ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-02-22T07:09:35+05:30 IST

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (50) హఠాన్మరణం

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

  • మేకపాటి కుటుంబంలో పెను విషాదం
  • గుండెపోటుతో కన్నుమూసిన యువ మంత్రి
  • కాఫీ అడిగి... సోఫాలోనే కుప్పకూలిన గౌతమ్‌
  • ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం
  • వారంపాటు దుబాయ్‌లో అధికారిక పర్యటన
  • కొవిడ్‌ అనంతర సమస్యలతోనే గుండెపోటు!
  • నివాళులు అర్పించిన జగన్‌, చంద్రబాబు, పవన్‌
  • ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు
  • రేపు ఉదయగిరిలో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొవిడ్‌తో కోలుకున్న ఆయన ఇటీవలే పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లారు. వారం పాటు అక్కడ జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆదివారం రాత్రి వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఇంత విషాదం జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు. 


మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారిక పర్యటన ముగించుకుని... శనివారం రాత్రి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి  హైదరాబాద్‌లో జరిగిన బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 7.16 గంటలకు గౌతమ్‌రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రనొప్పితో సోఫా నుంచి కిందకు ఒరిగిపోయారు. ఆయన సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరిచి... సిబ్బందిని అప్రమత్తం చేశారు. డ్రైవర్‌ నాగేశ్వరరావు పరుగు పరుగున అక్కడికి వచ్చారు.




నొప్పితో ఇబ్బంది పడుతున్న గౌతమ్‌ రెడ్డి ఛాతీ మీద చేతితో నొక్కి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఛాతీలో నొప్పిగా ఉందని, మంచి నీళ్లు కావాలని గౌతమ్‌ రెడ్డి అడిగారు. కానీ... నీళ్లు ఇచ్చినప్పటికీ  తాగలేకపోయారు. ఆయనను కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర, కార్డియాక్‌, క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు ఆయనను పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చే సరికే గౌతమ్‌రెడ్డికి కార్డియాక్‌ అరెస్టు జరిగినట్లు నిర్ధారించారు. అయినప్పటికీ... సీపీఆర్‌తోపాటు అధునాతన కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌తో గౌతమ్‌ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నరపాటు తమ ప్రయత్నాలు కొనసాగించారు. అయినప్పటికీ... ఫలితం లేకపోవడంతో, ‘మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూశారు’ అని సోమవారం ఉదయం 9.16 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు. గౌతమ్‌రెడ్డికి గత నెల 22న కొవిడ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. కొవిడ్‌ అనంతర  సమస్యల వల్లే గుండెపోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. 



అధికారిక లాంఛనాలతో...

మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు జిల్లా ఉదయగిరికి తరలిస్తారు. బుధవారం ఉదయం ఉదయగిరిలో మేకపాటి కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్‌ రెడ్డి మృతికి సంతాప సూచకంగా సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. 


కన్నీరు మున్నీరు...

అప్పటిదాకా తమ ముందే నవ్వుతూ తిరిగిన గౌతమ్‌రెడ్డి.. ఇక లేరనే విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారి విషాదానికి అంతే లేకుండా పోయింది. కుమారుడి మరణ వార్త తెలియగానే రాజమోహన్‌రెడ్డి కుప్పకూలిపోయారు. తల్లి మణిమంజరి కన్నీరు మున్నీరుగా విలపించారు. గౌతమ్‌ దంపతులకు కుమార్తె సాయి అనన్యారెడ్డి, కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. తండ్రి మరణ వార్త తెలియగానే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.


తరలివచ్చిన నేతలు, అభిమానులు

గౌతమ్‌రెడ్డి మరణ వార్తను తెలుసుకున్న హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు అభిమానులు పెద్దఎత్తున అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్‌, తల్లి విజయలక్ష్మి ఆస్పత్రి వద్దకు చేరుకుని బందువులను ఓదార్చారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆస్పత్రికి వచ్చి మేకపాటి మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 


ముఖ్యమంత్రి జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఏపీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌, బొత ్స సత్యనారాయణ, పేర్ని నాని అక్కడికి వచ్చారు. టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస గౌడ్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నేతలు జానారెడ్డి,  ఈటల రాజేందర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీ, మర్రి శశిధర్‌ రెడ్డి తదితరులు గౌతమ్‌ రెడ్డికి నివాళులు అర్పించారు.



చూస్తుండగానే...

ఉదయం 6 గంటలు: గౌతమ్‌ రెడ్డి ఎప్పట్లాగానే ఉదయం 6 గంటల సమయంలో నిద్ర లేచారు.

6.30: అరగంటపాటు ఫోన్‌తో గడిపారు.

7.00: రెండో అంతస్తుకు వెళ్లారు.

7.12: డ్రైవర్‌ నాగేశ్వరరావును పిలవాలని, కాఫీ తీసుకురావాలని వంటమనిషికి చెప్పారు.

7.16: గుండెపోటు రావడంతో సోఫా నుంచి మెల్లిగా కిందకు ఒరిగారు. ఆయన సతీమణి కేకలు వేయడంతో... డ్రైవర్‌ నాగేశ్వరరావు అక్కడికి వచ్చి మంత్రి ఛాతీ మీద చేతితో నొక్కి ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు.

7.45: అపోలో ఆస్పత్రికి తరలింపు

9.16: గౌతమ్‌ రెడ్డి కన్నుమూసినట్లు ప్రకటన.


ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం  

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి జిమ్‌ అంటే ఆరో ప్రాణం అని చెబుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటల సేపు ఆయన జిమ్‌లో గడిపేవారు. అందుకు అనుగుణంగా నెల్లూరు, హైదరాబాద్‌లలోని తన నివాసాల్లోనే జిమ్‌ కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శరీరాకృతి వెనుక గౌతమ్‌రెడ్డి కఠోర శ్రమ, క్రమశిక్షణ దాగున్నాయని చెబుతారు.  గౌతమ్‌రెడ్డి ఆహార ప్రియుడు అనే ప్రచారం ఉంది. ఎంత తింటారో అంత ఖర్చు చేసేవరకు జిమ్‌ రూమ్‌ వదలి బయటకు రారని, అందుకే ఆయన అంత ఫిట్‌గా ఉండేవారని అనుచరులు చెబుతారు. సోమవారం ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు వచ్చిందనే వార్తను ప్రజలు నమ్మలేకపోయారు. 




నివాళులర్పించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/ బంజారాహిల్స్‌: మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తీసుకువచ్చారు. మంత్రి కేటీఆర్‌ను నివాళులర్పించడానికి అక్కడకు చేరుకున్నారు. ఆయనను చూడగానే మేకపాటి రాజమోహన్‌రెడ్డి దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చారు. ‘‘గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయనతో 12ఏళ్లుగా స్నేహం ఉంది. ఈవార్త వినడం షాక్‌కు గురిచేసింది’’అని కేటీఆర్‌ తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు.




సీఎం జగన్‌ దిగ్ర్భాంతి


మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. భార్య భారతితో కలసి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం దంపతులు ఓదార్చారు. సీఎం జగన్‌ను పట్టుకొని గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. సీఎంతో పాటు ఎంపీ విజయాసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు నేతలున్నారు. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం మధ్యాహ్నం 2.47 తిరిగి వెళ్లిపోయారు.


Updated Date - 2022-02-22T07:09:35+05:30 IST