జిల్లా మారినా అదే తీరు!

ABN , First Publish Date - 2022-04-04T16:25:41+05:30 IST

జిల్లా మారినా అదే తీరు!

జిల్లా మారినా అదే తీరు!

దేవదాయ శాఖ అధికారి వైఖరిపై సిబ్బంది ఆవేదన  


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి) కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. విశాఖ అధికారుల పరిధి తగ్గింది. అధికారా ల్లో కోత పడింది. అయినా కొందరి తీరు మారడం లేదు. దేవదాయ శాఖ అధికారి ఆదివారం అనకాపల్లి వెళ్లి నూకాలమ్మ ఆలయంలో పలువురిని హెచ్చరించి వచ్చారని తెలిసింది. కొత్త అమావాస్యరోజే నూకాలమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి. ఆ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారి అమ్మవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు, పెద్దవారు ఎవరు వచ్చినా తనకు ముందుగా తెలియజేయాలని, తానే వారికి దగ్గరుండి దర్శనాలు చేయిస్తానని ఆదేశించారని సిబ్బంది చర్చించుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ ఈఓతో పాటు ప్రభుత్వం ఫెస్టివల్‌ ఆఫీసర్‌ని నియమించింది. అటువంటివేమైనా ఉంటే వారే చూసుకోవాలి. పైగా జిల్లాల విభజన పూర్తయింది. ఇకపై జిల్లా అధికారి పర్యవేక్షణలో ఆ ఆలయం ఉండదు. అయినా అధికారి తనదైన శైలిలో హుకుం జారీ చేశారని, కింది స్థాయి ఉద్యోగులు కావడంతో సరేనని చెప్పారని సమాచారం. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చారు. జిల్లా అధికారికి ఆ సమాచారం ఆలయ సిబ్బంది చెప్పడంతో విశాఖ నుంచి వెళ్లి.. తానే అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఎంపీని సాగనంపుతుండగా... గేటు వద్ద విశాఖలో కనకమహాలక్ష్మి దేవస్థానానికి చెందిన ట్రస్టు బోర్డు సభ్యులు ఒకాయన దర్శనానికి వెళుతూ కనిపించారు. దాంతో ఆయనపై ఆ అధికారి గళమెత్తారని అక్కడి వారు చెబుతున్నారు. తనకు తెలియకుండా ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నించి నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కొత్త జిల్లాలైన అనకాపల్లి, పాడేరులకు కొత్త జిల్లా అధికారులను(అసిస్టెంట్‌ కమిషనర్లు) ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఆ పోస్టు కోసం నూకాలమ్మ ఆలయం ఈఓ ప్రయత్నిస్తున్నారు. ఆయన విజయనగరంలో మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయానికి ఈఓ.  గ్రేడ్‌-1 అధికారి కావడంతో ఏసీగా పదోన్నతి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అనకాపల్లిలో అత్యధికులు ఉండే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్థానిక  నేతల అండతో ధీమాగా ఉన్నారు. ఇది తెలుసుకున్న విశాఖ జిల్లా అధికారి... ‘నీకు ఏసీపోస్టు ఎవరిస్తారో.. ఎలాఇస్తారో చూస్తా!!’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. 


నూకాలమ్మ ఆలయంలోనే జిల్లా కార్యాలయం

అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలోనే జిల్లా దేవదాయ శాఖ అధికారి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఫర్నిచర్‌ తీసుకొని బోర్డు పెట్టనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-04-04T16:25:41+05:30 IST