మహా.. ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-23T08:04:50+05:30 IST

మహా.. ఏర్పాట్లు

మహా.. ఏర్పాట్లు

27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు

ఒంగోలు వేదికగా వందెకరాల్లో ప్రాంగణం 

పదివేల మంది ప్రతినిధులకు ఆహ్వానం

ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలు


ఒంగోలు, మే 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు వేదికగా జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరగనుండగా నగర శివారులో వంద ఎకరాల పొలాలను ఇందుకోసం అనువుగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్లు కొవిడ్‌ కారణంగా మహానాడును వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించగా, ఈ దఫా బహిరంగ సభా ప్రాంగణం కావడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తి కావడం, ఎన్టీఆర్‌ శత జయంతి వంటి ప్రాధాన్యత అంశాల నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ఒంగోలు వేదిక అయింది. నగర  సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో మహానాడు నిర్వహణకు అక్కడి రైతులు ముందుకు వచ్చారు. దాదాపు 100 ఎకరాల్లో ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. తొలిరోజు ప్రతినిధుల సభ, రెండవ రోజు బహిరంగ సభ ఒకే  వేదికపై జరగనున్నాయి.  అందుకు వీలుగా ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. ఎంపిక చేయబడిన ప్రతినిధులు సుమారు 10వేల వరకు ఉండనుండగా, ప్రాంగణంలో 12వేల మంది కూర్చొనేలా జర్మన్‌ షెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.  మహానాడు ప్రాంగణానికి సమీపంలోనే ప్రతినిధులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.  పెద్ద సంఖ్యలో వాహనాలలో నేతలు వచ్చే అవకాశం ఉండగా పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లకు ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు భూమిపూజ చేసి ప్రారంభించగా ప్రతిరోజూ ముఖ్యమైన రాష్ట్రస్థాయి నాయకులు ఎవరో ఒకరు వచ్చి పరిశీలిస్తున్నారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లన్నీ ఈ నెల 25కు పూర్తి చేసేలా పనిచేస్తున్నట్లు అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధి రమణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తొలిసారి ఒంగోలులో మహానాడు జరగనుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఒకవైపు మహానాడు ప్రాంగణం వద్దకు వచ్చి ఏర్పాట్లు పరిశీలించి వెళ్తూనే, మరోవైపు బహిరంగ సభకు జన సమీకరణపై దృష్టి సారించారు. మూడు రోజుల క్రితమే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నియోజకవర్గ స్థాయి ్గసమావేశం నిర్వహించి నేతలకు బాధ్యతలు అప్పగించారు.  కొండపి ఎమ్మెల్యే డీఎ్‌సబీవీ స్వామి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ నేతృత్వంలో శనివారం రాత్రి కొండపి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. 


అతిథి గృహాలు ముందస్తుగానే బుకింగ్‌

మహానాడు నేపథ్యంలో ఆ రెండు రోజులు ఒంగోలులోని హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు అతిథిగృహాల్లోని గదులతోపాటు కల్యాణ మండపాలు అన్నింటినీ టీడీపీ నేతల బస కోసం ఇప్పటికే బుక్‌ చేశారు. ఒంగోలు నగరంలో వసతులు పరిమితంగానే ఉండటంతో నెల్లూరు నుంచి విజయవాడ వరకు ఉండే పట్టణాల్లో బసకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


26న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

ఈ నెల 26వ తేదీన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. 27వ తేదీ నుంచి ఒంగోలులో జరిగే పార్టీ మహానాడు సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలు, సమావేశ ఎజెండా, పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాలపై ఇందులో చర్చించి వాటిని ఆమోదిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-23T08:04:50+05:30 IST