కేంద్రాన్ని అడుక్కునే స్థితిలో జగన్‌

ABN , First Publish Date - 2021-11-13T08:03:43+05:30 IST

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏపీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాల్లో భాగంగా..

కేంద్రాన్ని అడుక్కునే స్థితిలో జగన్‌

  • ఏపీ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులు కావాలి 
  • కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు 
  • తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు
  • కేసీఆర్‌లా లోపల కాళ్లు పట్టుకోం
  • ఆయన పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు?
  • హైదరాబాద్‌ ఉండి కూడా తెలంగాణ అప్పులపాలైంది
  • ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌


నిజామాబాద్‌/అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏపీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాల్లో భాగంగా.. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు అడుక్కు తింటారని అప్పటి మంత్రులు, నేతలు అన్నారు. ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి ఏర్పడింది. నిధుల కోసం ఆ రాష్ట్ర సీఎం జగన్‌.. కేంద్రం వద్ద అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులు కావాలి’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాదిరిగా బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం జగన్మోహన్‌రెడ్డికితెలియదన్నారు. కేంద్ర నిధుల కోసం తాము బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో బ్యాంకులను అడిగితే తెలుస్తుందన్నారు. కేసీఆర్‌ తరచుగా కేంద్రం వద్దకు వెళ్తున్నారని, నిధులిస్తే కేంద్రంలో చేరుతామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పెద్ద పాలకుండ లాంటిదని, అలాంటి హైదరాబాద్‌ ఉండి కూడా తెలంగాణ అప్పుల పాలైందని ఎద్దేవా చేశారు.


తెలంగాణ నేతల వైఖరి.. అత్తమీద కోపాన్ని దుత్తమీద చూపించినట్లుగా ఉందన్నారు. కాగా, ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌ చేయించినవి కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేసీఆర్‌ మెప్పు పొందేందుకే కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఏపీకి లేదని, కేంద్రాన్ని నిధులు అడగడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందని అన్నారు.

Updated Date - 2021-11-13T08:03:43+05:30 IST