సీబీఐ కోర్టు అనుమతి ఉందా?: యనమల
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): దావోస్ సమావేశాలకు అని బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రహస్యంగా లండన్‌లో ఆగడం వెనుక లోగుట్టు ఏమిటని శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దండుకొన్న సంపద దాచుకోవడానికే లండన్‌లో ఆయన రహస్యంగా దిగారన్న అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి జగన్ అధికారికంగానే లండన్ వెళ్లొచ్చు. చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఏ దేశ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు? ఏ దేశానికి వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది? మీరు ఎక్కడెక్కడకు వెళ్లడానికి అనుమతి కోరారు? మీకు కోర్టు అనుమతి వచ్చి ఉంటే అధికారిక పర్యటనలో లండన్‌ను ఎందుకు చేర్చలేదు? షెడ్యూల్లో లేని లండన్‌లో ఎందుకు దిగారు? అనుమతి ఇవ్వకపోయినా లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కాదా? సీబీఐ కేసుల్లో మొదటి నిందితునిగా ఉన్న జగన్మోహన్రెడ్డి దావోస్ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లడానికి ఈ నెల 19 నుంచి 31 వరకూ అనుమతి ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. పధ్నాలుగు కేసుల్లో ముఖ్యమంత్రి ఎ1 నిందితునిగా ఉన్నారు. ఆయన గత చరిత్ర దృష్ట్యా అనుమానాలు కలగడం సహజం. అధికారులను వదిలేసి భార్య, మరొకరితో మాత్రమే ఆయన లండన్ వెళ్లడంలో లోగుట్టు ఏమిటో ప్రజలకు తెలియాలి. ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా.. తన కోసమా? అక్రమార్జన నల్ల ధనం తరలింపు కోసమా అన్నది మా ప్రశ్న’ అని ఆయన అన్నారు. ‘ప్రత్యేక విమానానికి భారీ ఖర్చు అవుతుంది. రెగ్యులర్ విమానాలకు అంత ఖర్చు అవదు. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై ఇది అదనపు భారం కాదా? ప్రజా ధనం దుర్వినియోగం చేసే హక్కు మీకెక్కడిది’ అని ఆయన ప్రశ్నించారు.