కృష్ణమ్మకు వరదపోటు

ABN , First Publish Date - 2022-08-13T08:05:47+05:30 IST

కృష్ణమ్మకు వరదపోటు

కృష్ణమ్మకు వరదపోటు

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి హెచ్చరిక జారీ..

సముద్రంలోకి 4.44 లక్షల క్యూసెక్కులు విడుదల


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గరిష్ఠ నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. శ్రీశైల జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను, ప్రస్తుతం  213.40టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 3,94,290 క్యూసెక్కులు వస్తుంటే, దిగువకు 4,39,694 క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 305.62 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీరు వచ్చినట్టు(4,19,485 క్యూసెక్కులు) దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 32.7119 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 3,92,623 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 3,57,946 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం 3 లక్షల క్యూసెక్కులు దాటడంతో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ 70 గేట్లను తొమ్మిది అడుగుల మేర ఎత్తేశారు. 4,44,000 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శనివారం ఈ ప్రవాహం 5లక్షల క్యూసెక్కులు దాటుతుందని నిపుణులు చెబుతున్నారు.


లంకల్లోకి గోదారి వరద

గోదావరి వరద ఎగువన తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం నీటిమట్టం 15 అడుగులు ఉంది. సముద్రంలోకి 14,76,919 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి నీటిమట్టం తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం నీటిమట్టం 52.10 అడుగులు ఉంది. 13.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండోప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలోని లంక  గ్రామాల్లోని కాజ్‌వేలు, నివాస గృహాలకు సైతం గోదావరి వరద నీరు ముంచెత్తింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 40కిపైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లాలో ఉన్న వశిష్ఠ, వైనతేయ, గౌతమీ, వృద్ధగౌతమీ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోకి  వరద నీరు ప్రవేశించింది. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో పెళ్లి బృందాలు ట్రాక్టర్లపై కాజ్‌వేను దాటి బాలబాలాజీ దేవస్థానానికి వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు సాగించే రహదారిలో కడమ్మ వంతెన నీటిమునిగింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30కి పైగా గ్రామాలను మూడు రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది. కాగా, తమిళనాడుకి చెందిన కారు భద్రాచలం నుంచి  ఒడిసాకు వెళుతున్న క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో రాయనపేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న గోదావరి వరద నీటిలో చిక్కుకుంది. రహదారి నుంచి 100 మీటర్ల వరకు కారు కొట్టుకుపోయింది. అందులోని ముగ్గురు వ్యక్తులు కేకలు వేయడంతో స్థానికులు గమనించి వారిని కాపాడారు. తరువాత వరదలో చిక్కుకున్న కారుని తాళ్ల సాయంతో బయటకు లాగారు.

Updated Date - 2022-08-13T08:05:47+05:30 IST