ఇక ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ!

ABN , First Publish Date - 2022-05-23T08:40:54+05:30 IST

ఇక ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ!

ఇక ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ!

ఎప్పటికప్పుడు వాప్కో్‌సతో నాణ్యతా ప్రమాణాల పరీక్ష

మానిటరింగ్‌ యూనిట్‌ను వెంటనే ప్రారంభించండి

ప్రధాన పనులపై వేర్వేరుగా మేనేజ్‌మెంట్‌ యూనిట్లు

హైడ్రో శాండ్‌ ఫిల్లింగ్‌ విధానంలో గుంత పూడ్చండి

రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామ్‌ బృందం ఆదేశం

డయాఫ్రం వాల్‌కు నష్టంపై 3 నెలల్లో అధ్యయనం, అంచనా

జలశక్తి సలహాదారు వెల్లడి 


అమరావతి/పోలవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులన్నిటినీ ఇకపై ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తామని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ పనులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన ప్రధాన నిర్మాణాలపై నిరంతర సమీక్ష కోసం విభాగాలవారీగా వేర్వేరు మేనేజ్‌మెంట్‌ యూనిట్లను రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి.. ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరె ఆధ్వర్యంలో కేంద్ర జలసంఘం, డీడీఆర్‌పీ, సీఎ్‌సఎంఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారుల బృందం శని, ఆదివారాల్లో ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పనులను సమీక్షించింది. రాష్ట్ర జల వనరుల మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకరబాబు కూడా హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో కేంద్ర బృందం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా మానిటరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ ద్వారా ఇది జరగాలని తెలిపింది. ప్రాజెక్టు పనులన్నీ నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ విధానాన్ని సిద్ధం చేయాలని పేర్కొంది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్న జీ-హిల్‌ను తొలగించడంపైనా సాంకేతిక అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం వద్ద ఏర్పడిన గుంతను హైడ్రో శాండ్‌ ఫిల్లింగ్‌ విధానంలో పూడ్చే విషయంలో సీఎ్‌సఎంఆర్‌తో పరీక్షలు చేయించాలని తెలిపింది. గుంతకు దూరంగా శాండ్‌ ఫిల్లింగ్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చినందున.. దానిని కొనసాగిస్తూనే.. గుంతను పూడ్చడంపై శాస్త్రీయ విధానాన్ని అవలంబించాలని ఆదేశించింది. ఇవన్నీ 60 రోజుల్లోనే పూర్తికావాలని స్పష్టం చేసింది. కాగా.. సమావేశంలో శ్రీరామ్‌ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో డయాఫ్రం వాల్‌ పరిస్థితిపై అధ్యయనం పూర్తిచేసి జరిగిన నష్టం, అయ్యే ఖర్చుపై అధికారులు అంచనా వేస్తారన్నారు. పోలవరం నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ఢిల్లీలోనే నిర్ణయం తీసుకున్నామని, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సవరించిన అంచనా వ్యయం కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. 


గత ప్రభుత్వ తప్పిదం వల్లే: అంబటి విమర్శ

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్‌ నిర్మించడం గత ప్రభుత్వం చేసిన చరిత్రాత్మక తప్పిదమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సమావేశంలో విమర్శించారు. ఎంతవరకు దెబ్బతిందో అంచనా వేయడం కష్టతరంగా మారిందని, డయాఫ్రంవాల్‌ దెబ్బతినడం ఏ ప్రాజెక్టు చరిత్రలోనూ జరగలేదని, ఇదే ప్రఽథమమని అన్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల గత వరదలకు భారీ అగాధాలు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చడానికే రూ.1,800 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయన్నారు. డయాఫ్రంవాల్‌ మరమ్మతులు చేయాలా లేదా పునర్మించాలా అనే విషయాలపై అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. తాము గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం లేదని, నిపుణుల పరిశీలనాంశాలను చెబుతున్నామన్నారు. సమీక్షలో పీపీఏ, జలసంఘం, డీడీఆర్‌పీ, సీఎ్‌సఎంఆర్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌, జలవనరుల శాఖ సలహాదారు ఎంవెంకటేశ్వరరావు, ఎస్‌ఈ నరసింహమూర్తి, ఇరిగేషన్‌ ఈఈ బాలకృష్ణ, మల్లికార్జునరావు, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T08:40:54+05:30 IST