధుల నుంచే వాడేసుకున్నారు. గత కొన్నేళ్లుగా దాదాపు 15 కోట్లపైనే ఖర్చుపెట్టినట్లుగా మీసేవ స్టేట్‌మెంట్‌లను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. మీ సేవ నిధుల గోల్‌మాల్‌పై విజయవాడకు చెందిన పి.వెంకటేష్‌ అనే వ్యక్తి ఐటీ శాఖ, కాగ్‌తోపాటు సీసీఎల్‌ఏకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు జతచేసిన మీ సేవ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే మిస్‌లీనియస్‌ ఖర్చులే సింహభాగంగా ఉన్నాయి. సర్వే ఉద్యోగులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. డీఐఎల్‌ఆర్‌ఎంపీతోపాటు వివిధ స్కీమ్‌ల కింద నిధులు ఇస్తున్నారు. కానీ, ఆ పేరిట కూడా మీ సేవ నిధులను వాడారు. మీ సేవ నిధులను అడ్డగోలుగా డ్రాచేసి వినియోగించుకునేందుకు జిల్లాల జేసీల నుంచి సర్వే శాఖ ఏడీలు, కమిషనరేట్‌లో పనిచేసే వివిధ కేడర్‌ల ఉద్యోగులనూ వాడుకున్నారు. నేరుగా జిల్లా జాయింట్‌ కలెక్టర్ల పేరిట కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఆ సొమ్మును ఏం చేశారో? ఎక్కడ ఖర్చుపెట్టారో పరమ రహస్యంగా ఉంచారు. ఉమ్మడి జిల్లాల జేసీలు, సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్ల పేరిట రూ.5 కోట్లపైనే డ్రా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి సగటున ఒక్కో జేసీ పేరిట 5 నుంచి 11 లక్షల రూపాయల మేర డ్రా చేశారు. శిక్షణ కోసమైతే అందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది. కార్ల అద్దెలు, వాటి సర్వీసు, ఇంధన ఛార్జీల పేరిట రూ.4.5 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఇందుకోసం కూడా ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అయినా మీ సేవ కింద భారీగా ఖర్చులు రాసుకున్నారు. ఉద్యోగుల పేరిట రూ.10 వేల నుంచి రూ.3 లక్షల మేర డ్రా చేశారు. తమ పేరిట చెక్‌లు తీసుకునేందుకు ఉద్యోగులు భయపడితే ఉన్నతాధికారి వారిని భయపెట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా కోట్లాది రూపాయలను వీరి పేరిట డ్రాచేసి ఉన్నతాధికారులే తీసుకున్నారని తెలిసింది. మీ సేవ నిధులతో ఖరీదైన టీవీలు, యాపిల్‌, మైక్రోసాప్ట్‌ సర్ఫేస్‌ లాప్‌టా్‌పలు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు భారీగా కొనుగోలు చేశారు. కమిషనర్‌ మారినప్పుడల్లా వీటిని కొనుగోలు చేసినట్లు మీ సేవ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఒక్కో టీవీని సగటున రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు. కమిషనర్లుగా పనిచేసిన కొందరు అధికారులు వాటిని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నారు. బదిలీ అయిన తర్వాత వాటిని తిరిగి డిపార్ట్‌మెంట్‌కు అప్పగించలేదు. ఓ అధికారి దగ్గర ఉన్న టీవీని డిపార్ట్‌మెంట్‌కు అప్పగించమని కోరగా...ఇంట్లో చెడిపోయిన ఓ టీవీని సీల్డ్‌ డబ్బాలో పెట్టి పంపించారు. సర్వేలో ఉన్నతాధికారులకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఓ డిప్యూటీ  ఇన్‌స్పెక్టర్‌(డీఐఓ) పేరిట గత ఆరేళ్ల కాలంలో రూ.52 లక్షలకు చెక్‌లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ సొమ్మును ఆయన పేరిట ఎందుకు  ఇచ్చారు? వాటిని ఎక్కడ ఖర్చుపెట్టారో లెక్కాపత్రం లేకపోవడం విశేషం. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వద్ద పనిచేసిన ఓ ప్రైవేటు పీఎస్‌ రిటైర్‌ అవ్వగా అతన్ని తిరిగి ఔట్‌సోర్సింగ్‌  కింద కొనసాగించారు. అతనికి ఏడాది పాటు వేతనాలను మీ సేవ నుంచే చెల్లించారు. మీ సేవ నిధుల దుర్వినియోగంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురిస్తోన్న నేపథ్యంలో బాధిత ఉద్యోగులు ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. తన పేరిట రూ.2 లక్షల చెక్‌ను తీసుకోనందుకు తనను తీవ్రంగా భయపెట్టారని, చివరకు వేరే కారణాలు చూపించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట చెక్‌లు తీసుకోనందుకు పదోన్నతి ఆపేశారని మరో ఉద్యోగి వాపోయారు. 


Updated Date - 2022-08-13T09:02:43+05:30 IST