అదనపు జేసీలకు మంగళం

ABN , First Publish Date - 2022-04-04T09:08:23+05:30 IST

అదనపు జేసీలకు మంగళం

అదనపు జేసీలకు మంగళం

డీఆర్వోలకే కీలక బాధ్యతలు.. కొత్త జిల్లాలకు డీఆర్వోల నియామకం

అదనపు జేసీలుగా ఉన్న నాన్‌-రెవెన్యూ అధికారులు సొంత శాఖలకు బదిలీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో అదనపు జేసీల వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలికింది. మళ్లీ పాత పద్ధతిలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వ్యవస్థనే మరింత బలోపేతం చే యాలనుకుంటోంది. ఐఏఎస్‌ అధికారుల కొరత, కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి భౌగోళిక విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో జిల్లాకొక జాయింట్‌ కలెక్టరు (జేసీ)నే ఉంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్‌, జేసీ, ఎస్పీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండు, మూడో జేసీ పోస్టులను దాదాపుగా ఎత్తివేసినట్లే. నాన్‌కేడర్‌ అంటే స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌తో భర్తీచేస్తోన్న అదనపు జేసీ (ఆసరా) పోస్టులను ఎత్తివేసి.. వాటి స్థానంలో డీఆర్వోలనే  కొనసాగించాలనుకుంటోంది. అంటే అదనపు జేసీలు చూసే బాధ్యతలు కూడా వారికే అప్పగించనున్నారు. అంటే.. ఇకపై జిల్లాల్లో డీఆర్వోలే కీలకం కాబోతున్నారన్న మాట. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు జిల్లాలకు ఇప్పుడున్న డీఆర్వోలను కొనసాగిస్తూ, మిగిలిన 20 జిల్లాలకు కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు (జీవో 580) జారీ చేశారు. ఇంకోవైపు.. రెవెన్యూయేతర విభాగాల నుంచి వచ్చి పలు జిల్లాల్లో ఆసరా జేసీలుగా పనిచేస్తున్న అధికారులను సొంత శాఖలకు సాగనంపారు. కర్నూలు ఆసరా జేసీగా ఉన్న ఎంకేవీ శ్రీనివాసులును వ్యవసాయ శాఖకు, శ్రీకాకుళం ఆసరా జేసీ కె.శ్రీరాములు నాయుడును సహకారశాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు.


కొనసాగుతున్న డీఆర్వోలు..

విజయనగరం: ఎం.గణపతిరావు 

విశాఖపట్నం: ఎస్‌.శ్రీనివాసమూర్తి 

కృష్ణా: ఎం.వెంకటేశ్వర్లు 

ప్రకాశం: పులి శ్రీనివాస్‌? 

వైఎస్‌ఆర్‌ ఎ.మలోల? 

అనంతపురం: బి.గాయత్రీదేవి



Updated Date - 2022-04-04T09:08:23+05:30 IST