సీఐడీ కస్టడీకి ‘స్మార్ట్’ సుధాకర్‌

ABN , First Publish Date - 2022-09-16T09:50:14+05:30 IST

సీఐడీ కస్టడీకి ‘స్మార్ట్’ సుధాకర్‌

సీఐడీ కస్టడీకి ‘స్మార్ట్’  సుధాకర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ చైర్మన్‌ ఇందుకూరి సుధాకర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీకి కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుధాకర్‌ రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలుచేశాడు. రూ.1.5 లక్షల నుంచి రూ.ఐదు లక్షలు చొప్పున దాదాపు ఐదు వేల మంది నుంచి రూ.300 కోట్లు వరకూ వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో బోగస్‌ నియామక పత్రాలు అందజేసి సుధాకర్‌ తమను మోసగించాడంటూ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం సంగాయిగూడేనికి చెందిన జి.రవికుమార్‌ అక్కడి పోలీసులకు గత నెల 18న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అమరావతిలోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు బాధ్యతలను విశాఖలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేశారు. విశాఖ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ బుచ్చిరాజు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి సుధాకర్‌ను ఈ నెల 11న అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచారు. సుధాకర్‌కు ఈ నెల 26 వరకూ కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే మధ్యవర్తుల ద్వారా ఎంత వసూలు చేశారు?, ఆ డబ్బు ఎక్కడకి మళ్లించారు? తదితర వివరాలు సుధాకర్‌ నుంచి రాబట్టవలసి ఉన్నందున అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన కోర్టు సుధాకర్‌ను నాలుగు రోజుల పాటు సీఐడీ కస్టడీలో తీసుకునేందుకు గురువారం అనుమతి ఇచ్చింది. దీంతో వెంటనే సీఐడీ అధికారులు సుధాకర్‌ను కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-09-16T09:50:14+05:30 IST